‘కొండపల్లి’ ఎన్నిక కేసులో నాటకీయ పరిణామాలు  | Justice Roy withdraws from hearing TDP leaders petitions | Sakshi
Sakshi News home page

‘కొండపల్లి’ ఎన్నిక కేసులో నాటకీయ పరిణామాలు 

Published Thu, Dec 23 2021 4:50 AM | Last Updated on Thu, Dec 23 2021 4:50 AM

Justice Roy withdraws from hearing TDP leaders petitions - Sakshi

సాక్షి, అమరావతి: కొండపల్లి మునిసిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై విచారణ సందర్భంగా హైకోర్టులో బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను కొనసాగించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌తోపాటు ఎక్స్‌–అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు కోసం దాఖలైన వ్యాజ్యాల విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌ తప్పుకొన్నారు. ఈ వ్యాజ్యాల్లో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన కొందరు కౌన్సిలర్ల తరఫు న్యాయవాది చాపర్ల సీతారాం.. విచారణకు అవాంతరం కలిగిస్తూ కోర్టు సమయాన్ని వృథా చేస్తుండటంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఈ వ్యాజ్యాలను తాను విచారించబోనని, వాటిని మరో బెంచ్‌కు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

ఈ వ్యాజ్యాల రికార్డులన్నింటినీ సీజే ముందు ఉంచాలంటూ ఉత్తర్వులిచ్చారు. మునిసిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను ఎన్నికల అధికారి పదేపదే వాయిదా వేస్తున్నారని, ఎన్నికలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ టీడీపీ కౌన్సిలర్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికిముందు ఎక్స్‌– అఫీషి యో సభ్యునిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తనకు అనుమతివ్వాలంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని పిటిషన్‌ వేశారు. ఇవి పెండింగ్‌లో ఉండగానే, ఈ వ్యవహారంలో తమ వాదనలు కూడా వినాలంటూ కొందరు కౌన్సిలర్లు ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. వీటి విచారణార్హతపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ వ్యాజ్యాలకు విచారణార్హత ఉందంటూ టీడీపీ నేతల తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ కొన్ని డాక్యుమెంట్లను కోర్టు ముందుంచారు. 

న్యాయవాది తీరుపై జస్టిస్‌ అసహనం 
పిటిషన్ల విచారణార్హతపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ పలు సందేహాలు లేవనెత్తారు. దీనిపై టీడీపీ నేతల తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వివరణ ఇస్తుండగానే, ఇంప్లీడ్‌ అయిన కౌన్సిలర్ల తరఫు న్యాయవాది చాపర్ల సీతారాం కూడా వాదనలు వినిపించేందుకు ప్రయత్నించారు. న్యాయమూర్తి ఆయనను వారించగా.. సీతారాం మాత్రం వాదనలు కొనసాగించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో న్యాయమూర్తి మరోసారి ఆయనను వారించినా సీతారాం వాదనలు వినిపించేందుకు ప్రయత్నించడంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement