విశాఖలోని సీఐడీ రీజనల్ కార్యాలయంలో జయలక్ష్మి సొసైటీ రికార్డుల అప్పగింత
కాకినాడ రూరల్: కాకినాడ జిల్లాలో సుమారు రూ.520 కోట్ల వరకు డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన ది జయలక్ష్మి మ్యూచువల్లి ఎయిడెడ్ మల్టీ పర్పస్ (ఎంఏఎం) కో–ఆపరేటివ్ సొసైటీ కేసు విచారణ బాధ్యత సీబీ సీఐడీ చేపట్టనుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్‌లో ప్రధాన బ్రాంచ్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచ్‌లు కలిగి బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్న ది జయలక్ష్మి ఎంఎఎం కో–ఆపరేటివ్ సొసైటీ ఆకర్షణీయమైన వడ్డీల పేరిట 19,971 మంది నుంచి డిపాజిట్లను సేకరించింది.
వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సుమారు రూ.520 కోట్ల వరకు డిపాజిట్ చేసినట్లు తెలిసింది. కాగా, కాలవ్యవధి పూర్తిచేసుకున్న డిపాజిట్‌దారులకు ఆ మొత్తాన్ని చెల్లించకుండా తిప్పుకుంటుండడంతో.. వారు సంస్థ కార్యాలయం ముందు పలుమార్లు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్ 6వ తేదీ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి సంస్థ పాలకవర్గం అదృశ్యమయ్యింది. డిపాజిటర్ల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసు స్టేషన్‌తో పాటు ఆయా బ్రాంచ్‌ల పరిధిలోనూ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకు రూ.230 కోట్ల మేర అవకతవకలు జరిగాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు ‘సహకార’ ఉద్యోగులతో విచారణ కమిటీని నియమించింది. వారి విచారణ గడువు జూన్ 22వ తేదీ (60 రోజులు)తో ముగిసినా.. విచారణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో మరో రెండు నెలలు గడువు పొడిగించాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే.. చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు పరారీలో ఉండడం, వారిని ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయకపోవడంతో డిపాజిట్ దారులు ఆందోళనకు దిగారు.
విచారణను సీబీ సిఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో డీజీపీ ఆదేశాల మేరకు ‘జయలక్ష్మి’ కేసును పోలీసులు సీబీ సీఐడీకి అప్పగించారు. సర్పవరం జంక్షన్ వద్దనున్న సంస్థ మెయిన్ బ్రాంచ్‌లో స్వాధీనం చేసుకున్న రికార్డులను పోలీసులు విశాఖలోని ఆర్‌ఐఓ కార్యాలయంలో సీబీ సీఐడీ అధికారులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment