సెజ్‌ భూములు తిరిగిచ్చిన ఏకైక సీఎం జగన్‌ | Jagan is the only CM who has returned SEZ lands | Sakshi
Sakshi News home page

సెజ్‌ భూములు తిరిగిచ్చిన ఏకైక సీఎం జగన్‌

Published Sun, Dec 8 2024 5:39 AM | Last Updated on Sun, Dec 8 2024 8:32 AM

Jagan is the only CM who has returned SEZ lands

అక్రమ కేసులు పెట్టించి రైతుల భూములు లాక్కుంది బాబే 

మా పీకలమీద కత్తిపెట్టి కారుచౌకగా ఎకరం రూ.5 లక్షలకే కొట్టేశారు 

జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక మా భూములను తిరిగిచ్చారు 

తద్వారా మా కుటుంబాల్లో దేవుడయ్యారు 

జగన్‌ ఇచ్చిన భూముల విలువ ఎకరం రూ.5 కోట్లు పలుకుతోంది 

ఆయనను దోషిగా చూపించేందుకే చంద్రబాబు కుట్ర రాజకీయాలు 

తప్పుడు రాతలతో ఎల్లో మీడియా ప్రజలను పక్కదోవ పట్టిస్తోంది 

కేవీ రావుపై కేసులు పెట్టి లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయాలి 

చంద్రబాబుపై కాకినాడ సెజ్‌ రైతుల మండిపాటు 

సాక్షి ప్రతినిధి, కాకినాడ/కాకినాడ రూరల్‌: ప్రత్యేక ఆర్థిక ప్రాంతం (సెజ్‌)కు తీసుకున్న భూములను రైతులకు తిరిగిచ్చిన చరిత్ర దేశంలో గత సీఎం వైఎస్‌ జగన్‌ కే ద­క్కుతుందని కాకినాడ సెజ్‌ రైతులు కొనియాడారు. ప్రతిపక్షంలో ఉండగా భూములు తిరిగి ఇచ్చేస్తానని సెజ్‌ భూము­ల్లో ఏరువాక చేసిన చంద్రబాబు తీరా గద్దె నెక్కాక అక్రమ కేసులు పెట్టించి రైతుల భూములు లాగేసుకున్నారని మండిపడ్డారు. పోలీసు కేసులు, జైలు జీవితం, నిత్యం నిర్బంధాల మధ్య తమ కుటుంబాలను అనుక్షణం వేదనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తర్వాత ఆ భూములను కాకినాడ సెజ్‌ ప్రధాన ప్రమోటర్‌ కేవీ రావు, జీఎంఆర్‌లకు చంద్రబాబు కారుచౌకగా కట్టబెట్టారని దుమ్మెత్తిపోశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తమ పీకలమీద కత్తిపెట్టి ఎకరం రూ.5 లక్షలు, రూ.9 లక్షలకే  కొట్టేస్తే.. ఇచ్చిన మాట కోసం జగన్‌ ఆ భూములు తమకు తిరిగి ఇచ్చేసి  దేవుడయ్యారని కొనియాడారు. జగన్‌ తిరిగిచ్చిన భూము­ల విలువ ఇప్పుడు ఎకరం రూ.రెండు కోట్ల నుంచి రూ.ఐదు కోట్లు ఉందన్నారు. 

అలాంటి జగన్‌ను దోషిగా చూపించేందుకు చంద్రబాబు అండ్‌ కో, ఎల్లో మీడియా కుట్రలు చేస్తున్నాయని,  ఈనాడు పత్రిక అసత్యాలు వండివారుస్తోందని ధ్వజమెత్తారు. శనివారం కాకినాడలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీతలతో కలిసి రైతులు మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబు మాటమార్చారు.. 
ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఇంకోమాట.. ఇదీ చంద్రబాబు తీరు. మా భూములు వెనక్కి ఇవ్వకుండా ఆయన మాట మార్చారు. తర్వాత మా ప్రాంతానికి వచ్చిన వైఎస్‌ జగన్‌ మా బాధలను తెలుసుకుని అధికారంలోకి వచ్చాక కమిటీ వేసి భూములు వెనక్కి ఇస్తామన్నారు. 

అధికారంలోకి వచ్చాక రైతులు కోరుకున్న ఆరు గ్రామాలను వదిలేయడంతోపాటు డబ్బు తీసుకోని రైతుల భూములను కూడా వదిలివేశారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఆయన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. భూములపై ఈనాడు తప్పుడు రాతలు రాయడం అన్యాయం.  – బావిశెట్టి నారాయణస్వామి, సెజ్‌ బాధిత రైతు నాయకుడు, రావివారిపోడు, యు.కొత్తపల్లి మండలం 

వైఎస్‌ జగన్‌ పెట్టిన భిక్ష 
మాకు ఎకరం భూమి ఉంది. వైఎస్‌ జగన్‌ మాకు పెట్టిన భిక్ష ఇది. ఈ రోజు ఎకరం రూ.5 కోట్లు పలుకుతోంది. కన్నబాబు, వంగా గీత, దాడిశెట్టి రాజా రైతులకు అండగా నిలిచారు. వారికి రుణపడి ఉంటాం. వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2,180 ఎకరాలు వెనక్కి ఇచ్చారు.  – మేడిబోయిన కృష్ణ, రమణక్కపేట, కొత్తపల్లి మండలం 

కేవీ రావుపై కేసు పెట్టాలి..  
పరిశ్రమలు పెడతామంటూ మా భూములపైనే రుణాలు తీసుకుని మా భూములనే కేవీ రావు అనే వ్యక్తి కొన్నారు. మా భూములు కొన్నాక ఎకరాకు రూ.6 లక్షలు చొప్పున బ్యాంకులో లోను తీసుకుని రూ.3 లక్షలు మాత్రమే రైతుకు ఇచ్చారు. మిగతా రూ.3 లక్షలు కేవీ రావు తన వద్దే ఉంచుకున్నారు. 

ఆ డబ్బుతో ఎంజాయ్‌ చేస్తూ 8,500 ఎకరాలపై రుణాలు తీసుకున్నాడు.. ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు.. సెజ్‌ను జీఎంఆర్‌కు అప్పగించారు. అలాంటి కేవీ రావుపై కేసు పెట్టి, లుక్‌ అవుట్‌ నోటీసు ఇవ్వాలి. జీఎంఆర్‌ కూడా పరిశ్రమలు పెట్టకుండా మా భూములపై రూ.2500 కోట్లు అప్పు తెచ్చుకుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మా ప్రాంత రైతుల జీవితాలను నాశనం చేశారు.  – వై.ప్రసాదరెడ్డి, సెజ్‌ ఫార్మర్స్‌ ప్రొటెక్షన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, నాగులాపల్లి, కొత్తపల్లి మండలం 

రైతులకు న్యాయం చేశారు.. 
సెజ్‌ రైతులకు, మా గ్రామాలన్నింటికీ వైఎస్‌ జగన్‌ న్యాయం చేశారు. పాదయాత్రలో సెజ్‌ రైతుల బాధలు తెలుసుకుని పిఠాపురం సభలో రైతులకు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక నెరవేర్చారు. ఆయన దయ వల్ల లక్షలు విలువ గల భూములు మాకు దక్కాయి.  – బోనం రాముడు, సెజ్‌ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి, రావివారిపోడు 

జగన్‌ లేకపోతే ఆత్మహత్యలే.. 
మా భూములు వెనక్కి తిరిగి ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రుణం తీర్చుకోలేం. ఆయనే లేకపోతే మా కుటుంబాలకు ఆత్మహత్యలే శరణ్యమయ్యేవి. ఈనాడు పేపర్లో తప్పుడు రాతలు రాయడం సరికాదు. – చింతపల్లి బుచ్చియ్య, సెజ్‌ రైతు, నాగులాపల్లి 

జగన్‌ వల్లే మా కుటుంబాల్లో వెలుగులు  
మా కుటుంబాలకు గత సీఎం వైఎస్‌ జగన్‌ వెలుగునిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు భూములను ఇచ్చారు. వాటిని ఎవరికైనా అమ్ముకునే హక్కును కూడా కల్పించారు. చిత్రమేమిటంటే కాకినాడ సెజ్‌లో రైతులు, ఎస్సీలు, బీసీలు చాలా నష్టపోయారని ముఖ్యమంత్రికి యనమల రామకృష్ణుడు లెటర్‌ రాశారంట.. అసలు ఎవరి వల్ల నష్టపోయారు? 

పోర్టు ఆధారిత పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయకపోతే ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబుతో ఏరువాక సాగించి ఎందుకు ఆదుకోలేదు? సీబీఐ విచారణ చేయమని తాము కోరితే రూ.2 లక్షలు అదనంగా ఇచ్చి కొత్త చట్టం ప్రకారం పరిహారం ముట్టిందని రైతులకు అన్యాయం చేయలేదా? 

ఆరోజు ఆర్థిక మంత్రిగా యనమల సమావేశాలు పెట్టి భూములు ఖాళీ చేయించి సెజ్‌కు అప్పగించారు. ఈరోజు మా భూములు మేము అమ్ముకుంటే అభాండాలు వేస్తున్నారు. మమ్మల్ని బెదిరించి ఎవరూ భూములు కొనుగోలు చేయలేదు.  – చింతా సూర్యనారాయణమూర్తి, కాకినాడ సెజ్‌ పోరాట కమిటీ కన్వినర్, మూలపేట, కొత్తపల్లి మండలం  

జగన్‌ వల్లే మా కుటుంబానికి రూ.4 కోట్లు 
కాకినాడ సెజ్‌కు వేల ఎక­రాలు అవసరమా అన్న చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే సెజ్‌ను రద్దు చేస్తానన్నారు. రైతుల భూములు తిరిగి ఇచ్చివేస్తానని నమ్మించారు. తర్వాత అధికారంలోకి వచ్చి మాటతప్పారు. సెజ్‌లో పోయిన 8 ఎకరాలు వైఎస్‌ జగన్‌ వల్ల మాకు తిరిగొచ్చాయి. తద్వారా మా కుటుంబానికి రూ.4 కోట్లు కలిసి వచ్చింది.  – కృష్ణారెడ్డి, సెజ్‌ బాధిత రైతు, నాగులాపల్లి 

చాలా మంచి జరిగింది..  
చంద్రబాబు ప్రభుత్వం మా నాన్న సుబ్బారెడ్డిని 200 రోజులు జైలులో పెట్టి వేధించింది. దీంతో ఆయన చనిపోయారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక నాలుగు ఎకరాల మా భూమికి ప్రత్యామ్నాయంగా సాగర్‌మాల రోడ్డు పక్కన ఇచ్చారు. ఎకరా రూ.2 కోట్లు ధర పలుకుతోంది. మాకు చాలా మంచి జరిగింది. ఈనాడులో నేను అనని మాటలను అన్నట్టుగా రాశారు. – సత్యానందరెడ్డి, సెజ్‌ రైతు, రమణక్కపేట 

ఈనాడు రాతలు పచ్చి అబద్ధాలు.. 
జగన్‌ ప్రభుత్వంలో భూములను లాక్కున్నారని ఈనాడు పచ్చి అబద్ధాలను రాసింది. వైఎస్‌ జగన్‌ చేసిన మేలుకు రైతులు ఆయనకు పాలాభిõÙకం చేయాలి. కేవీ రావు, జీఎంఆర్‌ ప్రజాభిప్రాయ సేకరణకు రైతులను రానివ్వలేదు. అరబిందో మాత్రం రైతుల అభిప్రాయాలు సేకరించడమే కాకుండా దాదాపు రూ.4 వేల కోట్లతో ఇన్సులిన్‌ తయారు చేసే పరిశ్రమను పెట్టి రైతుల్లో నమ్మకం కలిగించింది. – పి.ధర్మరాజు, సెజ్‌ రైతు, పొన్నాడ, కొత్తపల్లి మండలం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement