నాదెండ్ల మనోహర్‌తో రవికుమార్
సాక్షి, శ్రీకాకుళం: 'రేపు రా నీకు తోలు తీసి వదలకపోతే నా కొడకా... నీకు చెబుతున్నా క్లియర్‌గా. తమాషాగా ఉందా ఏంటి. పద్దుకు మాలిన వెధవా.. నేను ఊరుకుంటున్నానని కాదు నా సంగతి నీకు తెలీదు. పాత బిల్లు అయినా నిద్దాంలో నాకు తెలియకుండా చేస్తే నరికిపారేస్తా నా కొడకా... తమాషాగా ఉందా నీకు. ఎవడైనా నిద్దాంలో నాకు తెలియకుండా చేస్తే ఊరుకోను. ఇళ్లు కాదు అన్నీ అపాలి. నిద్దాంలో ఆడు తీసుకెళ్లాడు, ఈడు తీసుకెళ్లాడు అని చెబితే ఊరుకోనిక్కడ నేను. ఏ వలంటీర్ చెప్పినా తీసుకెళ్లడానికి లేదు, చేయడానికి లేదు. నాకు తెలియకుండా ఏమీ జరగడానికి లేదు. సచివాలయానికి వచ్చి సచివాలయం చూసుకొని వెళ్లిపో అంతే..’
ఇదీ నిద్దాం సచివాలయ ఉద్యోగికి జనసేన నాయకుడు మీసాల రవికుమార్ చేసిన ఫోన్ బెదిరింపు.
జనసేన నేతలు దౌర్జన్యాన్ని నమ్ముకున్నట్టున్నారా? దాడులు, బెదిరింపులకు దిగి అటు ప్రజల్ని, ఇటు ఉద్యోగుల్ని భయపెట్టాలని చూస్తున్నారా? వీరంగం సృష్టిస్తే నాయకులమైపోతామని అనుకుంటున్నారా? ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఆ మధ్య రణస్థలం మండలం కొచ్చాడ గ్రామంలో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఇంటిపై బస్వ గోవిందరెడ్డి అనే జనసేన నేత దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అడ్డువచ్చిన దుర్గా ప్రసాద్ తల్లిదండ్రులు రాములమ్మ, అప్పలరాముడులపై భౌతికంగా దాడి చేశారు. తాజాగా జి.సిగడాం మండలం నిద్దాం గ్రామంలో జనసేన నాయకుడు మీసాల రవికుమార్ సచివాలయం ఉద్యోగికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు.
కొందరు జనసేన నాయకులు తమను ఎవరేమీ చేయలేరని కండకావరం చూపిస్తున్నారు. అటు ప్రజల్ని, ఇటు ఉద్యోగుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కూడా అడ్డు తగులుతున్నారు. ఏదీ జరగకూడదని, ఏం జరిగినా తమకు చెప్పి చేయాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రణస్థలం మండలానికి చెందిన బస్వ గోవిందరెడ్డి ఇలాగే వ్యవహరించారు. తాజాగా జి.సిగడాం మండలం నిద్దాం గ్రామంలో జనసేన నాయకుడు మీసాల రవికుమార్ అదే రకంగా బెదిరింపులకు దిగారు. ఆ గ్రామంలో దళిత మహిళ సర్పంచ్. కానీ పవర్ అంతా మీసాల రవికుమారే చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఏ చిన్న పని అయినా తనకు తెలియకుండా చేస్తే ‘మీకు తోలు తీస్తా..’ అంటూ సచివాలయం ఉద్యోగస్తులపై వీరంగం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ సచివాలయం ఉద్యోగులు ప్రతి రోజూ భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నారు.
చదవండి: (పెళ్లిలో కూడానా.. ఇదేమి ఖర్మరా బాబు..!)
ఇప్పటికే సెలవుపై వెళ్లిన ఒక ఉద్యోగి
నిద్దాం పంచాయతీకి ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలు అర్హులకు ఇవ్వకుండా తనకు నచ్చిన వారికి మాత్రమే మంజూరు చేయాలని ఇంజినీరింగ్ అసిస్టెంట్ కె.అశోక్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చి మానసికంగా ఇబ్బందులు పెట్టి నోటికి ఏది వస్తే అదే మాట్లాది వేధించారు. దీంతో ఆ ఉద్యోగి సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉండిపోయాడు. ఇన్‌చార్జి ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా సీతంపేట సచివాలయానికి చెందిన వంపూరి గోపికి బాధ్యతలు అప్పగించారు.
అయితే అతనిని కూడా జనసేన నాయకుడు వదలడం లేదు. గ్రామంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తూ.. అధిక సంఖ్యలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి, కోర్టుల ద్వారా నోటీసులిస్తూ భయపెట్టడమే కాకుండా నోటికి కూడా పని చెబుతున్నాడు. నేరుగా ఫోన్‌లో బెదిరింపులకు దిగాడు.
‘చెప్పినట్టే సచివాలయం ఉద్యోగస్తులు పని చేయాలి.. లేకుంటే సెలవుపై వెళ్లిపోండి... లేకపోతే మీ అంతు చూస్తా..’ అంటూ నానా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో నిద్దాం గ్రామంలో ఉద్యోగం చేయలేమని సచివాలయం ఉద్యోగులు ఇప్పటికే సంబంధిత అధికారుల ముందు వాపోయారు. వంపూరి గోపికి ఫోన్ చేసి బెదిరించిన విషయమంతా ఆడియో లీక్ ద్వారా బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment