నన్ను తప్పుకోమని కోరటం ధిక్కారపూర్వక చర్యే! | Justice Rakesh Kumar orders one day before retirement | Sakshi
Sakshi News home page

నన్ను తప్పుకోమని కోరటం ధిక్కారపూర్వక చర్యే!

Published Thu, Dec 31 2020 4:45 AM | Last Updated on Thu, Dec 31 2020 4:24 PM

Justice Rakesh Kumar orders one day before retirement - Sakshi

సాక్షి,అమరావతి: అనుమానం నిజమైంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులూ వ్యక్తం చేస్తూ వచ్చిన ఆందోళన వాస్తవమేనని తేలింది. రిటైరవటానికి ఒక్క రోజు ముందు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం అటు సుప్రీంకోర్టుపై, ఇటు ముఖ్యమంత్రిపై, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏ పిటిషనరు కూడా వాదనల్లో లేవనెత్తని అంశాలను, అసలు పిటిషన్లో కూడా లేని అంశాలను... తమ ముందున్న కేసుతో సంబంధం లేని వివరాలను, ఫేక్‌ వెబ్‌సైట్లలో, సోషల్‌ మీడియాలో పొందుపరిచిన పలు అంశాలను ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది.

ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేకున్నా సీఎం వైఎస్‌ జగన్‌ గురించి అభ్యంతరకరంగా తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాక సుప్రీంకోర్టు గురించి, సుప్రీంకోర్టు కొలీజియం గురించి కూడా పలు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ల బదిలీలను ధర్మాసనం పరోక్షంగా తప్పుపట్టింది. బదిలీ విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం తీరుపై కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ధర్మాసనం తన 55 పేజీల్లో ఎక్కువ శాతాన్ని ఈ కేసుతో సంబంధం లేని విషయాల గురించి ప్రస్తావించడానికి కేటాయించింది. 

ఆ వ్యాఖ్యలు చూసే.. రెక్యూజ్‌ పిటిషన్‌ 
అసలు ఈ కేసు ఏంటంటే... మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు సవాలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిగినపుడల్లా జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీంతో ఈ కేసును ఆయన విచారించకూడదని, ఆయనకు ప్రభుత్వంపై ముందే ఒక స్థిరాభిప్రాయం ఉన్నట్టు కనిపిస్తోంది కనక ఆయన విచారిస్తే న్యాయం జరిగే అవకాశం ఉండదని, కేసును వేరే బెంచ్‌కు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యరి్థంచింది. న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా ఉండటమే కాదు. నిష్పాక్షికంగా ఉన్నట్టు కనిపించాలి కూడా... అనే సూత్రాన్ని అనుసరించి ఇక్కడ అలా కనిపించటం లేదు కనక ఆయన ‘రెక్యూజ్‌’ కావాలంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. కానీ ఈ విచారణ నుంచి తప్పుకోవటానికి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ నిరాకరించారు. రెక్యూజ్‌ పిటిషన్‌పై కూడా తానే విచారణ చేపట్టారు.


చివరకు పదవీ విరమణకు ఒక్కరోజు ముందు... రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చారు. అంతేకాదు!! జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ను విచారణను నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం తరఫున మిషన్‌ మిల్డ్‌ కార్పొరేషన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కుమార్‌ అభ్యరి్థంచటం కోర్టు ధిక్కార చర్యే అవుతుందని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ అభ్యర్థన హానికరమైనదని, అది ఏ మాత్రం సాధ్యం కానిదని తెలిపింది. ప్రవీణ్‌ కుమార్‌ ప్రమాణపూర్వకంగా తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారంటూ... ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలకు ఏ ఆధారాలూ లేవంది. పెర్జురీ (తప్పుడు ఆఫిడవిట్‌) కింద ప్రవీణ్‌కుమార్‌పై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు  చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు సంబంధిత కోర్టులో ఫిర్యాదు చేయాలని హైకోర్టు రిజిష్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది. అలాగే కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశిస్తూ ఆయనకు ఆరు వారాలు గడువిచి్చంది. తదుపరి విచారణను 2021 ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ రెక్యూజల్‌ కోసం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తప్పుపట్టిన ధర్మాసనం, ప్రభుత్వం నుంచి ఇలాంటి అభ్యర్థనను ఆశించలేదని తెలిపింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమేనని, ఇలాంటి చర్యలకు న్యాయస్థానాలు భయపడవని వ్యాఖ్యానించింది.  

అకస్మాత్తుగా తీర్పు వెలువరించిన ధర్మాసనం 
మిషన్‌ బిల్డ్‌ ఏపీ కేసు విచారణకు వచ్చినపుడల్లా జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా.. రాష్ట్రంలో ఆర్థిక అత్యాయక పరిస్థితి ఉందా? అన్నారు. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యాలపై మీరు (జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌) విచారణ జరిపితే, మాకు న్యాయం జరిగే పరిస్థితి ఉండదని పేర్కొంటూ... ఆయన విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ ప్రభుత్వం తరఫున ప్రవీణ్‌కుమార్‌ రెక్యూజ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ రాకేశ్‌ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, ప్రభుత్వం చెబుతున్న వ్యాఖ్యలను తాను చేయలేదన్నారు. కానీ దీన్ని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తోసిపుచ్చారు. ప్రవీణ్‌కుమార్‌ స్వయంగా విన్నారని, అలాగే తాను, తన తోటి న్యాయవాదులు కూడా విన్నామని చెప్పారు. అనంతరం ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి బుధవారం నాటి కేసుల విచారణ జాబితాలో ఈ కేసు లేదు. అకస్మాత్తుగా ఈ కేసులో తీర్పును వెలువరిస్తున్నట్లు ధర్మాసనం ఈ కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదులకు తెలియజేయటం గమనార్హం. (న్యాయమే నెగ్గుతుంది: సీఎం వైఎస్‌ జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement