మాట్లాడుతున్న మాజీ ఎంపీపీ ఇస్మాయిల్, జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యుడు అల్లాబకాష్
ఓడీ చెరువు: మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నుంచి తనకు, తన కుమారుడు మాజీ ఎంపీపీ ఇస్మాయిల్‌కు ప్రాణహాని ఉందని జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యుడు అల్లాబకాష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పోలీసులకు లిఖిత పూర్వకంగా తెలిపారు. అనంతరం పుట్టపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ గంగన్నతో కలసి విలేకరులతో మాట్లాడారు. తనను, తన కుమారుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు మండల నాయకులు పత్రికా ప్రకటన చేయడంపై ధ్వజమెత్తారు. సస్పెండ్ చేయాలంటే వీరికి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు.
ఏ పార్టీలోనైనా సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడికి ఉంటుందని, కనీస ఈ జ్ఞానం కూడా లేని ‘పల్లె’ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు పల్లె రఘునాథరెడ్డిని తానే పరిచయం చేశానన్నారు. 1982 నుంచి తాను టీడీపీలో ఉన్నానని, పార్టీ అభివృద్ధికి తాను, తన కుటుంబం ఎంతో కృషి చేసినట్లు చెప్పారు. తమ గృహ ప్రవేశానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, సైకం శ్రీనివాసరెడ్డి ‘పల్లె’పై విమర్శలు చేశారని, దీంతో తానేదో వారితో ఆయనపై విమర్శలు చేయించినట్లు ‘పల్లె’ భావించి తనపై కక్ష కట్టారన్నారు.
చదవండి: (‘కుర్డుంగ్లా’పై నవరత్నాల రెపరెప)
ఎంపీపీగా తన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని, హిందూపురం బాలాజీ కళాశాలలో గుర్రప్పతో కలసి రికార్డులు చోరీ చేశారని పల్లె ఆరోపించారని, నిజంగా తన కుమారుడు ఈ పనులు చేసి ఉంటే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే తెలిసిపోతుందన్నారు. తాను గానీ, తన కుమారుడు గానీ అక్కడికి వచ్చినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. పల్లె తన కార్యకర్తలకు పనులు ఇచ్చి వారి నుంచి రూ.కోట్ల కమీషన్‌న్ దండుకున్నారు. ఈ విషయాలు బయటకు వస్తాయనే తనను, తన కుమారున్ని చంపుతానని బెదిరిస్తున్నాడన్నారు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనకు పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. సమావేశంలో కొత్తచెరువు నిషార్, పవన్, భాస్కర్, అబ్దుల్ కలాం, రాజ, షామీర్‌బాషా, కోటబజార్ భాస్కర్, ఆంజనేయులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment