మాట నిలబెట్టుకుంటూ 46 నెలల్లో 98.5 శాతం ఎన్నికల హామీలను అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కూడా గడవక ముందే సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2 లక్షల కోట్లు జమ చేశారు. వార్డు మెంబర్ నుంచి కేబినెట్ వరకూ సింహభాగం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు, మహిళలకు రిజర్వ్ చేస్తూ చట్టం తెచ్చి మరీ చిత్తశుద్ధి చాటుకున్నారు.
15,004 గ్రామ, వార్డు సచివాలయాలు.. 2.60 లక్షల మంది వలంటీర్లు.. 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణతో పరిపాలనను వికేంద్రీకరించి ఇంటివద్దే సుపరిపాలన అందిస్తున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆదర్శ పాలనతో ముఖ్యమంత్రి జగన్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారు. ఇదే అంశాన్ని చాటి చెబుతూ టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ మరోసారి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి ప్రారంభమయ్యే ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగనుంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దీనికి సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్ బ్యాగ్‌లు అందచేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు.
నమ్మకం రెట్టింపు
సుమారు 18 నెలల పాటు పట్టి పీడించిన కరోనాతో ప్రపంచమంతా ఆర్థి క సంక్షోభంతో తల్లడిల్లినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ ఆపలేదు. 46 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.రెండు లక్షల కోట్లను జమ చేయడం దేశ చరిత్రలో రికార్డు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు.
పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించి పరిపాలనను వికేంద్రీకరించారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ఆర్థి క చేయూతతో పేదరిక నిర్మూలనతోపాటు రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం చేకూర్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు సామాజిక సాధికారత సాధించేలా బాటలు వేశారు. తాము పెట్టుకున్న నమ్మకం కంటే రెండింతలు అధికంగా న్యాయం చేస్తూ పరిపాలిస్తుండటంతో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ప్రజలు నినదిస్తున్నారు. ప్రజల్లో నుంచి వ చ్చిన ఈ నినాదాన్నే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ చేర్చింది.
ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలివీ..
1 . ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు, మీ కుటుంబానికి మంచి జరిగిందా?
2 . మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా?
3 .గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛన్, అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి అనేక పథకాల ద్వారా డబ్బులను నేరుగా మీ అకౌంట్‌లో వేయడం లేదా వలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా?
4 . నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా?
5. జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా?
కిట్ బ్యాగ్‌లో ఏముంటాయంటే..
♦ ఒక్కో కిట్ బ్యాగ్‌లో 200 ఇళ్లకు సరిపడా సామగ్రి ఉంటుంది.
♦టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ రూపొందించిన 200 కరపత్రాలు
♦ ప్రజా మద్దతు పుస్తకాలు టమూడు పెన్నులు
♦ ఇద్దరు గృహ సారథులు, ముగ్గురు కన్వినర్లు ధరించేందుకు సీఎం జగన్ ఫొటోతో కూడిన ఐదు బ్యాడ్జీలు
♦సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉన్న 200 స్టిక్కర్లు
♦ సీఎం జగన్ ఫోటో ఉన్న 200 మొబైల్ ఫోన్ స్టిక్కర్లు
కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటే..
♦ ప్రతి ఇంటి వద్దకు ఇద్దరు గృహ సారథులు, వలంటీరు వెళతారు. టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను ఆ కుటుంబ సభ్యులకు వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని చదివి వినిపిస్తారు. తర్వాత కరపత్రాన్ని వారికి అందజేస్తారు.
♦ప్రజా మద్దతు పుస్తకంలో ప్రజా సర్వేకు సంబంధించి ఐదు ప్రశ్నలు ఉన్న స్లిప్పుపై కుటుంబ పెద్ద పేరు, ఫోన్ నంబర్ నమోదు చేస్తారు. ఆ తర్వాత ఐదు ప్రశ్నలను చదివి ఆయా కుటుంబాలు ఇచ్చే సమాధానాల ఆధారంగా అవును / కాదు అనే వివరాలను నమోదు చేస్తారు. స్లిప్పు కుడి వైపున ఉన్న రసీదును ఆ కుటుంబానికి ఇస్తారు.
♦వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిని 82960–82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతారు. మిస్డ్ కాల్ ఇచ్చిన నిముషంలోపే కృతజ్ఞతలు తెలియచేస్తూ సీఎం జగన్ సందేశంతో ఐవీఆర్‌ఎస్ కాల్ ఆ కుటుంబానికి వస్తుంది.
♦ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపునకు సీఎం వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్ అతికించేందుకు అనుమతి కోరతారు. సమ్మతించిన వారి ఇంటి తలుపునకు స్టిక్కర్ అతికిస్తారు. అదే రీతిలో మొబైల్ ఫోన్‌కు స్టిక్కర్ అతికించి ధన్యవాదాలు తెలియచేస్తారు.
♦ ఈ కార్యక్రమం పూర్తయ్యాక ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన ప్రజా మద్దతు పుస్తకాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు.
15,004 సచివాలయాల్లో ఏకకాలంలో
రాష్ట్రంలోని 15,004 సచివాలయాల్లో శుక్రవారం ఏకకాలంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ప్రారంభమవుతుందని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 7వ తేదీన మొదలయ్యే ఈ కార్యక్రమం 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఏడు లక్షల మంది పార్టీ సైనికులు 14 రోజుల్లో దాదాపు 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకుంటారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్–అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment