బండ్ల బాపయ్య సంస్థలు స్థాపించిన నాటి భవనం
వేటపాలెం (బాపట్ల జిల్లా): వేటపాలెం బండ్ల బాపయ్య విద్యాసంస్థ వందేళ్లు పూర్తిచేసుకుంది. ఈ బడిని 1921 నవంబర్ 4న బండ్ల బాపయ్య శెట్టి హిందూ మాధ్యమిక పాఠశాల పేరుతో నెలకొల్పారు. దీనికి ఐదెకరాల స్థలం కేటాయించి అందులో శాశ్వత భవనం నిర్మించారు. దీనికి అప్పట్లో ప్రభుత్వం రూ.12,457 గ్రాంటు కూడా మంజూరు చేసింది. అప్పటి నుంచి పాఠశాల దినదినాభివృద్ధి చెందింది.
బడికి అనుబంధంగా 1946లో హైస్కూలు, 1961లో హయ్యర్ సెకండరీ స్కూల్, 1969లో జూనియర్ కళాశాల, 1981లో డిగ్రీ కళాశాల ఏర్పాటయ్యాయి. ఈ పాఠశాలలోని ఒక భాగంలో కొంత కాలం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులూ నిర్వహించారు. 400 మంది ఉపాధ్యాయులు ఇక్కడ శిక్షణ పొందారు. పూర్వం ఈ పాఠశాలను అందరూ ఇంగ్లిషు బడి అని పిలిచేవారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి ఎందరో విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. ఇక్కడ చదువుకున్న ఎందరో ఉన్నతస్థానాలు అధిరోహించారు. విదేశాల్లోనూ ఉన్నత స్థితికి చేరారు.
చేయూతగా రాధాకృష్ణయ్య హాస్టల్
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం పథకం తరహాలో ఈ పాఠశాలలో స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి విద్యార్థులకు భోజనం పెట్టేవారు. గొల్లపూడి రాధాకృష్ణయ్య ఈ విధానానికి నాంది పలికారు. 1933లో పాఠశాలకు అనుసంధానంగా ఉచిత భోజన హాస్టల్ ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ రాధాకృష్ణయ్య వారసుల ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతుండడం విశేషం.
నవంబర్‌లో శతజయంత్యుత్సవాలు
బండ్ల బాపయ్య విద్యా సంస్థ నెలకొల్పి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శత జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా జరపనున్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, కాలేజీలో చదివి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులు పాల్గొననున్నారు.
ఇంగ్లిష్ బాగా చెప్పేవారు
నేను 1971–73లో వేటపాలెం బండ్ల బాపయ్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివాను. అప్పట్లోనే అధ్యాపకులు ఇంగ్లిషు బోధించారు. అందువల్ల నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఇంగ్లిష్‌లో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. గొల్లపూడి రాధాకృష్ణయ్య హాస్టల్లో మధ్యాహ్న భోజనం చేసేవాడిని. అది నా అదృష్టం.
– డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు, గుండె శస్త్ర చికిత్స నిపుణుడు, స్టార్ హాస్పిటల్, హైదరాబాద్
ఉపాధ్యాయ వృత్తికి పునాది ఇక్కడే
ఈ పాఠశాలలో ప్రవేశానికి ఎంట్రన్స్ నిర్వహించేవారు. 1940లో 4వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాశాను. పాసై బడిలో చేరాను. మా తల్లిదండ్రులు ఇంగ్లిష్ బడిలో చదువుతున్నానని గొప్పగా చెప్పుకునేవారు. ఈ విద్యా సంస్థల్లోనే విద్యనభ్యసించి, 37 ఏళ్లపాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. విద్యా సంస్థల్లో చదువుకున్న ఎందరో ఉన్నత పదవుల్లో ఉన్నారు.
– లొల్లా శ్రీరాం మూర్తి, విశ్రాత ప్రధానోపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment