
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్న రాప్తాడు తహసీల్దార్ ఈరమ్మ
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్‌లోని రూ.100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు కాజేసినా అధికారులు గుర్తించకపోవడంపై జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24.49 ఎకరాల భూమి అన్యాక్రాంతంపై ‘ప్రభుత్వ భూములపై పచ్చమూక’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై జేసీ స్పందించారు. డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు.
ప్రసన్నాయపల్లిలోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారు? రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్ల నమోదుకు సహకరించిన అధికారులెవరు? రూ.100 కోట్లకు పైగా విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా స్థానికఅధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ఎలా రిజిష్టర్ చేశారు? అన్న కోణాల్లో విచారణ జరపాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. వారు రెండు,మూడు రోజుల్లో నివేదికను జేసీకి అందజేయనున్నారు. దాని ఆధారంగా నిందితులపై క్రిమినల్ కేసులు పెడతామని జేసీ ‘సాక్షి’కి తెలిపారు.
భూములను పరిశీలించిన తహసీల్దార్
అన్యాక్రాంతమైన ప్రసన్నాయపల్లి పరిధిలోని ప్రభుత్వ భూములను రాప్తాడు తహసీల్దార్ బి.ఈరమ్మ బుధవారం పరిశీలించారు. రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరిగాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిషేధిత జాబితాలో ఉన్నా సబ్‌రిజిస్ట్రార్ల తప్పిదం వల్లే ప్రైవేటు వ్యక్తులకు రిజిష్టర్ చేశారంటూ ధర్మవరం ఆర్డీవోకు నివేదిక పంపారు. అదే సమయంలో వెబ్‌ల్యాండ్‌లో నమోదైన పేర్ల ఆధారంగా మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరుడు పంజగల శ్రీనివాసులు భార్య పంజగల ప్రసన్నతో పాటు మరో పది మందికి నోటీసులు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment