Jio Phone Next to be Manufactured in Tirupati - Sakshi

తిరుపతి కేంద్రంగా ‘జియో నెక్ట్స్‌’.. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ..

Oct 28 2021 10:50 AM | Updated on Oct 28 2021 12:49 PM

Jio Phone Next to be Manufactured in Tirupati - Sakshi

‘సమర్థవంతమైన నాయకత్వం, నూతన పారిశ్రామిక విధానం, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రపంచస్థాయి మౌలిక వసతులు.. రాకపోకలకు, ఎగుమతులకు అనుకూలత, మదుపరులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానంతో తిరుపతి నగరం వ్యాపారాభివృద్ధికి దేశంలోనే అత్యంత అనుకూలమైన ప్రాంతాల జాబితాలో నిలిచింది. 

►ప్రముఖ పారిశ్రామిక నగరంగా ఎదుగుతోంది.. 
►ఇందుకు ఉదాహరణే ఇప్పుడు జియో ఫోన్‌ నెక్ట్స్‌ స్మార్ట్‌ ఫోన్ల తయారీకి జియో సంస్థ తిరుపతి కేంద్రంగా శ్రీకారం చుట్టింది. 
►రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఎల్రక్టానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌–2లోని నియోలింక్స్‌ ప్లాంట్‌లో ఇప్పటికే ఫోన్ల తయారీ చేపట్టింది. 
►రానున్న దీపావళికి, లేదా నవంబర్‌ నెలాఖరులోగా లాంఛనంగా ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. 

సాక్షి, తిరుపతి: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌(ఎల్రక్టానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌–2)లో ఉన్న యునైటెడ్‌ టెలీలింక్స్‌ నియోలింక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి జియో నెక్ట్స్‌ ఫోన్ల తయారీకి శ్రీకారం చుట్టింది. ప్రాథమికంగా రూ.20కోట్ల పెట్టుబడి పెట్టిన రిలయన్స్‌ సంస్థ త్వరలోనే భారీ పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించింది. మొబైల్‌ ఫోన్లు, టెలికాం, కంప్యూటర్‌ పరికరాలు, ఎల్రక్టానిక్‌ ఉత్పత్తుల తయారీని చేపట్టనున్నట్టు సంస్థ పేర్కొంది. 2023 మార్చి నాటికి భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం.


 
ఫోన్‌ మొత్తం తయారీ ఇక్కడే.. 
జియో ఫోన్‌ నెక్ట్స్‌ కోసం ఆండ్రాయిడ్‌ ఆధారిత అత్యాధునిక ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను గూగుల్‌తో కలిసి జియో ప్లాట్‌ఫామ్స్‌ అభివృద్ధి చేసింది. క్వాల్‌కామ్‌ ప్రాసెసర్‌ను ఈ స్మార్ట్‌ ఫోన్‌లో పొందుపరిచారు. 10 భాషలను అనువదించే ఫీచర్‌ ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులోని రీడ్‌ అలౌడ్‌ ఫంక్షన్‌ స్క్రీన్‌పై తెరచిన యాప్‌లో ఉన్న కంటెంట్‌ను బిగ్గరగా చదువుతుంది. వాయిస్‌ అసిస్టెంట్‌తో ఫోన్‌ను ఆపరేట్‌ చేయవచ్చు. ఇంటర్నెట్‌ నుంచి కావాల్సిన సమాచారం పొందవచ్చు. సాఫ్ట్‌వేర్‌ దానంతట అదే అప్‌డేట్‌ అవుతుందని సంస్థ వెల్లడించింది. తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌ వద్ద ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూపునకు చెందిన నియో లింక్స్‌ ప్లాంట్‌లో మదర్‌బోర్డ్‌ ఒక్కటే తయారవుతుండగా, రేణిగుంటలోని ప్లాంట్‌లో మదర్‌బోర్డ్‌ సహా ఫోన్‌ మొత్తం తయారవుతుండడం విశేషం. 

నెలకు ఐదు లక్షల ఫోన్ల తయారీ 
జియో ఫోన్‌ నెక్ట్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ దీపావళి నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. తిరుపతిలోని ప్లాంట్‌లో నెలకు సగటున ఐదులక్షల ఫోన్లను తయారు చేస్తున్నామని నియోలింక్స్‌ ప్లాంట్‌ జనరల్‌ మేనేజర్‌ సాయి సుబ్రమణ్యం తెలిపారు.  ఫోన్ల తయారీలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న ట్లు వెల్లడించారు.

ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ..
తిరుపతి సమీపంలోని రేణిగుంట, ఏర్పేడుల్లో ఎల్రక్టానిక్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన రిలయన్స్‌ను భూసేకరణ వివాదంతో గత టీడీపీ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. 2018లో భూసేకరణ సందర్భంగా జరిగిన అవకతవకలు, అక్రమాల కారణంగా ఇక్కడ రిలయన్స్‌ పెట్టుబడులు పెట్టేందుకు ఒకింత జాప్యం చేసింది. కానీ టీడీపీ వర్గాలు, పచ్చమూకలు ఆ నెపాన్ని 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మోపాలని చూశాయి. వైఎస్సార్‌సీపీ సర్కారు రాకతోనే ఆ సంస్థ వెనక్కి మళ్లిందని ఇష్టానుసారం విషం చిమ్మాయి. ఇప్పుడు ఆ భూసేకరణ వ్యవహారాన్ని కాస్త పక్కనపెడితే.. టీడీపీ విషప్రచారం మాత్రం వందశాతం ఒట్టిదేనని నిర్ధారణైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ ప్రతిష్టాత్మక జియో ఫోన్‌ నెక్ట్స్‌ తయారీకి తిరుపతినే ఎంచుకుని అన్ని దుష్ప్రచారాలను పటాపంచలు చేసింది  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement