‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవినీతి ఏ స్థాయిలో జరిగినా సహించేది లేదని తేల్చిచెప్పారు. జిల్లాలో ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదు. ఎంతటివారైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు సేవకులుగా వారికి సేవ చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉంది. నాకు జిల్లా ఉద్యోగులపై నమ్మకం ఉంది. అయితే, ఎవరైనా అవినీతికి పాల్పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఉక్కుపాదంతో అణచివేస్తాం.’’ అని కలెక్టర్ గంధం చంద్రుడు తేల్చిచెప్పారు. సామాజిక అభివృద్ధి విజన్ ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తానని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. – సాక్షి ప్రతినిధి, అనంతపురం
సాక్షి, అనంతపురం: నేనూ రాయలసీమ బిడ్డనే. రాయలసీమను రతనాల సీమగా పిలిచేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మళ్లీ పూర్వవైభవం కోసం ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, మీడియా, ప్రజా సంఘాల సహకారంతో ముందుకు వెళతాను. జిల్లాకు 100వ కలెక్టరుగా రావడం...అది నాకు కలెక్టరుగా మొదటి పోస్టింగు కావడం గర్వంగా ఉంది. జిల్లా అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అందరి సహకారంతో ముందుకు సాగుతాను. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో సామాజిక– ఆర్థిక అభివృద్ధి అనే కోణం ఉంది. తప్పకుండా అది నేరవేర్చేందుకు కృషి చేస్తాను. ‘వైఎస్సార్ నవశకం’ కార్యక్రమం ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువచేస్తాం. జిల్లాలో ఉన్న అపార అవకాశాలను ఉపయోగించి అగ్రభాగాన నిలబెట్టేందుకు అహర్నిశలు కృషిచేస్తాను.
నాలుగు అంశాలతో ముందుకు...!
పాలనలో నాలుగు అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తాను. మొదటగా నేరుగా ప్రజల అవసరాలు ఏమిటి? వారి సమస్యలు ఏమిటి? పరిష్కారం ఎలా అన్న అంశాలపై దృష్టిసారిస్తాను. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు... వారి ద్వారా వచ్చే ప్రజాసమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెడతాను. ఆ తర్వాత ఉద్యోగులు... పాలనకు వీరి సహకారం ఎంతో అవసరం. అందువల్ల ప్రజాసమస్యల పరిష్కారంలో వారి సలహాలతో పరిష్కారంపై దృష్టి సారిస్తాను. ఆ తర్వాత మీడియా, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు... వీరి ద్వారా నా దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ఇలా సమన్వయం చేసుకుంటూ అందరినీ ఒక మార్గంలోకి తీసుకు వచ్చి పని చేసే బాధ్యత టీం లీడర్‌గా జిల్లా కలెక్టర్ పైన ఉంటుంది. ప్రజల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే అంశాలపై యంత్రాంగం వెంటనే స్పందించేలా చూస్తా.
సామాజిక–ఆర్థిక అభివృద్ధి దిశగా...!
సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సామాజిక–ఆర్థిక అభివృద్ధి కోణంలో పాలన సాగిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం ఆర్థికాభివృద్ధి కోణంలో కాకుండా సామాజిక అభివృద్ధి కోణంలో కూడా ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం వాటా ఇవ్వడం ఇలా సామాజిక అభివృద్ధి కోణం ఉంది. పరిశ్రమలల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడి ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. అదే విధంగా ‘మనబడి–నాడు నేడు’ అద్భుతమైన కార్యక్రమం. ప్రజలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమైనది విద్య. విద్య మీద దృష్టి సారిస్తే అన్ని విషయాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. పాఠశాలల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు...మరుగుదొడ్లు, విద్యుత్, నీటి సౌకర్యంతో పాటు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడటం అన్నీ ప్రభుత్వం చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సామాజిక విజన్‌ను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాడానికి నా శక్తిమేరకు కృషి చేస్తాను. ఇంకా ఇక్కడ మూఢనమ్మకాల నిర్మూలనతో పాటు, కులాల దొంతరలను తొలగించేందుకు కృషి చేస్తాను.
అనంత..అవకాశాల గని!
అనంతపురం జిల్లాలో అపార అవకాశాలున్నాయి. ఒకవైపు సుదీర్ఘ రహదారులు, దగ్గరలోనే విమానాశ్రయం, అపారమైన మానవ వనరులు, విశాలమైన భూములతో పాటు అనేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో జిల్లా అంతర్భాగంగా ఉంది. తద్వారా పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక లైమ్‌స్టోన్, బ్లాక్ స్టోన్ వంటి ముడిసరుకు ఉంది. ఇది పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ఉపయోగం. వీటీని ఉపయోగించుకుంటూ ప్రణాళిక ప్రకారం అందరిని సమన్వయం చేసుకుంటూ వెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఒక్కప్పుడు రాయలసీమ రత్నాల సీమ. ఇప్పటి కూడా ఆ విధంగా చేయవచ్చు. నేను రాయలసీమ బిడ్డనే. రాయలసీమలోనే పుట్టి పెరిగినవాడినే. ఇక్కడి వాతావరణం తెలుసు. ఇక్కడ భూమి, గాలి, నీరు అన్ని తెలుసు. రాయలసీమ బిడ్డగా జిల్లాను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment