జనసంద్రంలో నుంచి గుంపులుగుంపులుగా పరుగులు తీస్తున్న పశువులు
చంద్రగిరి: సంక్రాంతి సమీపిస్తోన్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని కొత్తశానంబట్ల గ్రామంలో ఆదివారం పరుష పందేలు (జల్లికట్టు)ను నిర్వహించారు. ఆంగ్ల నూతన సంవత్సరం రోజున ప్రతి ఏడాది పరుష పందేలను నిర్వహించడం ఇక్కడ ఆనవాయితి. వేడుకలను తిలకించడానికి జిల్లాతో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పశువులకు నల్లని దారాన్ని నడుముకు కట్టి, బుడగలు, పుష్పాలతో వాటిని అందంగా అలంకరించి, బరిలోకి దింపారు. ఆవులు, ఎద్దులు, కోడెగిత్తలను గుంపులు గుంపులుగా పరుగులెత్తించారు. జోరుగా దూసుకువచ్చే కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీపడ్డారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి చిత్రాలతో కూడిన పలకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోడెగిత్తలకు కట్టిన చెక్కపలకలను సొంతం చేసుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు. పరుష పందేరాల్లో భాగంగా పశువుల యజమానులు తమ కోడెగిత్తలను అదుపు చేయడంపై భారీగా పందేలు కాశారు. తన ఎద్దును అదుపు చేసిన వారికి ఒక ఎకరా పొలం రాసిస్తానంటూ ఓ వ్యక్తి పందెం కట్టడం విశేషం. మరికొందరైతే పట్టు వస్త్రాలు, నగదులను పందేలుగా పెట్టారు. కోడెగిత్తలను అదుపుచేసే సమయంలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment