పీఎంఏవై–ఎన్టీఆర్ నగర్‌లుగా మార్చిన సర్కారు
పేదల కోసం సెంటు స్థలం సేకరించని చంద్రబాబు ప్రభుత్వం
‘సూపర్ సిక్స్’అమలులోలేని శ్రద్ధ పేరు మార్పుపై యావ
ప్రభుత్వ ఉత్తర్వులపై దుమ్మెత్తిపోస్తున్న పేదలు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లు అంటూ రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీల అమలులో శ్రద్ధ చూపించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం వాటికి గాలికొదిలేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పథకాలు, కార్యక్రమాలకు పేర్లు మార్చి ప్రచారం చేసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పరంపరలో భాగంగా వైఎస్సార్, జగనన్న కాలనీల పేర్లను పీఎంఏవై–ఎన్టీఆర్ నగర్‌లుగా మారుస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై పేదలు మండిపడుతున్నారు.
రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతింటిని సమకూర్చేలా 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలుచేసింది. ఈ పథకం కింద ఐదేళ్లలో ఏకంగా 71 వేలకు పైగా ఎకరాల్లో 31 లక్షల మందికి పైగా పేద అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వీటి మార్కెట్ విలువ రూ.76 వేల కోట్ల పైమాటే. 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే నెలకొల్పారు.
పేదలకు పంపిణీ చేసిన ఈ స్థలాల మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంటోంది. మరోవైపు.. ఈ స్థలాల్లో సొంతింటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతో పాటు, పావలా వడ్డీకి రూ.35 వేల రుణ సాయం, ఉచితంగా ఇసుక, సబ్సిడీపై నిర్మాణ సామాగ్రి సమకూర్చారు.
‘సెంటు’కూడా ఇవ్వకుండా పేరు మార్పా?
ఇక రాష్ట్రంలో పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇస్తామని గత ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి హామీ ఇచ్చింది. కానీ, ఈ ఏడునెలల పాలనలో ఒక్క అడుగూ ముందుకేయలేదు. కనీసం సెంటు స్థలం కూడా పేదలకు పంచలేదు. మరోవైపు.. గృహ నిర్మాణ శాఖపై చంద్రబాబు నిర్వహించిన మొదటి సమీక్షలో ప్రకటించినట్లు పేదల ఇంటి నిర్మాణ సాయాన్ని రూ.నాలుగు లక్షలకు పెంచలేదు.
గత ప్రభుత్వంలో చేసిన సాయాన్ని యథావిధిగా కొనసాగిస్తామని ఉత్తర్వులిచ్చారు. ఇలా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదల ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు చేసిన సాయం వీసమెత్తు లేకపోయినా పేర్లను మాత్రం ఇష్టారాజ్యంగా మార్చేశారు. చంద్రబాబు ప్రభుత్వ పేర్ల పిచ్చికి ఇదొక పెద్ద నిదర్శనం అని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment