ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ నైపుణ్యాలు | International Skills for Government Schools | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ నైపుణ్యాలు

Published Sun, Dec 3 2023 2:40 AM | Last Updated on Sun, Dec 3 2023 6:59 AM

International Skills for Government Schools - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. ఆరో తరగతి నుంచే వివిధ టెక్నాలజీల పాఠాలు బోధించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే ఏడాది (2024–25) నుంచి మొత్తం 6,200 హైస్కూళ్లలో ఈ ఫ్యూచర్‌ స్కిల్స్‌ను అందించనుంది.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌)– ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), మెటావర్స్‌/ వెబ్‌ 3.0, 3డీ మోడలింగ్‌ అండ్‌ ప్రింటింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌ డేటా/డేటా అనలిస్ట్, రోబోటిక్స్, గేమింగ్‌ వంటి రేపటితరం టెక్నాలజీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రాబోయే కాలంలో ఈ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉండనున్న నేపథ్యంలో పాఠశాల స్థాయిలోనే వీటిపై పూర్తి అవగాహన కల్పించనున్నారు.

ప్రస్తుతం విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సైన్స్, సోషల్, మ్యాథ్స్‌ (6) సబ్జెక్టులను చదువుతుండగా, ఇకపై ఏడో సబ్జెక్టుగా టెక్‌ పాఠాలు చదువుతారు. వచ్చే ఏడాది ఆరు, 9 తరగతి విద్యార్థులకు టెక్‌ పాఠాలను బోధించనున్నారు. 2025–26లో 7, 10 తరగతులకు, 2026–27లో ఎనిమిది, ఇంటర్‌ మొదటి సంవత్స­రం విద్యార్థులకు ఫ్యూచర్‌ స్కిల్స్‌పై శిక్షణ అందించనున్నారు. ఇలా 2028 నాటికి మొత్తం ఆరు నుంచి +2 వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు.
  
డిజిటల్‌ వసతుల కోసం రూ.2,400 కోట్ల ఖర్చు.. 
ఇప్పటికే పాఠశాలల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీలు), స్మార్ట్‌ టీవీలు, ట్యాబ్స్, ఇంగ్లిష్‌– మ్యాథ్స్‌ – పాల్‌ – కంప్యూటర్‌ ల్యాబ్స్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కోసమే దాదాపు రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇకపై టెక్‌ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని పెంపొందించడంతోపాటు విజ్ఞానంలో ముందుండేలా శిక్షణనివ్వనున్నారు.

నాస్కామ్, జేఎన్‌టీయూ నిపుణులు, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఏపీఎస్‌ఈఆర్‌టీ), స్వతంత్ర నిపుణులు రూపొందించిన ఫ్యూచర్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురావడానికి అధికారులు సిద్ధమయ్యారు.   

ఏడో సబ్జెక్టుగా టెక్‌ పాఠాలు.. 
6,200 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు టెక్నాలజీ నైపుణ్యాలను నేర్పించేందుకు కంప్యూటర్‌ సైన్స్‌ లేదా ఎల్రక్టానిక్స్‌లో ఎంటెక్‌/ఎంసీఏ/బీటెక్‌ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. తమ ప్రాజెక్టులో భాగంగా వీరు ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఫెసిలిటేటర్స్‌గా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలు అందిస్తారు. విద్యార్థులకు టెక్‌ పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు వీరు ‘టెక్నాలజీ లీడ్‌’ శిక్షణ ఇస్తారు. ఏటా డిసెంబర్‌/ఏప్రిల్‌ నెలల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా ఇండక్షన్‌ శిక్షణ ఇస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిసెంబర్‌ 15 నాటికి ఇండక్షన్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   

తరగతిని బట్టి టెక్‌ బోధనాంశాలు...
విద్యార్థులకు అనువుగా ఎంపిక చేసిన అంశాలకు ప్రత్యేక కరిక్యులమ్‌ను సైతం రూపొందించారు. 6–8 తరగతులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కాన్సెప్ట్స్, ఆల్గారిథమ్, డేటా ఎనాలసిస్, ఏఐ ఎథిక్స్‌ అండ్‌ సోషల్‌ ఇంపాక్ట్స్, మ్యాథ్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ అంశాల్లో ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పిస్తారు.  
♦ 9–10 తరగతులకు ‘ఏఐ’ టెక్నాలజీ, మెషీన్‌ లెర్నింగ్‌పై ప్రాథమిక అవగాహన, అప్లికేషన్స్, ఆల్గారిథమ్‌ అండ్‌ డేటా ఎనాలసిస్, ఆర్టిఫిషియల్‌ ఎథిక్స్, సోషల్‌ ఇంపాక్ట్, మ్యాథ్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ను నేర్పిస్తారు. 

♦ 11–12 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై అడ్వాన్స్‌డ్‌ అంశాలను బోధిస్తారు.  

ఈ అంశాల్లో అన్ని పాఠశాలల్లోనూ ఒకేసారి ఒకే పాఠాన్ని బోధించనున్నారు. దీనివల్ల విద్యార్థులు ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు మారినా టెక్‌ అంశాల బోధనలో మార్పు ఉండదు. దీంతో విద్యార్థుల సామర్థాలు మెరుగుపడడంతో పాటు అంతర్జాతీయ అవకాశాలను అందుకునే నైపుణ్యాలు నేర్చుకుంటారు.  

సిలబస్‌ సిద్ధం చేస్తున్నాం.. 
ఎంపిక చేసిన 10 మాడ్యూల్స్‌ బోధనకు సిలబస్‌ను సిద్ధం చేస్తున్నాం. డిసెంబర్‌ నాటికి అన్ని స్కూళ్లకు ఐఎఫ్‌పీలు నూరు శాతం అందుబాటులోకి వస్తాయి. ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఫెసిలిటేటర్స్‌ నియామకానికి అనుమతి లభించింది, వచ్చే నెల రోజుల్లో వీరి నియామకం పూర్తవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6,200 హైస్కూళ్లలో ఫ్యూచర్‌ స్కిల్స్‌పై బోధన ప్రారంభమవుతుంది.   – కాటమనేని భాస్కర్, కమిషనర్,  పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement