Anantapur District Collector
-
కలెక్టర్‌పై రెచ్చిపోయిన జేసీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం/మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తరచూ తన వ్యవహారశైలితో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈసారి ఏకంగా కలెక్టర్‌పైనే రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చిన ఆయన కలెక్టర్ నాగలక్ష్మిపై అరుపులు, కేకలతో ఊగిపోతూ తీవ్ర అలజడి సృష్టించి దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. కనీస మర్యాద కూడా లేకుండా కలెక్టర్‌ను ఏకవచనంతో సంబోధించారు. ఆమె ముందే పేపర్లు విసిరేశారు. అడ్డుకోబోయిన కలెక్టర్ గన్‌మెన్‌ను తోసేసి నానా రభస సృష్టించారు. అప్పటికీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సర్దిచెబుతున్నా వినకుండా అరుపులు, కేకలతో రెచ్చిపోయారు. మీరున్నది ఎందుకంటూ తీవ్రస్వరంతో గద్దించారు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుతో అక్కడున్న రెవెన్యూ సిబ్బంది తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అసలేం జరిగిందంటే.. తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సర్వే నంబరు 775లోని 6.93 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి జేసీ ప్రభాకర్‌రెడ్డి కలెక్టరేట్లో ‘స్పందన’కు వచ్చారు. ఆ సర్వే నంబర్లోని పలు భూములు 22ఏ (చుక్కల భూములు) జాబితాలో ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగా అక్కడి భూ అనుభవదారులు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సర్వే నంబరు 775లోని ఓ భూమికి సంబంధించిన ఫైలును 2021 నవంబరులో ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. కిందిస్థాయి నుంచి అంటే తహసీల్దార్ నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ ఫైలును ప్రభుత్వానికి పంపించారు. సీసీఎల్ఏ అధికారులు ఈ ఫైలును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 2022 ఫిబ్రవరిలో ఈ భూమిని చుక్కల భూముల జాబితా నుంచి తొలగించాలని జీఓ ఇచ్చారు. దీని ఆధారంగా ఈ 6.93 ఎకరాలతో పాటు ఇదే గ్రామంలోని మరో 40 ఎకరాల వరకూ చుక్కల భూముల నుంచి విముక్తి కల్పించారు. అనంతరం ఈ భూమిని సదరు యజమాని.. అంబటి రాఘవేంద్రరెడ్డి అనే వ్యక్తికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే, ఈ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి కలెక్టరుతో వాగ్వాదానికి దిగారు. మండిపడిన ఉద్యోగులు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారశైలిపై అధికారులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. కలెక్టరుతో ఆయన ప్రవర్తించిన తీరు సరికాదని.. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం జిల్లా అధికారుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్‌తో మాట్లాడేది ఇలాగేనా.. ఇదేనా మీ సభ్యత.. సంస్కారం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. ఇలాంటివి పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె.సి.ప్రభాకర్‌రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర చైర్మన్ వీఎస్ దివాకర్, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బి. సుగుణ సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కలెక్టర్‌తో పాటుగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులపై ఆయన దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని తమ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఐఏఎస్ స్థాయి అధికారులతోనే జేసీ ఇలా వ్యవహరిస్తే సాధారణ ప్రభుత్వోద్యోగుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే జేసీపై చర్యలు తీసుకోవాలన్నారు. అప్పటికప్పుడు నిర్ణయం కాదు ఈ ఫైలును రాత్రికి రాత్రే చేసినట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. అలా చేయడానికి సాధ్యంకాదు. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి చేయడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది. పైగా ఈ ఫైలును సీసీఎల్ఏ పరిశీలనకు పంపించేశాం. ఇందులో ఎవరి సిఫార్సులూ, ఒత్తిళ్లూ లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేశాం. – నాగలక్ష్మి సెల్వరాజన్, కలెక్టర్ జిల్లాలో లక్ష ఎకరాలు చేశాం.. ఇదొక్కటే కాదు జిల్లాలో లక్ష పైచిలుకు ఎకరాల భూమిని 22ఎ నుంచి విముక్తి కల్పించాం. సజ్జలదిన్నె గ్రామంలోని ఆ భూమి ఒక్కటే కాదు. ఈ భూమి కూడా ప్రభుత్వ పరిశీలనకు పంపించేశాం. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ప్రతీఒక్క అడుగూ నిబంధనల ప్రకారమే వేశాం. ఇందులో ఎలాంటి వివాదాలకూ తావులేదు. – కేతన్‌గార్గ్, జాయింట్ కలెక్టర్ -
సాక్షి ఎఫెక్ట్: సబ్ రిజిస్ట్రార్ సురేష్ ఆచారి సస్పెన్షన్
అనంతపురం టౌన్: ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ సురేష్ ఆచారిని సస్పెండ్ చేస్తూ డీఐజీ మాధవి శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ రవివర్మ తెలిపారు. సురేష్ ఆచారి అనంతపురం రూరల్ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన కాలంలో ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న వాటిని సైతం రిజిస్ట్రేషన్ చేసిన వైనంపై ‘సాక్షి’ ఈ నెల 1వ తేదీన ‘ప్రభుత్వ భూమిపై పచ్చమూక’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ నిషాంత్ కుమార్ విచారణ కోసం ఓ కమిటీని నియమించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట రెవెన్యూ రికార్డుల్లోకి ఎలా ఎక్కించారు...? దాన్ని ఎలా రిజిస్టర్ చేశారు..? తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి నివేదికను అందజేయాలని ఆదేశించారు. దీంతో రాప్తాడు తహసీల్దార్ ఈరమ్మ రాప్తాడు పొలం సర్వే నంబర్ 123–2లోని భూమి వంక పోరంబోకు అని, పైగా నిషేధిత జాబితాలో ఉందని నివేదికను అందజేశారు. మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖ తరఫున విచారణ చేపట్టిన డీఐజీ మాధవి నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సురేష్ ఆచారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సర్వే నంబర్ భూములను యాడికి రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ రిజిస్ట్రేషన్ చేయగా... ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ రవివర్మ తెలిపారు. చదవండి: ప్రభుత్వ భూమిపై పచ్చమూక.. ఆక్రమణ విలువ రూ.100 కోట్ల పైమాటే టీడీపీ బడాయి.. బిల్లుల కోసం లడాయి! -
అనంత కలెక్టర్‌కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి / అనంతపురం అర్బన్: ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ జాతీయ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పనితీరుపై సీఎం ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చే దిశగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య, జేడీఏ రామకృష్ణ పాల్గొన్నారు. చదవండి: (పీఎం కిసాన్ అవార్డు అందుకున్న ‘అనంత’ కలెక్టర్) -
మీ చర్యలు బాగున్నాయ్.. కలెక్టర్‌కు కేంద్రం ప్రశంసలు
సాక్షి, అనంతపురం అర్బన్: కోవిడ్ కేర్ సెంటర్లలోని వ్యక్తుల్లో మానసింకంగా ఉల్లాసం నింపేందుకు కలెక్టర్ తీసుకున్న చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా ప్రశంసలు కురిపించింది. కేర్ సెంటర్లలోని పేషంట్లు కాలక్షేపం లేకపోవడంతో ఒంటరితనం భావనలో ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. శారీరక, మానసిక ఉల్లాసం కల్పించడం ద్వారా వారిలోని ఒంటరి భావన తొలగించవచ్చని ఆలోచన చేశారు. అందులో భాగంగా కేర్‌సెంటర్లలో టెన్సిస్, షెటిల్, వాలీబాల్, క్యారమ్స్ వంటి ఆటలు, సంగీతం కోసం మ్యుజిక్ సిస్టం ఏర్పాటు చేయించారు. ఉదయం, సాయంత్రం వేళ ఎవరికి నచ్చిన... వచ్చిన ఆటలను అంతే కాకుండా కేర్ సెంటర్లలో కౌన్సిలర్లను ఏర్పాటు చేయించారు. వారు కోవిడ్ పేషంట్లకు కౌన్సిలింగ్ ఇస్తూ ఆత్మస్థైర్యం నింపుతారు. కోవిడ్ కేర్ సెంటర్లలో పేషంట్ల ఉల్లాసం కోసం విడుదల చేసిన డాక్యుమెంటరీపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విటర్ దారా స్పందించింది. కోవిడ్ కేర్ సెంటర్లలో మానసిక, శారీరక ఉల్లాసం కోసం తీసుకున్న చర్యల వల్ల పేషంట్లు ఉత్సాహంగా ఉంటూ త్వరగా రికవరీ అవుతారని పేర్కొంది. (రియల్ హీరోస్..) #IndiaFightsCorona A glimpse of the facilities being provided at the #COVID19 Care Centre, Anantapur district, Andhra Pradesh to the inmates to boost their morale and mental wellness. @PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @PIB_India @COVIDNewsByMIB @CovidIndiaSeva pic.twitter.com/8aVYYC15q2 — Ministry of Health (@MoHFW_INDIA) August 3, 2020 -
కరోనా పరీక్షలు చేయించుకోలేదు: కలెక్టర్
సాక్షి, అనంతపురం: తాను ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వస్తున్న వార్తలు ఆయన తోసిపుచ్చారు. అయితే జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావుకు పరీక్షలు చేయించామని, ఆయనకు నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. (కరోనా ఆస్పత్రిగా కిమ్స్ సవీరా) కరోనా కట్టడి కోసం మరిన్ని పకడ్భందీ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రోళ్ల తహశీల్దార్ దంపతులకు కరోనా పాజిటివ్ రావటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావుకు కరోనా పరీక్షలు నిర్వహించామని.. నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయన్నారు. కిమ్స్-సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ రోగులను స్వయంగా పరామర్శించిన కలెక్టర్ ... వారికి ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రజలంతా ఇంటికే పరిమితం అయితే కరోనా ను జయించవచ్చని తెలిపారు. (కరోనా: నిర్లక్ష్యం వైరస్) 21 పాజిటివ్ కేసులు నమోదు జిల్లాలో ఇప్పటివరకూ 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కోవిడ్-19 ప్రత్యేక అధికారి విజయానంద్ తెలిపారు. అలాగే పాజిటివ్ వ్యక్తులు కలిసినవారి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. 300మంది క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని, అనంతపురం, హిందూపురం పట్టణాల్లో రెడ్ జోన్లు ఏర్పాటు చేసినట్లు విజయానంద్ పేర్కొన్నారు. మే 3 వరకూ జరిగే లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు. -
అదిరిందయ్యా చంద్రం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాలనలో తనదైన ముద్రను కనపరుస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూనే ప్రజలకు దగ్గరయ్యే దిశగా నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓ ప్రత్యేక పోస్టర్‌ను రూపొందించారు. ‘‘ఈ కార్యాలయం మనందరిది. అధికారులను కలిసే సమయంలో ఇలాంటి పనులు చేయకండి’’ అని ప్రజలకు సూచనలు చేస్తున్నారు. కలెక్టర్ గంధం చంద్రుడు రూపొందించిన పోస్టర్ ‘‘చెప్పులు విడవకండి.. మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకుని నిలబడకండి. కన్నీరు పెట్టుకోకండి. కాళ్లు మొక్కకండి. ఆత్మగౌరవంతో మీ సమస్యను స్పష్టంగా వివరించండి.’’ అని తెలియజేసే పోస్టర్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా దూసుకుపోతున్నాయి. ఈ పోస్టర్లను జిల్లాస్థాయి కార్యాలయాలతో పాటు ప్రతి మండల కార్యాలయాలకు పంపి ప్రజలకు కనిపించే విధంగా అతికించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ వినూత్న పోస్టర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చదవండి: నేనూ రాయలసీమ బిడ్డనే: అనంత కలెక్టర్ -
నేనూ రాయలసీమ బిడ్డనే: అనంత కలెక్టర్
‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవినీతి ఏ స్థాయిలో జరిగినా సహించేది లేదని తేల్చిచెప్పారు. జిల్లాలో ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదు. ఎంతటివారైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు సేవకులుగా వారికి సేవ చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉంది. నాకు జిల్లా ఉద్యోగులపై నమ్మకం ఉంది. అయితే, ఎవరైనా అవినీతికి పాల్పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఉక్కుపాదంతో అణచివేస్తాం.’’ అని కలెక్టర్ గంధం చంద్రుడు తేల్చిచెప్పారు. సామాజిక అభివృద్ధి విజన్ ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తానని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. – సాక్షి ప్రతినిధి, అనంతపురం సాక్షి, అనంతపురం: నేనూ రాయలసీమ బిడ్డనే. రాయలసీమను రతనాల సీమగా పిలిచేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మళ్లీ పూర్వవైభవం కోసం ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, మీడియా, ప్రజా సంఘాల సహకారంతో ముందుకు వెళతాను. జిల్లాకు 100వ కలెక్టరుగా రావడం...అది నాకు కలెక్టరుగా మొదటి పోస్టింగు కావడం గర్వంగా ఉంది. జిల్లా అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అందరి సహకారంతో ముందుకు సాగుతాను. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో సామాజిక– ఆర్థిక అభివృద్ధి అనే కోణం ఉంది. తప్పకుండా అది నేరవేర్చేందుకు కృషి చేస్తాను. ‘వైఎస్సార్ నవశకం’ కార్యక్రమం ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువచేస్తాం. జిల్లాలో ఉన్న అపార అవకాశాలను ఉపయోగించి అగ్రభాగాన నిలబెట్టేందుకు అహర్నిశలు కృషిచేస్తాను. నాలుగు అంశాలతో ముందుకు...! పాలనలో నాలుగు అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తాను. మొదటగా నేరుగా ప్రజల అవసరాలు ఏమిటి? వారి సమస్యలు ఏమిటి? పరిష్కారం ఎలా అన్న అంశాలపై దృష్టిసారిస్తాను. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు... వారి ద్వారా వచ్చే ప్రజాసమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెడతాను. ఆ తర్వాత ఉద్యోగులు... పాలనకు వీరి సహకారం ఎంతో అవసరం. అందువల్ల ప్రజాసమస్యల పరిష్కారంలో వారి సలహాలతో పరిష్కారంపై దృష్టి సారిస్తాను. ఆ తర్వాత మీడియా, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు... వీరి ద్వారా నా దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ఇలా సమన్వయం చేసుకుంటూ అందరినీ ఒక మార్గంలోకి తీసుకు వచ్చి పని చేసే బాధ్యత టీం లీడర్‌గా జిల్లా కలెక్టర్ పైన ఉంటుంది. ప్రజల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే అంశాలపై యంత్రాంగం వెంటనే స్పందించేలా చూస్తా. సామాజిక–ఆర్థిక అభివృద్ధి దిశగా...! సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సామాజిక–ఆర్థిక అభివృద్ధి కోణంలో పాలన సాగిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం ఆర్థికాభివృద్ధి కోణంలో కాకుండా సామాజిక అభివృద్ధి కోణంలో కూడా ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం వాటా ఇవ్వడం ఇలా సామాజిక అభివృద్ధి కోణం ఉంది. పరిశ్రమలల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడి ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. అదే విధంగా ‘మనబడి–నాడు నేడు’ అద్భుతమైన కార్యక్రమం. ప్రజలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమైనది విద్య. విద్య మీద దృష్టి సారిస్తే అన్ని విషయాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. పాఠశాలల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు...మరుగుదొడ్లు, విద్యుత్, నీటి సౌకర్యంతో పాటు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడటం అన్నీ ప్రభుత్వం చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక విజన్‌ను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాడానికి నా శక్తిమేరకు కృషి చేస్తాను. ఇంకా ఇక్కడ మూఢనమ్మకాల నిర్మూలనతో పాటు, కులాల దొంతరలను తొలగించేందుకు కృషి చేస్తాను. అనంత..అవకాశాల గని! అనంతపురం జిల్లాలో అపార అవకాశాలున్నాయి. ఒకవైపు సుదీర్ఘ రహదారులు, దగ్గరలోనే విమానాశ్రయం, అపారమైన మానవ వనరులు, విశాలమైన భూములతో పాటు అనేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో జిల్లా అంతర్భాగంగా ఉంది. తద్వారా పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక లైమ్‌స్టోన్, బ్లాక్ స్టోన్ వంటి ముడిసరుకు ఉంది. ఇది పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ఉపయోగం. వీటీని ఉపయోగించుకుంటూ ప్రణాళిక ప్రకారం అందరిని సమన్వయం చేసుకుంటూ వెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఒక్కప్పుడు రాయలసీమ రత్నాల సీమ. ఇప్పటి కూడా ఆ విధంగా చేయవచ్చు. నేను రాయలసీమ బిడ్డనే. రాయలసీమలోనే పుట్టి పెరిగినవాడినే. ఇక్కడి వాతావరణం తెలుసు. ఇక్కడ భూమి, గాలి, నీరు అన్ని తెలుసు. రాయలసీమ బిడ్డగా జిల్లాను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాను. -
శభాష్ సత్యనారాయణ అంటూ సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, అనంతపురం: కరువు జిల్లా ‘అనంత’లో వైఎస్సార్ రైతు భరోసా పథకం పకడ్బందీగా అమలు చేసి ఎందరో రైతులకు సాయం దక్కేలా చూసిన కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అందరూ ఇలా కృషి చేయాలని ప్రశంసించారు. మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర శాఖాధిపతులతో రాజధాని నుంచి కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రైతు భరోసా, ఆటోడ్రైవర్లకు నగదు సహాయ పథకం, వైఎస్సార్ కంటి వెలుగు రెండో విడత, ఇళ్ల స్థలాల పంపిణీ, గ్రామ సచివాలయాల్లో మౌలిక వసతుల కల్పన, ఇసుక కొరత లేకుండా చర్యలు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తదితర పథకాల అమలు, పురోగతిపై సీఎం ఆరాతీశారు. ఈ క్రమంలో రైతు భరోసాపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 4,81,498 రైతు కుటుంబాలకు భరోసా కింద రూ.390 కోట్లు జమ చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ, బ్యాంకర్ల సహకారంతో భరోసా సమర్థవంతంగా అమలు చేశామన్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. వీడియా కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జేసీ ఎస్.ఢిల్లీరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డీఆర్ఓ వెంకటసుబ్బారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభా స్వరూపారాణి, డీపీఓ రామనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, అనంతపురం అర్బన్: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని ఎన్ఐసీలో సచివాలయ ఉద్యోగాల పరీక్ష నిర్వహణ, ప్రజాసమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదలైనందున.. వెంటనే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయాలన్నారు. అలాగే పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని డీఆర్ఓ సుబ్బారెడ్డిని ఆదేశించారు. ఎక్కడా పొరపాట్లు దొర్లకూడదని సూచించారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది సిబ్బంది, కంప్యూటర్, ఇతర వసతులకు అనుగుణంగా ఉండే భవనాలను గుర్తించాలన్నారు. సమస్యలకు వేగవంతంగా పరిష్కారం చూపాలి ప్రజా సమస్యలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా హౌసింగ్, రేషన్ కార్డులపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. పెన్షన్ల అర్జీలు వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా డిప్యూటీ సీఈఓను నియమించాలని జెడ్పీ సీఈఓ శోభస్వరూపారాణిని ఆదేశించారు. సర్వే సమస్యలు 30 రోజుల్లోగా పరిష్కారం అవుతున్నాయో...లేదో పరిశీలించుకోవాలని సర్వే శాఖ ఏడీ మశ్చీంద్రనాథ్ను ఆదేశించారు. అలాగే ఆర్డీఓలు ప్రతి శనివారం కోర్టు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆర్ఓఆర్, 1–బి, అడంగల్‌లో వివరాలు సరిజేయడం, తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ‘పల్లెపిలుపు’ కార్యక్రమం సందర్భంగా సమస్యల పరిష్కారాన్ని ర్యాండమ్‌గా పరిశీలించాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలోని పరిస్థితులను ప్రతిబింబించే ఫొటోలు తీయాలన్నారు. వాటిలో అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 హెచ్.సుబ్బరాజు, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ అలీంబాషా పాల్గొన్నారు. -
కరువునెదిరించిన సు‘ధీరుడు’
ఆయనో విద్యావంతుడు. నెలకు ఐదంకెల జీతం. రైతు కుటుంబం నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగి. కాంక్రీట్ వనాల్లో సంతోషం కరువై వ్యవసాయంపై మనసు మళ్లింది. అనుకున్నదే తడవుగా సొంతూరికి చేరుకుని లక్ష్యం దిశగా అడుగులు వేశాడు. ఎడారికే పరిమితమైన ఖర్జూర సాగును కరువు జిల్లాలో చేపట్టి లాభాల పంట పండిస్తున్నాడు. జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదివారం స్వయంగా తోటను పరిశీలించి ఆ యువకుడిని అభినందించడం విశేషం. సాక్షి, నార్పల: మండలంలోని బొందలవాడకు చెందిన యండ్లూరి సుధీర్‌నాయుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. కానీ వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమున్న ఆయన..స్వగ్రామం చేరుకుని పంటలసాగుకు సిద్ధమయ్యాడు. అయితే అందరిలా కాకుండా వినూత్న పంటలు సాగుచేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే ఎడారిలో పండే ఖర్జూర సాగుపై వివరాలు సేకరించాడు. అనంత భూములు ఖర్జూరు సాగుకు అనుకూలమని తెలుసుకున్నాడు. ఇక్కడి ఉష్ణోగ్రత కూడా పంట సాగుకు అనుకూలమని తెలిసి ఆరేళ్ల క్రితం మూడు ఎకరాల్లో 270 కర్జూర చెట్లు నాటాడు. పంటకు అవసరమైన సస్యరక్షణ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాడు. ఫలితంగా ఖర్జూరం సిరులు కురిపిస్తోంది. ఈ సంవత్సరానికి గాను రూ.30 లక్షల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో సుధీర్ నాయుడు పేరు మార్మోగిపోయింది. ఖర్జూర తోటను పరిశీలించిన కలెక్టర్ సుధీర్ నాయుడు గురించి తెలుసుకున్న కలెక్టర్ సత్యనారాయణ ఆదివారం బొందలవాడ గ్రామానికి వచ్చి ఖర్జూర తోటను పరిశీలించారు. పంట పెట్టడానికి ఎంత పెట్టుబడి అవుతుంది.., ఎన్ని సంవత్సరాలకు పంట చేతికి వస్తుంది.., మార్కెటింగ్ సదుపాయం ఎలా ఉంది.. తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ‘అనంత’ భూములు ఉద్యాన పంటలకు అనుకూలమన్నారు. కలింగర, ఢిల్లీ కర్బూజ, అరటి, మామిడి, చీనీ, ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి, జామ లాంటి ఉద్యాన పంటలు సాగు ఎక్కువగా ఉంటుందన్నారు. కానీ బొందలవాడకు చెందిన యువకుడు ఒకడుగు ముందుకు వేసి ఖర్జూర పంట సాగుచేసి అధిక ఆదాయం పొందడం సంతోషదాయకమన్నారు. కలెక్టర్ వెంట ఏపీఎంఐపీడీ సుబ్బరాయుడు, ఏడీ చంద్రశేఖర్, సతీష్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
సీఎం ఆశయాలకు అనుగుణంగా..
సాక్షి, అనంతపురం అర్బన్: గత ప్రభుత్వ హయాంలో ప్రజాసమస్యల పరిష్కారం కే వలం ‘కాగితాల్లో’నే కనిపించేది. ఒకే సమస్యపై మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రజలు కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం లభించేది కాదు. దీంతో విసిగివే సారి చివరకు అధికారులకు చెప్పుకోవడమే మానేశారు. తాజాగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అధికారుల పనితీరులో మార్పు వచ్చింది. నిర్ధేశించిన గడువులోగా ప్రజల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించే దిశగా జిల్లా యంత్రాగం పనితీరులో వేగం పెరిగింది. ప్రజాసమస్యల పరిష్కారం లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సమస్యలపై వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిలిస్తున్నారు. అర్హమైన వాటిని మాస్టర్ రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. సమస్య పరిష్కార వివరం గురించి ప్రజలకు ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది. గతంలో కాగితాల్లోనే పరిష్కారం గత ప్రభుత్వ హయాంలో ప్రజాసమస్యలపై వచ్చిన అర్జీల పరిశీలన, పరిష్కారం క్షేత్రస్థాయిలో కాకుండా ‘కాగితాల్లో’ కనిపించేది. ఆ ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగానే అధికారులూ తప్పుడు నివేదికలు ఇచ్చేవారు. ఇప్పుడా తీరు పూర్తిగా మారింది. సమస్య పరిష్కారం విషయంలో కచ్చితమైన విధానం పాటిస్తున్నారు. అర్జీదారునికి రశీదు ఇస్తూ అందులో పరిష్కార గడువును నమోదు చేస్తున్నారు. ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి అక్కడిక్కడే చర్యలు తీసుకుంటున్నారు. మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకూ నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి పింఛన్లు, ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, రేషన్ కార్డులకు దరఖాస్తులు అధికారులకు అందుతున్నాయి. వీటిని పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులను గుర్తిస్తున్నారు. ఆర్థికపరమైన, ప్రభుత్వపరంగా రావాల్సినవి కావడంతో ప్రత్యేకంగా మాస్టర్ రిజిస్టర్‌ను ఏర్పాటు చేసి అందులో నమోదు చేస్తున్నారు. అర్జీదారులకు అదే విషయాన్ని తెలియజేస్తూ ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే చాలు పింఛన్లు, ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు, రేషన్ కార్డుల కోసం అర్హులైన ప్రజలు గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా పదేపదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు జరిగే ‘స్పందన’ కార్యక్రమంలో ఎక్కడైనా ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే చాలు. దరఖాస్తును అధికారులు పరిశీలిస్తారు. అనర్హమైన వాటిని తిరస్కరిస్తారు. అర్హత ఉన్న వాటిని మాస్టర్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. నిర్ధేశిత గడువులోగా సమస్య పరిష్కారం అవుతుందని వివరం తెలియజేస్తున్నారు. -
అవినీతిని సహించేది లేదు..!
సాక్షి, అనంతపురం అర్బన్: రెవెన్యూ సేవల్లో అవినీతికి తావిస్తే సహించేది లేదంటూ ఉద్యోగులను కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హెచ్చరించారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి భూ సేకరణ, ఇతర అంశాలపై అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు, సర్వేయర్లతో గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆయన సమీక్షించారు. నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలును సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఉన్నతాధికారులకు సమర్పించే నివేదికల్లో సమగ్ర సమాచారం ఉండలన్నారు. తప్పుడు నివేదిక సమర్పిస్తే ఏస్థాయి అధికారిపైన అయినా కఠిన చర్యలు తప్పవన్నారు. అవినీతిరహిత పాలన అందించే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు ఫిర్యాదులు అధికంగా పింఛన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డు మంజూరుతో పాటు ఆర్థికేతర సమస్యలు వస్తున్నాయి. ప్రతి నిరుపేదకూ ఇంటిని నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పౌర సేవల్లో అవినీతికి తావివ్వకూడదన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది ద్వారా అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపతే సంబంధిత తహసీల్దారుపై చర్యలు ఉంటాయన్నారు. భూ లభ్యతకు సంబంధించి 22–ఎ మేరకు వివరాల జాబితాను సక్రమంగా సిద్ధం చేసుకోవాలన్నారు. భూమి వివరాలను, స్పందన ఫిర్యాదులను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలన్నారు. భూ సమస్యలను సర్వేయర్లు, వీఆర్ఓలు సమన్వయ సహకారం అందించుకుంటూ పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం పలు మండలాల్లో ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వ భూములు గుర్తింపు గురించి సంబంధిత తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఆర్డీఓ ఆర్.కూర్మనాథ్, సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ మచ్ఛీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భూనిర్వాసితులకు వెంటనే న్యాయం చేయండి పెనుకొండ: భూనిర్వాసితులకు కియా కార్ల పరిశ్రమలో వెంటనే ఉద్యోగావకాశాలు కల్పించి తగిన న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లోని పిల్లలకు ఇంతవరకూ ఉద్యోగాలు ఇవ్వకపోవడం కేవలం స్కిల్ డెవలప్మెంట్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా కార్ల పరిశ్రమకు అవసరమైన ఆర్ఓబి (ఓవర్‌బ్రిడ్జి) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలన్నారు. నైపుణ్యమున్న వారిని కియాకు పంపితే వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఈ సందర్భంగా కలెక్టర్‌కు కియా లీగల్ హెడ్ జూడ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ గోపీకృష్ణ, అహుడా వీసీ మురళీకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా పెనుకొండ సమీపంలోని కియా కార్ల పరిశ్రమలో ఈనెల 31న కార్మాస్ ప్రొడెక్షన్ సెంటర్ ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు కియా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిసింది. రూ.1.10 కోట్లతో ఆర్థో ఓటీ అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రూ.1.10 కోట్లతో ఏర్పాటు చేసిన అధునాత ఆపరేషన్ థియేటర్లను కలెక్టర్ సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. ఆస్పత్రిలో అధునాతన పద్ధతుల్లో ఎముకల శస్త్రచికిత్స విభాగాలు(మాడ్యులర్,నాన్ మాడ్యులర్) ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కీళ్లు, మోకాళ్ల మార్పిడితో పాటు కుంటి కాళ్లను సరిచేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు నమ్మకం కల్గించేలా వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ డాక్టర్ బాబూలాల్, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ నవీన్‌కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ లలిత, ఏఓ డాక్టర్ శౌరి, ఆర్థో హెచ్ఓడీ డాక్టర్ ఆత్మారాం, మేనేజర్ శ్వేత ఉన్నారు. -
ఆందోళన అనవసరం..విత్తనాలు తెప్పిస్తాం
సాక్షి, అనంతపురం జిల్లా: రైతులందరికీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. విత్తన సంస్థలకు గత ప్రభుత్వం రూ. 150 కోట్ల బకాయిలు ఉన్నందునే అనంతపురం జిల్లాలో విత్తనాల సేకరణ ఆలస్యం అయిందన్నారు. మొత్తం మూడు లక్షల క్వింటాళ్ల కు గాను ఇప్పటిదాకా రెండు లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు పంపిణీ చేశామని వివరించారు. రైతుల డిమాండ్ మేరకు మరో నలభై వేల క్వింటాళ్ల విత్తనాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఎంత ధర అయినా చెల్లించి వేరుశనగ విత్తనాలు సేకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని.. పొరుగు రాష్ట్రాల నుంచి విత్తనాలు తెప్పిస్తున్నామని తెలిపారు. -
అర్హులందరికీ నవరత్నాలు
సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని, అర్హులందరికీ నవరత్నాలను అందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. శనివారం ఆయన జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాక్షి, అనంతపురం అర్బన్: ‘జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలి. సుపరిపాలన పాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయం. ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహిత సంక్షేమ పాలన అందించే దిశగా ముందుకెళుతోంది. ‘నవరత్నాల’ ఫలాలు అర్హులైన ప్రతి పేదవానికి అందాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేసి ప్రజా ప్రభుత్వ లక్ష్యాన్ని సాధిద్దాం’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధ్యక్షతన తొలిసారిగా జిల్లా అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, కరువుతో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ఈ నేపథ్యంలో పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. జిల్లా రైతులకు రూ.1,007 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఈ క్రమంలోనే రైతులను ఆదుకునేందుకు 2014 నుంచి వారికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.2,000 కోట్లు ఇచ్చేందుకు తొలి కేబినెట్లోనే ఆమోదం తెలిపారన్నారు. ఇందులో జిల్లా రైతులకు రూ.1,007 కోట్లు అందనుందని తెలిపారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మఒడి ద్వారా రూ.15 వేలు, రైతు భరోసా ద్వారా పేద రైతులకు పెట్టుబడికి ఏటా రూ.12,500 ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పకృతి వైపరిత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో పకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. ప్రతి పేదవానికి ఇల్లు, వృద్ధులకు దశలవారీగా పింఛన్ రూ.3 వేలకు పెంపు, పింఛన్ అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు, నిత్యావసరాలను ఇంటికే చేర్చడం, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి), సీపీఎస్ రద్దు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు వేతనం, రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లాంటి కీలకమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్నారని గుర్తు చేశారు. తాగునీరు, వ్యవసాయం, విత్తన పంపిణీ, ఉద్యన పంటలు, తదితర అంశాలపై సమీక్షించారు.సమావేశంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్, ఎమ్మెలేలు వై.వెంకటరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, జేసీ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉరవకొండలో నీటి ఎద్దడి ఉరవకొండ పట్టణంలో తొమ్మిది రోజులుగా నీటి సరఫరా లేదు. నిర్వహణ లోపం కారణంగా ఈ సమస్య వచ్చింది. వారంలోగా సమస్య పరిష్కరించాలి. పంటల బీమాలో మార్పు తేవాలి. వాతావరణ బీమా వల్ల రైతుకు ప్రయోజనం కలగడం లేదు. గ్రామం యూనిట్‌గా బీమా వర్తించేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలి. – పయ్యావుల కేశవ్, ఉరవకొండ ఎమ్మెల్యే ఎస్కేయూలో నీటి ఎద్దడి పరిష్కరించాలి శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలి. నగర పాలక సంస్థలో ఉపాధ్యాయులకు సంబంధించి రూ.36 లక్షలు దుర్వినియోగమయ్యాయి. విచారణ చేసి వారి ఖాతాల్లో జమ చేయాలి. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు కొన్ని పాఠశాల్లో నీటి సమస్య ఉంది. అలాంటి చోట ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి. – కత్తినరసింహారెడ్డి, ఎమ్మెల్సీ రిజర్వాయర్‌తో శాశ్వత పరిష్కారం నియోజకవర్గానికి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు వెచ్చించి జీడిపల్లి, పీఏబీఆర్ నుంచి పైప్‌లైన్ ద్వారా ఆత్మకూరు మండల కేంద్రానికి నీటిని ఇవ్వవచ్చు. పీఏబీఆర్ పైన్లైన్ ద్వారా కక్కలపల్లి, నారాయణపురం, రాజీవ్‌కాలనీ, ఇలా మరికొన్ని పంచాయతీలకు నీటిని ఇవ్వడం ద్వారా ఎద్దడి నివారించవచ్చు. – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు జరగాలి. ప్రత్యేకంగా బెంగుళూరు, తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలను ఒక చోటకు చేర్చి సదస్సు నిర్వహించాలి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఆ దిశగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలి. బుక్కపట్నం, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజ్ ఉండేలా చూడాలి. ఇందుకు స్లూయిజ్ గేట్లు ఏర్పాటు చేయాలి. – దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే జేసీ నాగిరెడ్డి పథకం పూర్తి చేయాలి తాడిపత్రిలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. పెన్నా, చిత్రావతిలో ఇసుక తోడేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. ఇసుకు అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా జేసీ నాగిరెడ్డి పథకాన్ని యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి. – కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే తాగునీటి ఎద్దడి అధికం మా నియోజకర్గలోని 120 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు నీరు ఇవ్వకుండా తుమ్మలూరుకు తీసుకెళ్లడం ఏమిటి. శ్రీరామిరెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలి. రోడ్డు విస్తరణలో భాగంగా బాలికల పాఠశాల కూల్చేశారు. – డాక్టర్ తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే నీటి సమస్య తీవ్రంగా ఉంది మా నియోజకవర్గం పరిధిలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. సత్యసాయి పైప్‌లైన్–2 ద్వారా నీటిని అందించాలి. సీపీడబ్లూ స్కీమ్ ద్వారా ట్యాంక్‌లు నింపాలి. నీటి ఎద్దడి అధికంగా ఉన్న గ్రామాల్లో తక్షణం నీరు సరఫరా చేయాలి. తీవ్ర వర్షాభావంతో మామిడి చెట్లు ఎండిపోతున్నాయి. – డాక్టర్ సిద్ధారెడ్డి, కదిరి ఎమ్మెల్యే శాశ్వత చర్యలు చేపట్టాలి జిల్లావ్యాప్తంగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలి. శింగనమల చెరువు చాలా పెద్దది. పైనున్న వారు నీటిని తమ ప్రాంతాలకు మళ్లిస్తుండడంతో ఈ చెరువుకు నీరు రావడం లేదు. ఈసారి తప్పకుండా చెరువు నింపాలి. బీసీ హాస్టల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. – శమంతకమణి, ఎమ్మెల్సీ -
‘అమ్మఒడి’తో ప్రతితల్లికీ రూ.15 వేల ఆర్థిక సాయం
సాక్షి, అనంతపురం అర్బన్: ‘‘విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ‘అమ్మఒడి’ పథకం ద్వారా రూ.15 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో రూపురేఖలు మారనున్నాయి. ఉపాధ్యాయులు కూడా తగు చర్యలు తీసుకుని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి ’’ అని కలెక్టర్ సత్యనారాయణ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో విద్యావ్యవస్థపై ఎంఈఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తక్కువగా ఉందంటూ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీల నుంచి మొదటి తరగతిలో కేవలం 18,781 మంది పిల్లలనే చేర్పించడం ఏమిటని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటే ఇంత తక్కువ మంది చేరినట్లు నివేదికలే చెబుతున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులంటే తనకు గౌరవమని, దానిని నిలుపుకోవాలన్నారు. 80 శాతం కంటే లక్ష్యం తక్కువ చేసిన వారికి మెమోలు జారీ చేయాని డీఈఓ దేవరాజ్‌ను ఆదేశించారు. బడిబయటి పిల్లలను చేర్పించడంలోనూ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. అమ్మ ఒడితో పాటు ఇతర కార్యక్రమాలను విస్తృతంగా గ్రామాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 2.69 లక్షల మంది విద్యార్థులకు యూనిఫారం త్వరిగతిన అందజేయాలన్నారు. సమావేశానికి హాజరైన ఎంఈఓలు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి పాఠశాలల్లో టాయ్లెట్లు నిర్మిస్తే... వాటిని ఎందుకు వినియోగించడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. రొద్దం మండలం పెద్ద మణుతూరు పాఠశాలను తాను సందర్శించిన సమయంలో టాయ్‌లెట్‌కు తాళం వేసి ఉందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలతో కలిసి సహఫంక్తి భోజనం చేయాలని చెప్పారు. ఉపాధ్యాయులు గైర్హాజరైతే చర్యలు ఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాలలకు హాజరుకావాలన్నారు. కొందరు టీచర్లు స్కూల్ సమయం కంటే ముందే ఇళ్లకు వెళుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఉపాధ్యాయుల హాజరును ఎంఈఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. పాఠశాలలకు తాను అకస్మిక తనిఖీకి వస్తానని... ఎక్కడైనా ఉపాధ్యాయులు గైర్హాజరైనట్లు తన దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారులు (వార్డెన్లు), మోడల్ స్కూళ్లు, కేజీబీవీల ప్రిన్సిపాళ్లందరూ స్థానికంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజనం అమలు, పాఠశాలల్లో పరిశుభ్రత, తదితర అంశాలపై మండలాల వారీగా కలెక్టర్, జేసీ–2 సమీక్షించారు. సమావేశంలో జేసీ–2 హెచ్.సుబ్బరాజు, ఎస్ఎస్ఏ పీఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, ఎస్టీ సంక్షేమ శాఖాధికారి కొండలరావు, బీసీ సంక్షేమ శాఖ అధకారి రబ్బానిబాషా ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కాకమ్మ కథలు చెప్పకండి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తీరు మారకపోతే చర్యలు తప్పవని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శిశు మరణాలు పెరిగిన నేపథ్యంలో మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో కలిసి తనిఖీ నిర్వహించారు. సాక్షి, అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపడాలని, కొందరు వైద్యుల వల్లే సమస్యలొస్తున్నాయని, వారు పనితీరుమార్చుకోకపోతే చర్యలు తప్పవని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. సమన్వయలోపంతో ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదన్నారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జేసీ–2 సుబ్బరాజుతో కలసి ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూను తనిఖీ చేశారు. యూనిట్లో ఉన్న సదుపాయాలు...అందుతున్న సేవలపై వారు ఆరా తీశారు. చిన్న సమస్యలు పరిష్కరించుకోరా? ఎస్‌ఎన్‌సీయూతో పాటు చాలా వార్డుల్లో ఏసీలు, ఫ్యాన్లు ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నించగా..సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ అన్నీ పనిచేస్తున్నాయని చెప్పగా..ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యంగా సమాధానమెందుకిస్తారన్నారు. చిన్న సమస్యలను పరిష్కరించుకోకపోతే ఎలాగన్నారు. వార్డులవారీగా సమీక్షలు నిర్వహించి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాలను ప్రస్తావిస్తామన్నారు. తీరు మారకపోతే చర్యలు అనంతరం వివిధ విభాగాల అధిపతులతో కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో గత ఐదు నెలల్లో 168 మరణాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై ప్రశ్నిస్తే వైద్యులు కాకమ్మ కథలు చెబుతున్నారని ఎమ్మెల్యే ‘అనంత’ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, చిన్న పిల్లల విభాగాధిపతి మల్లీశ్వరి కల్పించుకుంటూ ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి చివరి క్షణంలో కేసులు వస్తున్నాయని చెప్పగా.. చివరి క్షణంలో కేసులు వస్తే రెఫర్ చేసిన ఆస్పత్రి వివరాలను కేస్ షీటులో ఎందుకు నమోదు చేయలేని ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతి రెఫరల్ కేసు వివరాలను నమోదు చేయాల్సిందేనన్నారు. ప్రైవేట్ నర్సింగ్‌హోంలపై నిఘా పెంచేలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అక్కడ పనిచేస్తున్న వైద్యులే చివరి క్షణంలో కేసులను సర్వజనాస్పత్రికి రెఫర్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కలెక్టర్ సత్యనారాయణ సైతం వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో మరణాలు ఏవిధంగా చోటు చేసుకుంటాయని ప్రశ్నించారు. గర్భిణులకు అందుతున్న సేవలను పరిశీలన చేయాలని ఐసీడీఎస్ పీడీ చిన్మయాదేవికి సూచించారు. శిశుమరణాలపై నివేదిక ఇవ్వండి ఆస్పత్రిలోని విభాగాల అధిపతులంతా బాధ్యతగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. వైద్యుల మధ్య సమన్వయలోపం ఎందుకు వస్తోందని సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశు మరణాలపై విచారణ చేసి త్వరగా పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని సూపరింటెండెంట్‌కు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్‌ను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, జిల్లా అంధత్వ నివారణధికారి డాక్టర్ కన్నేగంటి భాస్కర్, హెచ్ఓడీలు డాక్టర్ రామస్వామినాయక్, డాక్టర్ నవీన్, డాక్టర్ నవీద్ అహ్మద్, డాక్టర్ ఆత్మారాం పాల్గొన్నారు. -
బాధ్యతగా పనిచేద్దాం.. జవాబుదారీగా ఉందాం
సాక్షి, అనంతపురం అర్బన్: ‘ప్రజాధనంతో వేతనం పొందుతున్నాం... బాధ్యతగా పనిచేసి ప్రజలకు జవాబుదారీగా ఉందాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మెరుగైన సేవలు అందించాలి. వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. నవరత్నాలు అమలు ద్వారా ప్రజాసంక్షేమానికి కృషి చేయాలి’ అని కలెక్టర్ ఎస్. సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జాయింట్ కలెక్టర్ డిల్లీరావుతో కలిసి జిల్లా అధికారులతో నేరుగా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి అధికారులు పనిచేయాలన్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ పూర్తయిన తరువాత మండల స్థాయి అధికారులు డ్వామా, డీఆర్డీఏ అధికా రులు, వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం, ఆశా, ఉపాధ్యాయులు కీలకమన్నారు. సమన్వయంతో విధులు నిర్వర్తిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉండదన్నారు. పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహిస్తామని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ సమయాన్ని వృథా చేయకుండా పనిచేయాలని సూచించారు. చిన్నారుల మరణాలు పునరావృతం కానీయొద్దు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరుగురు చిన్నపిల్లలు చనిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సబ్‌సెంటర్ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం, ఆశా వర్కర్ సమన్వయంతో పనిచేసి శిశుమరణాలను నియంత్రించాలన్నారు. వర్షాలు ఇప్పుడిప్పుడే కురుస్తున్నాయని, పూర్తిగా పడేంత వరకు భూగర్భ జల మట్టం పెరగదన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి నివారణ కోసమే ఖర్చు చేయాలన్నారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించండి ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు విరివిగా పనులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి కుంటలు, కందకాల నిర్మాణ పనులు కల్పించాలని ఆదేశిం చారు. సంక్షేమ శాఖలకు సంబంధించి రుణాల మంజూరులో ఎల్డీఎం కీలక పాత్ర పోషించాలన్నారు. మండల స్థాయిలో జేఎంఎల్టీసీ సమావేశాలను ఏర్పాటు చేసి రుణాల మంజూరు త్వరితగతిన అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తన వేరుశనగ పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జేడీఏ హబీబ్‌బాషాను ఆదేశించారు. అధికారులకు మెమోలు ఇవ్వండి ‘మీ కోసం’ కార్యక్రమానికి హాజరు కాని అధికారులకు మెమోలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గుడిబండ, వజ్రకరూరు, తనకల్లు, ఆమడగూరు, అమరాపురం, డి.హీరేహాళ్ ఎంపీడీఓలు, తహసీల్దార్లు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌కు వస్తుంటే, అధికారులు సమయానికి హాజరుకాకపోతే ఎలాగని ఆగ్రహించారు. గ్రీవెన్స్‌కు హాజరుకాని ఎంపీడీఓలు, తహసీల్దార్లకు మెమోలు జారీ చేయాలని జెడ్పీ సీఈఓ, డీఆర్‌ఓని ఆదేశించారు. -
ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ ఆదేశాలు
సాక్షి, అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నిర్వహించే కేంద్రాల వద్ద రిటర్నింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.వీరపాండియన్ ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియపై సిబ్బందికి తొలి విడత రాండమైజేషన్ కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన హ్యాండ్ బుక్‌ను క్షుణ్ణంగా చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. అధికారులు వారికి అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించడంలో భాగంగా చెక్‌లిస్ట్ ప్రకారం ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏ సామగ్రి అందుబాటులో ఉండాలని అనేది ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని 22వ తేదీ సాయంత్రానికి సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఈడీటీలు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విధులు ఎలా నిర్వహించాలి? అనే అంశంపై కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి ఈనెల 18న జేఎన్టీయూ ఆడిటోరియంలో శిక్షణ ఉంటుందన్నారు. ఉదయం కౌంటింగ్ సూపర్వైజర్లకు, మధ్యాహ్నం కౌంటింగ్ సహాయకులకు శిక్షణ ఇస్తారన్నారు. 19వ తేదీ ఉదయం సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఎలా నిర్వహించాలనే అనేదానిపై అదే రోజు మధ్యహ్నం అనంతపురం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల అధికారులకు లైవ్ డెమో నిర్వహించాలని ఆర్ఓ కూర్మనాథ్‌ను ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బంది అందరూ హాజయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెమోలో అసలైన సామగ్రిని వినియోగించాలని, అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఈడీటీలు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. 20వ తేదీన రిటర్నింగ్ అధికారులందరూ తమ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి డెమో నిర్వహించాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిశీలకులు వస్తారు నియోజకవర్గాల పరిశీలకులు ఈనెల 19, 20 తేదీల్లో వచ్చే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ, విధివిధానాలపై 21వ తేదీన ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరిస్తారన్నారు. కౌంటింగ్ సమయంలో చిన్న పొరపాటూ దొర్లకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. -
‘పోస్టల్ మాయాజాలం’ పై కొరడా