సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట మాజీ సీఎం చంద్రబాబు సాగించిన భూ దోపిడీలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఎస్.ఈశ్వరన్ కథ ముగిసింది. రవాణా శాఖ మంత్రి పదవితోపాటు ఎంపీ సభ్యత్వానికి, సింగపూర్ అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ(పీఏపీ) ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసి ఇంటిదారి పట్టారు. ఆయన ఈ నెల 12న రాజీనామా చేసిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. ఇక దర్యాప్తు ప్రక్రియ ముగిసి నేరాలు రుజువు కావడమే తరువాయి ఆయన జైలు పక్షిగా మారనున్నట్లు స్పష్టమైంది.
సింగపూర్ ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు తెగబడి ఏకంగా 2.98 లక్షల అమెరికన్ డాలర్ల మేర భారీ అవినీతికి పాల్పడినట్టు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం ‘కరెప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (సీపీఐబీ) నిగ్గు తేల్చింది. ఈ కేసులో నేరం రుజువైతే ఆయనకు కనీసం ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష పడే అవకాశాలున్నట్లు నిపుణులు తెలిపారు. ఈశ్వరన్ వ్యవహారం టీడీపీలో గుబులు పుట్టిస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై 52 రోజులు రిమాండ్ ఖైదీగా గడిపి బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నట్లు స్పష్టమవుతోంది.
అరెస్ట్.. బెయిల్.. రాజీనామా
2008లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలో జూనియర్ ఆఫీసర్‌గా ఉన్న ఈశ్వరన్ అనతి కాలంలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. మొదట పరిశ్రమల శాఖ మంత్రిగా, అనంతరం రవాణా శాఖ మంత్రిగా కీలక పదవులు పొందారు. సింగపూర్‌కు ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించడం సంచలనంగా మారింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్ నుంచి వివిధ రూపాల్లో 2.98 లక్షల అమెరికన్ డాలర్లను ముడుపులుగా తీసుకున్నట్లు అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేలి్చంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ – సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు.
సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీ పోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గతేడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో సింగపూర్ ప్రధానమంత్రి లీ హ్సీన్ లూంగ్ తాత్కాలిక రవాణా శాఖ మంత్రిగా మరొకరికి బాధ్యతలు అప్పగించారు.
అనంతరం ఈశ్వరన్ బెయిల్‌పై విడుదలయ్యారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో తాజాగా చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. వాటిలో ఆయన మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్టు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని ఒక అభియోగం ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. నేరం రుజువైతే ఈశ్వరన్‌కు లక్ష డాలర్ల జరిమానాతోపాటు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని సింగపూర్ న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
భూ దోపిడీలో పార్టనర్
చంద్రబాబుతో కలసి అమరావతి భూదోపిడీలో ఈశ్వరన్ ప్రధాన భూమిక పోషించారు. ఎంతగా అంటే రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వం టీడీపీ సర్కారుతో ఒప్పందం చేసుకుందని భ్రమింపజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్‌ను చంద్రబాబు, ఈశ్వరన్ ద్వయం కుట్రపూరితంగా తెరపైకి తెచ్చింది.
ఒప్పందం సమయంలో సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ అసెందాస్–సిన్‌బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియంను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానం ముసుగులో ఇతర సంస్థలేవీ పోటీ పడకుండా ఏకపక్షంగా 2017 మే 2న కట్టబెట్టేశారు. దీనికి చంద్రబాబు కేబినెట్ రాజముద్ర వేసింది. ఆ ఒప్పంద పత్రాలపై ఈశ్వరన్ సంతకాలు చేశారు. అప్పుడు ఆయన సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నట్టు చంద్రబాబు భ్రమింపజేశారు. స్టార్టప్ ఏరియా వాటాల కేటాయింపులోనూ చంద్రబాబు గోల్‌మాల్ చేశారు.
స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 42 శాతం వాటా కల్పించారు. రూ.306.4 కోట్లు మాత్రమే వెచ్చించే అసెందాస్–సిన్‌బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి ఏకంగా 58 శాతం వాటా కట్టబెట్టేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి మొదట విడతలో 5 శాతం, రెండో విడతలో 7.5 శాతం, మూడో విడతలో 12 శాతం వాటా మాత్రమే కేటాయించారు. స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున కేవలం 8.7 శాతం వాటా దక్కనుండగా అసెందాస్–సిన్‌బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి మాత్రం 91.3 శాతం వాటా దక్కుతుందన్నది స్పష్టమైంది.
ఆ కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. అందుకు ఈశ్వరన్ సహకరించారు. తద్వారా స్టార్టప్ ఏరియాలో రూ.లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. స్టార్టప్ ఏరియాను ఆనుకుని ఉన్న 1,400 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా బినామీ పేర్లతో కొల్లగొట్టింది. మరోవైపు ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది. సింగపూర్‌లో చంద్రబాబు బినామీల పేరిట ఉన్న స్టార్ హోటళ్లు, ఇతర రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోనూ ఈశ్వరన్ కీలకపాత్ర పోషించినట్లు అధికారిక, పారిశ్రామికవర్గాలు చెబుతుండటం గమనార్హం.
చంద్రబాబుదీ అదే పరిస్థితి..
సింగపూర్‌లో ఈశ్వరన్ పరిస్థితినే చంద్రబాబు దాదాపుగా ఎదుర్కొంటున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం చంద్రబాబు బెయిల్‌పై విడుదల అయ్యారు. రూ.5 వేల కోట్ల మేర అసైన్డ్ భూముల కుంభకోణం, రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కుంభకోణం, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణం, రూ.6,500 కోట్ల మద్యం కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అవి విచారణ దశలో ఉన్నాయి. సెక్షన్ 17 ఏ ప్రకారం తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఆయనపై కేసు కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment