
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత భూ వ్యవహారాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. ఫలానా చోట రాజధాని పెట్టుబోతున్న విషయం బహిరంగంగా ప్రకటించక ముందే ఆ ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ వ్యవహారాలకు సంబంధించి పలువురిపై ఏసీబీ తాజాగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఆయనేమన్నారంటే..
► అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తమ పార్టీ ఈ ఆరోపణలు చేసింది. ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉన్నాం. రాజధాని నిర్మాణానికి సంబంధించి రూ.7,200 కోట్లు విలువచేసే పనుల్లో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు.
► అక్కడ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా చ.అ.కు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు బిల్లులు చెల్లించారు. ఆ ఐదేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేదు.
► ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రధాని మోదీ కూడా ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిని ఏటిఎంతో ఆయన పోల్చారు. నీరు చెట్టు, పోలవరం, ఉపాధి హామీ, ఇళ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ పనుల్లో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది.
► టీడీపీ నేతలు మరుగుదొడ్లను సైతం వదల్లేదు. ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిలో టీడీపీ హయాంలో అవినీతి జరిగింది. దానిపై విచారణ జరపాలి. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
నేడు గవర్నర్‌ను కలవనున్న బీజేపీ నేతలు
బీజేపీ నేతలు బుధవారం గవర్నర్ విశ్వభూషణ్ ను కలవనున్నారు. సోము వీర్రాజు నేతృత్వంలో నేతల బృందం గవర్నర్‌ను కలిసి అంతర్వేది ఆలయ రథం దగ్ధం çఘటన తదనంతర పరిణామాలను వివరించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment