రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన రొయ్యల వ్యాపారి, టీడీపీ నాయకుడు దండుప్రోలు పిచ్చయ్య ఇంట్లో గురువారం ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఆయన సోదరుడు దండుప్రోలు వెంకటేశ్వరరావు ఇంట్లో, వారికి చెందిన రొయ్యల కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం పక్కన ఉన్న దండుప్రోలు పిచ్చయ్య ఇంటితోపాటు సమీపంలోని దండుప్రోలు వెంకటేశ్వరరావు నివాసం, వీరికి చెందిన రొయ్యల కంపెనీలో ఉదయం ఒకేసారి అధికారులు సోదాలు ప్రారంభించారు. వెంకటేశ్వరరావు ఇంట్లో, రొయ్యల కంపెనీలో మధ్యాహ్నం వరకు సోదాలు నిర్వహించారు. దండుప్రోలు పిచ్చయ్య ఇంట్లో మాత్రం రాత్రి వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఒడిశాలోని పాల్కన్ రొయ్యల మేత, రొయ్యల ఎగుమతి కంపెనీతోపాటు ఆ సంస్థతో వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్న కంపెనీలు, వాటి నిర్వాహకుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా రేపల్లెలోని దండుప్రోలు పిచ్చయ్య, ఆయన తమ్ముడి ఇళ్లు, వారి కంపెనీలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పిచ్చయ్య ఇంటి వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దండుప్రోలు పిచ్చయ్య ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: అనుమతి లేకుండానే విదేశాలకు మార్గదర్శి ఎండీ..
Comments
Please login to add a commentAdd a comment