మాట్లాడుతున్న కలెక్టర్ వీరపాండియన్, చిత్రంలో జేసీ హాజరైన ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, డిటీలు
సాక్షి, అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నిర్వహించే కేంద్రాల వద్ద రిటర్నింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.వీరపాండియన్ ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియపై సిబ్బందికి తొలి విడత రాండమైజేషన్ కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు.
ఓట్ల లెక్కింపునకు సంబంధించిన హ్యాండ్ బుక్‌ను క్షుణ్ణంగా చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. అధికారులు వారికి అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించడంలో భాగంగా చెక్‌లిస్ట్ ప్రకారం ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏ సామగ్రి అందుబాటులో ఉండాలని అనేది ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని 22వ తేదీ సాయంత్రానికి సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, ఈడీటీలు పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపుపై శిక్షణ
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విధులు ఎలా నిర్వహించాలి? అనే అంశంపై కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి ఈనెల 18న జేఎన్‌టీయూ ఆడిటోరియంలో శిక్షణ ఉంటుందన్నారు. ఉదయం కౌంటింగ్ సూపర్‌వైజర్లకు, మధ్యాహ్నం కౌంటింగ్ సహాయకులకు శిక్షణ ఇస్తారన్నారు. 19వ తేదీ ఉదయం సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఎలా నిర్వహించాలనే అనేదానిపై అదే రోజు మధ్యహ్నం అనంతపురం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల అధికారులకు లైవ్ డెమో నిర్వహించాలని ఆర్‌ఓ కూర్మనాథ్‌ను ఆదేశించారు.
కౌంటింగ్ సిబ్బంది అందరూ హాజయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెమోలో అసలైన సామగ్రిని వినియోగించాలని, అన్ని నియోజకవర్గాల ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, ఈడీటీలు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. 20వ తేదీన రిటర్నింగ్ అధికారులందరూ తమ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి డెమో నిర్వహించాలని ఆదేశించారు.
నియోజకవర్గ పరిశీలకులు వస్తారు
నియోజకవర్గాల పరిశీలకులు ఈనెల 19, 20 తేదీల్లో వచ్చే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ, విధివిధానాలపై 21వ తేదీన ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరిస్తారన్నారు. కౌంటింగ్ సమయంలో చిన్న పొరపాటూ దొర్లకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment