వేటపాలెం: ఓ బాలిక పురుగుమందు తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన స్థానిక బీబీహెచ్ జూనియర్ కళాశాల ఎదుట బుధవారం జరిగింది. వివరాలు.. పేరాలకు చెందిన పోగుల బ్రహ్మయ్యకు ఇద్దరు కుమార్తెలు. 9 ఏళ్ల కిందట భార్య చనిపోయింది. బ్రహ్మయ్య ఇల్లు వదిలి ఎటో వె ళ్లిపోయాడు.
ఇద్దరు కుమార్తెలను వేటపాలెం నాయినపల్లికి చెందిన మేనమామ చుండూరి శ్రీనివాసరావు తీసుకెళ్లి పెంచుతున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కిందట మద్దులూరి సీతామహాలక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు బాలిక పద్మినిని తమ ఇంటికి తీసుకెళ్లారు. బాలికతో వారు ఇంటి పనులు చేయించుకుంటున్నారు. దుస్తులు సరిగా సర్దలేదని ఇంటి యజమాని బాలికను మందలించింది. మనస్తాపం చెంది ఇంట్లో పూల మొక్కలకు ఉపయోగించే పురుగుమందు తాగింది. ఇంటి యజమాని స్థానిక వైద్యుల వద్ద బాలికకు ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందింనట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఇంటి యజమాని అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా సమాచారం తెలుసుకున్న ఎస్సై ఎండీ షరీఫ్ సంఘటన ప్రాంతానికి చేరుకొని ఆ తంతును ఆపించారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, రూరల్ సీఐ ఎండీకే ఆల్తాఫ్‌హుసేన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరించారు. మృత దేహన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.