
ఈమె పేరు కొండా ఉషారాణి.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కికి చెందిన ఈమెకు తన 13వ ఏట వివాహమైంది. పెళ్లయిన మూడున్నరేళ్లకే భర్త చనిపోవడంతో తల్లితో పాటు తనకున్న ఇద్దరు పిల్లలను పెంచుకునేందుకు పొగాకు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా చేరింది. వచ్చే జీతం సరిపోకపోవడంతో రుణం తీసుకొని ఇంట్లోనే బట్టల దుకాణం ప్రారంభించింది.
అయితే దొంగలు పడి బట్టలన్నీ దోచుకెళ్లారు. దీంతో కొన్నాళ్లు దిగాలు పడ్డ ఉషారాణి తన బిడ్డలను పోషించుకోవడానికి పడి లేచిన కెరటంలా నిలబడింది. కంపెనీల నుంచి బయో ఎరువులను తీసుకొని మార్కెటింగ్‌కు శ్రీకారం చుట్టింది. 10 ఏళ్ల పాటు ఊరూరా తిరుగుతూ వాటిని అమ్ముతూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. అంతేకాకుండా గోశాల నుంచి సేకరించిన గోమూత్రం, పేడ వ్యర్థాలతో స్వయంగా బయో ఎరువులు తయారు చేస్తూ రైతులకు విక్రయించడం మొదలుపెట్టింది.
ఆ తర్వాత సొంతంగా పాడి గేదెలను కొనుగోలు చేసి బయో ఎరువుల తయారీ యూనిట్ పెట్టింది. తాను స్వయంశక్తితో నిలదొక్కుకోవడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతటితో ఆగకుండా తనకున్న 1.40 ఎకరాలతో పాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని ప్రకృతి సాగు చేపట్టింది. వరితో పాటు మిరప, మునగ, పసుపు, కాలీఫ్లవర్ పంటలను సాగు చేస్తోంది. ఇటీవల స్త్రీ (శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం) అవార్డును అందుకుంది.
మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లా..
రెండో అబ్బాయి పుట్టిన మూడు నెలలకే భర్త చనిపోయారు. ఏం చేయాలో పాలుపోలేదు. జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లా – కొండా ఉషారాణి, మహిళా రైతు, నూతక్కి, గుంటూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment