9.05 లక్షల మందికి జగనన్న తోడు | jagananna Thodu For Above 9 lakh Small Traders In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

9.05 లక్షల మందికి జగనన్న తోడు

Published Tue, Jun 8 2021 4:02 AM | Last Updated on Tue, Jun 8 2021 7:50 AM

jagananna Thodu For Above 9 lakh Small Traders In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న తోడు పథకం కింద మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేకుండా (సున్నా వడ్డీ) రూ.10 వేలు చొప్పున రుణాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్‌ 25న ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 5.35 లక్షల మంది లబ్ధిదారులకు సున్నా వడ్డీకే రూ.10 వేల చొప్పున రుణాలను అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇస్తున్న 3.70 లక్షల మందిని కూడా కలిపితే మొత్తం 9.05 లక్షల మంది లబ్ధిదారులకు రూ.905 కోట్లను ఇచ్చినట్లు అవుతుంది. 

కమర్షియల్‌ బ్యాంకులు ముందుకు రాకపోయినా..
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారిని ప్రభుత్వమే వలంటీర్ల ద్వారా గుర్తించింది. వలంటీర్లు 9,05,630 మందిని గుర్తించగా.. వీరిలో ఇప్పటికే 5,35,172 మందికి రుణాలు అందించారు. కరోనా కారణంగా మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పలు వాణిజ్య బ్యాంకులు పరిమిత సంఖ్యలోనే రుణాలు ఇస్తున్నాయి. దీంతో ప్రస్తుతం రెండో విడతలో రాష్ట్ర సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌), స్త్రీనిధి సహకార సమాఖ్య ద్వారా రుణాలు అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విడతలో 3,70,458 మందికి రుణాలు ఇస్తుండగా.. ఇందులో అత్యధికంగా స్త్రీనిధి ద్వారానే 2.81 లక్షల మందికి రుణమిస్తున్నారు. మరో 75 వేల మందికి ఆప్కాబ్‌ రుణం అందిస్తుండగా.. కమర్షియల్‌ బ్యాంకులు కేవలం 14 వేల మందికే రుణమిస్తున్నాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్‌ ఎన్‌.భరత్‌ గుప్తా తెలిపారు. ఈ జాబితాలో పేరు లేని వారు కంగారుపడాల్సిన అవసరం లేదని, వలంటీర్‌ను సంప్రదించినా లేక గ్రామ సచివాలయంలో దరఖాస్తు అందజేసినా.. మూడు నెలల్లో అర్హులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామన్నారు. 

చిరు వ్యాపారులను ఆదుకోవడమే లక్ష్యం
పుట్‌పాత్‌లు, వీధుల్లో తోపుడు బండ్లు, గంపలు, బుట్టల్లో కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులు అమ్ముకునేవారితోపాటు రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించుకునేవారు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పనిచేసేవాళ్లు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, లేస్‌ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మల తయారీ, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవించేవారికి ప్రభుత్వం జగనన్న తోడు కింద సున్నా వడ్డీకే రుణాలు అందజేస్తోంది. వీరిలో అత్యధికులు తమ వ్యాపార పెట్టుబడి కోసం రూ.3 నుంచి రూ.10 వరకు రోజువారీ వడ్డీకి ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పు తెచ్చుకుంటున్నారు. తమ ఆదాయంలో అధిక మొత్తాన్ని వడ్డీ చెల్లింపులకే వెచ్చిస్తూ కుదేలవుతున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూసి చలించిన సీఎం వైఎస్‌ జగన్‌ వారిని ఆదుకోవడం కోసం జగనన్న తోడు పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి.. రుణంపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement