గణేష్‌నగర్‌లోని కల్నల్ నివాసంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఇది దేశ రక్షణలో నిమగ్నమైన కల్నల్ కుటుంబంపై ఓ జనసైనికుడి దాష్టీకం. కల్నల్ ఇంటిని నివాసానికని అద్దెకు తీసుకొని, పార్టీ కార్యాలయం పెట్టారు. అందులో అనైతిక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా, ఇదేమిటని ప్రశ్నించి ఇల్లు ఖాళీ చేయమన్న ఆయన తల్లినీ బెదిరించాడు. దౌర్జన్యానికి దిగాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను కార్గిల్‌లో పనిచేస్తున్న కల్నల్ మహేశ్వరరెడ్డి ట్విట్టర్‌లో వెల్లడించారు. తరచూ అక్కడ మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారని చెప్పారు.
ఈ పోస్టు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ‘సాక్షి’తో కూడా మాట్లాడారు. వివరాలివీ.. కర్నూలు సీ క్యాంపు గణేశ్‌నగర్‌కు చెందిన మహేశ్వరరెడ్డి భారత సైన్యంలో కల్నల్‌గా కార్గిల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఇంటిని (హౌస్ నంబర్ 87/1024)ను 2021 మేలో షేక్‌మహ్మద్ మహబూబ్‌బాషా, అతని భార్య హసీనా బేగం అద్దెకు తీసుకున్నారు. నివాసానికి అని చెప్పి తీసుకున్నప్పటికీ, అందులో నేషనల్ ఉమెన్స్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
అనంతరం జనసేనలో చేరి, ఆ పార్టీ కార్యాలయంగా మార్చారు. అద్దె కూడా చెల్లించలేదు. నివాసానికి అని చెప్పి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, అద్దె కూడా చెల్లించడంలేదని, వెంటనే ఖాళీ చేయాలని కల్నల్ నోటీసులు ఇచ్చారు. జనవరిలో స్వయంగా కల్నల్ వచ్చి వారితో మాట్లాడారు. ఫిబ్రవరి 28 లోపు ఖాళీ చేయాలని గట్టిగా చెప్పారు. అయినా ఖాళీ చేయలేదు. మంగళవారం కల్నల్ తల్లి లక్ష్మీదేవి ఇంటిని ఖాళీ చేయాలని బాషాకు చెప్పారు. ఖాళీ చేయనని, గట్టిగా మాట్లాడితే మీ అంతు చూస్తామని బాషా బెదిరించారు.
ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కల్నల్ కుటుంబ సభ్యులు జనసేన కార్యాలయంలోని ఫర్నీచర్‌ను బయట పెట్టి తాళం వేసుకున్నారు. తమను బెదిరించిన బాషాపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహబూబ్ బాషాపై కల్నల్, ఆయన తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని త్రీ టౌన్ సీఐ మహ్మద్ తబ్రేజ్ చెప్పారు. బాషాపై గతంలోనే ఓ అత్యాచారం కేసు నమోదైంది.
తన కార్యాలయంలో పనిచేసిన ఓ మహిళపై అత్యాచారం చేసినట్లు, ఫోన్‌లో పలుమార్లు బాధితురాలిని బెదిరించినట్లు 2021 అక్టోబరు 18న కేసు నమోదైంది. ఆడియో రికార్డులతో సహా ఆమె త్రీటౌన్, దిశ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బాషాపై సెక్షన్ 376 క్లాజ్–1, 376 క్లాజ్–సి, 354 డి, 506, 108 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన రిమాండ్‌కు కూడా వెళ్లొచ్చాడు.
జనసేనకు ప్రశ్నలు సంధించిన కల్నల్
తాను సరిహద్దుల్లో దేశం కోసం శ్రమిస్తున్నానని, కానీ జనసేన నేతలు తమను, తమ కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారని కల్నల్ అన్నారు. జనసేన రాష్ట్ర నాయకత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. పార్టీలోకి చేర్చుకునే వ్యక్తుల పూర్వాపరాలు పరిశీలించరా? పార్టీ నేతలు, కార్యకర్తలకు కనీస విలువలు ఉండవా? నేరస్తులను పార్టీలోకి చేర్చుకుని ఏం సందేశం ఇస్తున్నారు? ఇతరుల నివాసాల్లో అసాంఘిక కార్యకలాపాలు చేసుకోండని జనసేన ప్రోత్సహిస్తోందా? మహిళను దూషించడం, కొట్టడం లాంటి చర్యలకు పార్టీ మద్దతిస్తోందా? అని ప్రశ్నించారు. బాషాపై వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment