AP: టాప్‌‘ ప్లేస్‌’!.. మూడేళ్లలో రెట్టింపు.. | Job placements doubled from Last Three Years in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: టాప్‌‘ ప్లేస్‌’!.. మూడేళ్లలో రెట్టింపు..

Published Mon, Jun 6 2022 3:47 AM | Last Updated on Mon, Jun 6 2022 3:54 PM

Job placements doubled from Last Three Years in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘మన విద్యార్థులు అత్యుత్తమ నైపుణ్యాలతో ప్రపంచ పౌరులుగా ఎదగాలి. అత్యున్నత స్థాయి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి..’’ ఇదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష! ఆ సంకల్పం ఇపుడు సాకారమవుతోంది. గత మూడేళ్లలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు సంబంధించి మన రాష్ట్ర విద్యార్థుల ప్లేస్‌మెంట్లు రెట్టింపు కావడం ఇందుకు నిదర్శనం.

మూడేళ్ల క్రితం రాష్ట్రంలో ప్లేస్‌మెంట్ల సంఖ్య ఏటా 37 వేలు మాత్రమే కాగా ప్రస్తుతం అది 69 వేలకు చేరుకుంది. రానున్న ఒకటి రెండేళ్లలో ఈ సంఖ్య లక్ష దాటుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, కార్యక్రమాల వల్లే ఇది సాకారమైందని స్పష్టం చేస్తున్నారు.

అధికారంలోకి రాగానే కార్యాచరణ
సీఎం జగన్‌ తాను కాంక్షించిన లక్ష్యాల సాధన కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టి పాఠశాలల నుంచి ఉన్నత స్థాయి వరకు కీలక సంస్కరణలు, కార్యక్రమాలను చేపట్టారు. విద్యార్ధులు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలకు తగ్గ నైపుణ్యాలతో  కాలేజీల నుంచి బయటకు వచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయడంతో పాటు  నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను నెలకొల్పుతున్నారు. 

1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్‌ శిక్షణ
రాష్ట్ర విద్యార్ధులకు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ తదితర సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేలా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్‌ అప్‌ స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా 1.62 లక్షల మందికి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనాలసిస్, నెట్‌ వర్కింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ తదితరాలపై సర్టిఫికేషన్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందచేశారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రూ.37 కోట్ల వరకు వెచ్చించింది.

అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్ధులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, పైథాన్, క్లౌడ్, డేటా అనలటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌ డేటా, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్, క్యాడ్, ఐఓటీ అంశాల్లో రూ.కోట్ల విలువైన శిక్షణ అందేలా చర్యలు తీసుకున్నారు. ఇవే కాకుండా నాస్కామ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ ద్వారా లక్ష మందికి మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్‌ విభాగాల్లో వర్చువల్‌ శిక్షణ ఇప్పించారు.

నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో ‘ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ప్రెస్‌’ సంస్థ 50 వేల మందికి శిక్షణ ఇస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్‌వీస్, హీరోహోండా, మారుతీ సుజికి లాంటి కంపెనీల్లో  ఫుల్‌స్టేక్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, బీఎఫ్‌ఎస్‌ఐ అనలిస్ట్‌ తదితర అంశాలలో ఈ శిక్షణ ఇచ్చారు.

ఇంటర్న్‌షిప్, క్షేత్ర స్థాయి శిక్షణ
 డిగ్రీ చదివి కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు వెంటనే ఉద్యోగావకాశాలను అందుకునేలా పూర్తిస్థాయి సామర్థ్యాలు, నైపుణ్యాలు సంతరించుకునేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వివిధ ప్రణాళికలను అమల్లోకి తెచ్చింది. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సులతో పాటు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేశారు.

మూడేళ్ల డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పదినెలలు ఇంటర్న్‌షిప్‌ చేసేలా కోర్సులను రూపొందించారు. పూర్తిస్థాయి నైపుణ్యాలు సాధించేలా క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నారు. ఫలితంగా ఏటా  శిక్షణార్ధుల సంఖ్య పెరుగుతుండగా ఉద్యోగావకాశాలు కూడా అదే స్థాయిలో మెరుగుపడుతున్నాయి. 

 పరిశ్రమలతో కాలేజీల అనుసంధానం
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం కాలేజీల స్థాయిలోనే ప్రభుత్వం ఇంటర్న్‌షిప్‌కు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసింది. కాలేజీలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య కేంద్రాలు సహా 27,119 సంస్థలతో అనుసంధానించారు.

ఆయా సంస్థలతో సమన్వయం కోసం కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో వర్సిటీల ఉపకులపతులు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులను సభ్యులుగా నియమించారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్‌ అధ్యక్షతన అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేశారు. 

విదేశాల్లోనూ..
ఆధునిక సాంకేతిక అంశాల్లో రానున్న కాలంలో 1.1 బిలియన్‌ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేస్తోంది. ‘ప్రీ–మాస్టర్‌ ఇండియా’ పేరుతో జర్మనీ ప్రారంభించిన కార్యక్రమం ద్వారా మన విద్యార్థులు ఆ దేశంలో అవకాశాలను దక్కించుకునేలా చర్యలు చేపట్టారు.

రాష్ట్ర విద్యార్థులు బీటెక్‌ పూర్తి చేశాక జర్మనీలో మాస్టర్‌ డిగ్రీని అభ్యసించడంతోపాటు నేరుగా అక్కడి కంపెనీల్లో ఉద్యోగాల్లో కొలువుదీరుతున్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఐబీఎం, విప్రో, అలక్రిటీ, ఏడీపీ, పర్పుల్‌ టాక్, సెలెక్ట్, నూక్కాడ్, సినాప్సిస్, థాట్‌వరŠుక్స, అనలాడ్‌ డివైజెస్‌ తదితర సంస్థలు రాష్ట్ర విద్యార్ధులకు పెద్ద ఎత్తున ప్లేస్‌మెంట్లు కల్పిస్తున్నాయి.

లక్ష ప్లేస్‌మెంట్లు లక్ష్యం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం మేరకు రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువు ముగించుకుని బయటకు వచ్చేనాటికి సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలను చేపట్టాం. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. మన విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా రాణించి అవకాశాలను అందిపుచ్చుకొనేలా ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలు చేస్తోంది.

ఇందులో భాగంగానే వివిధ పరిశ్రమలతో కాలేజీలను అనుసంధానించి శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. రానున్న కాలంలో ప్లేస్‌మెంట్ల సంఖ్య ఏటా లక్షకు చేరువ కావాలన్నది లక్ష్యం.
– ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 

కరోనాలోనూ పెరిగిన ప్లేస్‌మెంట్స్‌
రాష్ట్రంలో 2018–2019లో 2.5 లక్షల మంది వివిధ స్థాయిల్లో చదువు పూర్తి చేసుకుని బయటకు రాగా నాడు 37 వేల ప్లేస్‌మెంట్లు మాత్రమే ఉన్నాయి. ఇక 2019–20లో 3.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య ముగించుకొని బయటకు రాగా ప్లేస్‌మెంట్లు 51 వేలకు చేరుకున్నాయి. 2021–2022లో 4.2 లక్షల మంది చదువులు పూర్తి చేయగా 69 వేల ఉద్యోగావకాశాలు లభించాయి. కరోనా సమయంలోనూ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్లే ఈ పెరుగుదల సాధ్యమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement