ఇంటింటా జన నీరాజనం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ ఘనంగా ప్రారంభం | jagananne-maa-bhavishyathu-campaign Started In Grand Way | Sakshi
Sakshi News home page

ఇంటింటా జన నీరాజనం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఘనంగా ప్రారంభం

Published Sat, Apr 8 2023 4:03 AM | Last Updated on Sat, Apr 8 2023 10:22 AM

jagananne-maa-bhavishyathu-campaign Started In Grand Way - Sakshi

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌: ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు.. ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్షగా ప్రజా మద్దతు పుస్త­కంలో నమోదు చేయాలని అవ్వాతాతలు, అక్క­చెల్లెమ్మలు, అన్నదమ్ముల ఆశీర్వచనాలు.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్‌ ఫోన్‌కు వైఎస్‌ జగన్‌ ఫొటోతో కూడిన స్టిక్కర్‌లను అతికించుకోవడానికి పోటీ పడ్డ అక్కచెల్లెమ్మలు.. 82960 82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి, మద్దతు తెలిపిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ సందేశంతో ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ రావడంతో కేరింతలు.. వెరసి మా నమ్మకం నువ్వే జగన్‌.. అంటూ నినాదాలు.. ఇదీ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి  తొలి రోజున వచ్చిన స్పందన.

గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 14 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహించాయి.

ప్రతి ఇంటా ఎదురేగి ఆహ్వానం 
సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా విన్పించింది. గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో తమకు అండదండగా సీఎం వైఎస్‌ జగన్‌ నిలుస్తున్నారని అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రజా సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పులలోని ఐదు ప్రశ్నలను గృహ సారథులు వినిపించినప్పుడు.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరిగిందని, మళ్లీ సీఎంగా వైఎస్‌ జగనే కావాలంటూ సమాధానాలు చెప్పి.. వాటిని నమోదు చేయించి, రసీదు తీసుకున్నారు. రసీదు తీసుకున్నాక గృహ సారథులు అడగక ముందే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్‌ జగన్‌ సందేశంతో ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. గృహ సారథుల వద్ద నుంచి వైఎస్‌ జగన్‌ ఫొటో ఉన్న స్టిక్కర్లను తీసుకుని.. ఇంటి తలుపునకు, మొబైల్‌ ఫోన్‌కు అతికించి.. ‘జగనన్నే మా భవిష్యత్‌’ అంటూ నినదించారు.

20వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం 
‘జగన్నే మా భవిష్యత్తు’ పేరుతో భారీ ఎత్తున వైఎస్సార్‌సీపీ చేపట్టిన కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలల్లో 1.65 కోట్ల కుటుంబాల్లోని ఐదు కోట్ల మంది ప్రజలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతినిధులుగా గృహ సారథులు, కన్వీనర్లు, వలంటీర్లు కలవనున్నారు. 

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభం 
గత టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ మరోసారి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ’జగనన్నే మా భవిష్యత్తు’ మెగా పీపుల్‌ సర్వే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ‘1.65 కోట్ల ఇళ్లకి వెళ్లి ఈ సర్వే చేపడతాం. 7 లక్షలు మంది పార్టీ సైనికులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు ఈ సర్వే కోసం అందుబాటులో ఉంటారు. జగనన్న ప్రభుత్వానికి, గత టీడీపీ ప్రభుత్వానికి గల తేడాలను పోల్చి చెబుతారు’ అని తెలిపారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘కుల, మత, పార్టీలకు అతీతంగా ఈ మెగా పీపుల్‌ సర్వే జరుగుతుంది. దేశంలో ఇలాంటి కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి. ఇంత వరకు ఇంత ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదు. తాను ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజాభిప్రాయం కోరటం మొదటిసారి ఏపీలోనే జరుగుతోంది’ అని అన్నారు.

ఎంపీ ఎస్‌.సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సీఎం జగన్‌ పేదల తరుపున యుద్ధం చేస్తున్నారు. సీఎం జగన్‌కు అందరూ అండగా ఉండి సామాజిక కుట్రలు తిప్పికొట్టాలి. ప్రజల నుంచి వచ్చిన ప్రధాన నినాదం ‘మా నమ్మకం నువ్వే జగన్‌’. అందుకే ఈ నినాదాన్ని ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టాం. గత 46 నెలల్లో ప్రజల జీవితాల్లో, వారి జీవనశైలిలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం’ అని వివరించారు.

ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పటికే గడప గడపకూ తిరిగి జరిగిన అభివృద్ధి వివరించి చెబుతున్నాం. ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్స్‌ సర్వే కోసం ధైర్యంగా ప్రజల ముందుకు వెళుతున్నాం. ప్రతి తలుపు తడుతూ, ప్రతి గడప తొక్కుతూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరిస్తాం’ అని తెలిపారు.  

రాయలసీమ జిల్లాల్లో ఉత్సాహంగా..
► రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆలూరులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం,  కళ్యాణదుర్గం మండలం శీబావి గ్రామంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి ఉషశ్రీ చరణ్, వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడపలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పాల్గొన్నారు. 

► గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పుంగనూరులోని భగత్‌సింగ్‌ నగర్‌ కాలనీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం పూడి గ్రామంలో మంత్రి ఆర్కే రోజా  ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించారు. ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాలన్నింటిలో కార్యక్రమం కొనసాగింది.

అంతటా అదే ఉత్తేజం..
► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి,  ఒంగోలులోని గద్దలగుంటలో వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యర్రగొండపాలెంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌లు ప్రజల స్పందన తెలుసుకున్నారు. 

► పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలో మంత్రి అంబటి, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట మండలం వేమూరులో మంత్రి విడదల రజని పాల్గొన్నారు. మాచర్లలో ర్యాలీ నిర్వహించారు. 

► గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం ఘనంగా మొదలైంది. ఆయా కార్యక్రమాల్లో  రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

► బాపట్ల జిల్లా రేపల్లెలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు ప్రజలతో మమేకం అయ్యారు. వేమూరులో మంత్రి మేరుగ నాగార్జున కార్యక్రమంలో పాల్గొన్నారు. 

► ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వ్యాప్తంగా శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఉత్సాహంగా మొదలైంది. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ స్టిక్కర్లను ఇళ్ల గోడలు, తలుపులపై అంటించి ప్రజా మద్దతు కోరారు. పెడనలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడలో మాజీ మంత్రి వెలంపల్లి, మేయర్‌ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.   

► ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, తణుకులో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని ఇందిరమ్మ కాలనీలో హోం మంత్రి తానేటి వనిత, రాజమహేంద్రవరంలో ఎంపీలు మార్గాని భరత్‌రామ్, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రామచంద్రాపురంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

► విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరులో డిప్యూటీ æసీఎం రాజన్నదొర, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నేతలు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లారు.

► అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మోడల్‌ కాలనీలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, తుమ్మపాల పంచాయతీ పరిధిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. విశాఖ నగరంలో పార్టీ ఎమ్మెల్యేలు, శ్రేణులు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాయి.

ప్రజల స్పందన తెలుసుకునేందుకే : మంత్రి అంబటి
రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అందించిన సంక్షేమ పథకాలపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకునేందుకే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయని విధంగా.. ప్రజా స్పందన కోసం వారి వద్దకే వెళ్తున్నామని చెప్పారు. ‘నేను కూడా నకరికల్లు మండలం కుంకలగుంట, రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామాలలో పర్యటించాను. ప్రజల స్పందన సంతోషకరంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు ఒక్క వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఉంది. ప్రజల అనుమతితోనే తలుపుకు, సెల్‌ ఫోన్‌కు స్టిక్కర్‌ అంటిస్తున్నాం’ అని చెప్పారు.

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం : మంత్రి రజిని
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వెళ్లి ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ఐదు అంశాలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని నమోదు చేసుకుంటారని తెలిపారు. గత ప్రభుత్వ అరాచకాలను, అప్పట్లో ప్రజలు పడిన ఇబ్బందులను, ప్రజలు ఎలా మోసపోయారో కూడా వివరిస్తారని చెప్పారు. నవరత్నాలు పేరుతో హామీలు ఇచ్చి, వాటిని అతి తక్కువ సమయంలో అమలు చేసి ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లేలా చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక్క జగనన్నే కనిపిస్తారని చెప్పారు. చిలకలూరిపేట నియోజకవర్గం వేదికగా ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: అక్కడ సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement