
సాక్షి, అనంతపురం: కరువు జిల్లా ‘అనంత’లో వైఎస్సార్ రైతు భరోసా పథకం పకడ్బందీగా అమలు చేసి ఎందరో రైతులకు సాయం దక్కేలా చూసిన కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అందరూ ఇలా కృషి చేయాలని ప్రశంసించారు. మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర శాఖాధిపతులతో రాజధాని నుంచి కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రైతు భరోసా, ఆటోడ్రైవర్లకు నగదు సహాయ పథకం, వైఎస్సార్ కంటి వెలుగు రెండో విడత, ఇళ్ల స్థలాల పంపిణీ, గ్రామ సచివాలయాల్లో మౌలిక వసతుల కల్పన, ఇసుక కొరత లేకుండా చర్యలు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తదితర పథకాల అమలు, పురోగతిపై సీఎం ఆరాతీశారు.
ఈ క్రమంలో రైతు భరోసాపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 4,81,498 రైతు కుటుంబాలకు భరోసా కింద రూ.390 కోట్లు జమ చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ, బ్యాంకర్ల సహకారంతో భరోసా సమర్థవంతంగా అమలు చేశామన్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. వీడియా కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జేసీ ఎస్.ఢిల్లీరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డీఆర్‌ఓ వెంకటసుబ్బారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభా స్వరూపారాణి, డీపీఓ రామనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment