సాక్షి ప్రతినిధి, అనంతపురం/మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తరచూ తన వ్యవహారశైలితో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈసారి ఏకంగా కలెక్టర్‌పైనే రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చిన ఆయన కలెక్టర్ నాగలక్ష్మిపై అరుపులు, కేకలతో ఊగిపోతూ తీవ్ర అలజడి సృష్టించి దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు.
కనీస మర్యాద కూడా లేకుండా కలెక్టర్‌ను ఏకవచనంతో సంబోధించారు. ఆమె ముందే పేపర్లు విసిరేశారు. అడ్డుకోబోయిన కలెక్టర్ గన్‌మెన్‌ను తోసేసి నానా రభస సృష్టించారు. అప్పటికీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సర్దిచెబుతున్నా వినకుండా అరుపులు, కేకలతో రెచ్చిపోయారు. మీరున్నది ఎందుకంటూ తీవ్రస్వరంతో గద్దించారు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుతో అక్కడున్న రెవెన్యూ సిబ్బంది తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
అసలేం జరిగిందంటే..
తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సర్వే నంబరు 775లోని 6.93 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి జేసీ ప్రభాకర్‌రెడ్డి కలెక్టరేట్‌లో ‘స్పందన’కు వచ్చారు. ఆ సర్వే నంబర్‌లోని పలు భూములు 22ఏ (చుక్కల భూములు) జాబితాలో ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగా అక్కడి భూ అనుభవదారులు కొందరు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే సర్వే నంబరు 775లోని ఓ భూమికి సంబంధించిన ఫైలును 2021 నవంబరులో ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. కిందిస్థాయి నుంచి అంటే తహసీల్దార్ నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ ఫైలును ప్రభుత్వానికి పంపించారు.
సీసీఎల్‌ఏ అధికారులు ఈ ఫైలును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 2022 ఫిబ్రవరిలో ఈ భూమిని చుక్కల భూముల జాబితా నుంచి తొలగించాలని జీఓ ఇచ్చారు. దీని ఆధారంగా ఈ 6.93 ఎకరాలతో పాటు ఇదే గ్రామంలోని మరో 40 ఎకరాల వరకూ చుక్కల భూముల నుంచి విముక్తి కల్పించారు.
అనంతరం ఈ భూమిని సదరు యజమాని.. అంబటి రాఘవేంద్రరెడ్డి అనే వ్యక్తికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే, ఈ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి కలెక్టరుతో వాగ్వాదానికి దిగారు.
మండిపడిన ఉద్యోగులు
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారశైలిపై అధికారులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. కలెక్టరుతో ఆయన ప్రవర్తించిన తీరు సరికాదని.. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం జిల్లా అధికారుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు.
జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్‌తో మాట్లాడేది ఇలాగేనా.. ఇదేనా మీ సభ్యత.. సంస్కారం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. ఇలాంటివి పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె.సి.ప్రభాకర్‌రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర చైర్మన్ వీఎస్ దివాకర్, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బి. సుగుణ సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
కలెక్టర్‌తో పాటుగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులపై ఆయన దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని తమ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఐఏఎస్ స్థాయి అధికారులతోనే జేసీ ఇలా వ్యవహరిస్తే సాధారణ ప్రభుత్వోద్యోగుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే జేసీపై చర్యలు తీసుకోవాలన్నారు.
అప్పటికప్పుడు నిర్ణయం కాదు
ఈ ఫైలును రాత్రికి రాత్రే చేసినట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. అలా చేయడానికి సాధ్యంకాదు. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి చేయడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది. పైగా ఈ ఫైలును సీసీఎల్‌ఏ పరిశీలనకు పంపించేశాం. ఇందులో ఎవరి సిఫార్సులూ, ఒత్తిళ్లూ లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేశాం.
– నాగలక్ష్మి సెల్వరాజన్, కలెక్టర్
జిల్లాలో లక్ష ఎకరాలు చేశాం.. ఇదొక్కటే కాదు
జిల్లాలో లక్ష పైచిలుకు ఎకరాల భూమిని 22ఎ నుంచి విముక్తి కల్పించాం. సజ్జలదిన్నె గ్రామంలోని ఆ భూమి ఒక్కటే కాదు. ఈ భూమి కూడా ప్రభుత్వ పరిశీలనకు పంపించేశాం. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ప్రతీఒక్క అడుగూ నిబంధనల ప్రకారమే వేశాం. ఇందులో ఎలాంటి వివాదాలకూ తావులేదు.
– కేతన్‌గార్గ్, జాయింట్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment