కన్నతల్లి లక్ష్మి పీకపై కాలితో తొక్కుతూ హత్యాయత్నానికి ఒడిగడుతున్న వెంకన్న
యానాం: నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిపై మద్యానికి బానిసైన కన్న కొడుకు అతి క్రూరంగా వ్యవహరించాడు. పింఛను డబ్బులు ఇచ్చినప్పటికీ ఇంకా ఇవ్వాలంటూ ఆమెను తలపై కాలితో తన్నుతూ.. చివరకు కాలితో పీకపై తొక్కి హత్యయత్నానికి ఒడిగట్టాడు. ఆమెను కొడుతున్న ఘటనను పక్కింటి వారు సెల్‌ఫోనులో చిత్రీకరించడంతో ఈ దారుణం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి మొదటి కుమారుడు సుబ్బారావు, మనవడు ఉమామహేశ్వరరావు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం ఉప్పర్ల కాలనీకి చెందిన తల్లిబోయిన లక్ష్మి(75)కు ముగ్గురు కుమారులు. భర్త సుబ్బారావు రెండేళ్ల కిందట మృతి చెందాడు. మూడో కొడుకు రాములు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇటీవల ఐదు నెలల పాటు లక్ష్మి అతడి వద్ద ఉంది.
అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత రెండు నెలల పాటు మొదటి కుమారుడు సుబ్బారావు వద్ద ఉంది. రెండో కుమారుడు వెంకన్న వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. లక్ష్మికి వృద్ధాప్య పింఛను రూ.2,500 వస్తోంది. ఈ నేపథ్యంలో తల్లిని తన ఇంటి వద్ద ఉంచుకుని చూసుకుంటానని వెంకన్న ఇటీవల పల్లిపాలెంలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే మద్యానికి బానిసైన వెంకన్న తల్లి లక్ష్మిని తరచూ కొడుతూండేవాడు. ఆదివారం పూటుగా తాగి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. తనకు డబ్బులివ్వాలంటూ తల్లిని ఇంట్లోంచి ఈడ్చుకుంటూ బయటపడేశాడు.
చదవండి: (కారు డ్రైవర్‌కు మద్యం తాగించి.. ఈ జంట చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే)
కాలితో తన్నుతూ, విచక్షణారహితంగా పీకపై కాలితో అనేకసార్లు తొక్కాడు. అడ్డుకుంటే తమను కూడా కొడతాడన్న భయంతో చుట్టుపక్కల వారు ప్రేక్షక పాత్ర వహించారు. చివరకు అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను యానాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె మెదడులో రక్తస్రావం జరిగిందని, స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. తల్లిపై తనయుడు చేసిన దాడి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.
కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు గొల్లపాలెం ఇన్‌చార్జి ఎస్సై వాసు సోమవారం యానాం జీజీహెచ్‌కు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితురాలు లక్ష్మికి పండ్లు ఇచ్చారు. నిందితుడు వెంకన్నను అదుపులోకి తీసుకున్నామని, అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment