
కాణిపాకం: పుట్టుకతోనే పక్షవాతం. మంచానికే పరిమితం. ఇలాంటి దుస్థితిలో ఉన్న ఆ యువకుడిపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. జాలి, దయ లేకుండా పింఛన్ తొలగించేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు.. బంగారుపాళ్యం మండల కేంద్రానికి చెందిన సమ్మద్, సాహిన్ దంపతులు దినసరి కూలీలు. వీళ్లకు సొంత ఇల్లు లేదు. సెంటు జాగా లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ దంపతులకు ఇంటి స్థలం మంజూరు చేశారు. వీరి పెద్ద కుమారుడు హర్షద్ పుట్టుకతోనే పక్షవాతానికి గురయ్యాడు.
పక్షవాతం నుంచి రక్షించేందుకు 19 సవరాల బంగారాన్ని అమ్మేశారు. అయినా కుమారున్ని పక్షవాతం నుంచి కాపాడలేకపోయారు. మందులు, మాత్రలతోనే ప్రాణంతో నిలబెడుతున్నారు. నెలవారీగా రూ.7,500 ఖర్చువుతోంది. 20 ఏళ్లు దాటినా అతని ఆలనాపాలన మొత్తం తల్లిదండ్రులే చూసుకుంటున్నారు.
ఇప్పుడు అతనికి చూపు కూడా మందగించింది. ఈ దుస్థితిని గుర్తించి వైద్యులు 2013లో సదరన్ సర్టిఫికెట్ జారీచేశారు. అప్పటినుంచి పింఛన్ మంజూరవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్ల పరిశీలన చేపట్టారు. ఈ పరిశీలనలో భాగంగా ఐదుగురు అధికారులు బృందంగా ఇంటివద్దకు వచ్చి వికలత్వం 40శాతం కంటే తక్కువగా ఉందని నోటీసు ఇచ్చారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు బోరుమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
మనిషి ఎముకల గూడు మాదిరి ఉన్న విషయం అందరికీ తెలుస్తుంది. అతని పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనక మానరు ఎవరైనా.. మరి ఇలా ఉన్న మనిషికి సర్టిఫికేట్.. దానికి వెరిఫికేషన్ అంటూ పింఛన్ పెండింగ్‌లో పెట్టడం ఎంతవరకూ కరెక్ట్ అనేది సదరు అధికారులకే తెలియాలని విమర్శకులు అంటున్నారు. తనను చూస్తే జాలేయడం లేదా?అనేది మాత్రమే అతని చూపుల్లో కనిపిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.