తిరుపతి అలిపిరి: తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో నిరీక్షించే పరిస్థితి లేకుండా సర్వదర్శనానికి టైం స్లాట్ పద్ధతిని టీటీడీ అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌లో నిలిపివేసిన సర్వదర్శనం టైంస్లాట్ (ఉచిత దర్శనం) టోకెన్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. దర్శనానికి వెళ్లేవారికి తిరుపతిలోనే సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది.
కోవిడ్ కారణంగా 2020లో శ్రీవారి దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత దర్శనాలను ప్రారంభించినా పరిస్థితులకు అనుగుణంగా కేవలం 40,000 మందికి మాత్రమే దర్శనాలు కల్పిస్తూ వచ్చిన టీటీడీ ఈ ఏడాది మార్చి నుంచి సడలింపులనిస్తూ సర్వదర్శనానికి అనుమతించింది. దీంతో వేలాదిగా ప్రతి రోజూ తిరుమలకు భక్తులు వస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో అతికష్టం మీద రోజుకు 85,000 మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు టైంస్లాట్ టోకెన్లు తీసుకురావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకోవడంతో మంగళవారం నుంచి ఈ ప్రక్రియ పునఃప్రారంభమైంది. తొలిరోజున 13,000 మందికి టోకెన్లను జారీ చేశారు.
3 కేంద్రాలు..30 కౌంటర్లు
శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్‌లను అందించేందుకు తిరుపతిలో మూడు చోట్ల కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. తిరుపతి అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో 30 కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తుల మధ్య తోపులాట లేకుండా ప్రత్యేక క్యూలైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డుతో సంప్రదించిన భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇందుకుగాను ఆధార్ జిరాక్స్ కాపీలను భక్తులు తమవెంట తీసుకురావాలి.
టోకెన్ల జారీ ఇలా..
శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు అధిక రద్దీ, ముఖ్య రోజుల్లో జారీ చేసిన టోకెన్ల వివరాలను టీటీడీ ప్రకటించింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25,000 టోకెన్లు, మంగళ, గురు, శుక్రవారాల్లో 15,000 మందికి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఏ రోజు టోకెన్ తీసుకున్న భక్తులకు అదే రోజున దర్శనం కల్పిస్తారు.
ఇప్పటి దాకా సర్వదర్శనం 40 గంటల వరకు సమయం పట్టేది. ఈ పద్ధతితో అత్యంత తక్కువ సమయంలోనే దర్శనం చేసుకొంటున్నామని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ దొరకని భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి వెళ్లడానికి టీటీడీ అనుమతిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment