ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్, మెడల్‌తో అకీరా నందన్
ఆలూరు రూరల్: పిట్ట కొంచం.. కూత ఘనం.. అన్న సామెత ఈ బుడతడికి సరిగ్గా సరిపోతుంది. చదివేది ఎల్‌కేజీ అయినా 11 తెలుగు ప్రాసలు నేర్చుకున్నాడు. దేవుని శ్లోకాలు, తెలుగు పద్యాలు చక్కగా వల్లె వేస్తున్నాడు. ఇంగ్లిష్ వర్ణమాల, ఆంగ్ల నెలలు, జాతీయ చిహ్నాలు, రుతువుల పేర్లు, జంతువుల పేర్లను చకచకా చెప్పేస్తున్నాడు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు టక్కున సమాధానమిచ్చేస్తాడు. తన ప్రతిభతో మూడేళ్ల వయసులోనే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (ఐబీఆర్)లో స్థానం సంపాదించాడు. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన చంద్రిక, ప్రశాంత్ కుమార్ దంపతుల కుమారుడు అకీరా నందన్.
పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదుతున్నాడు. బాలుడికి తల్లి రోజూ దినపత్రికల్లో వచ్చే వార్తల్లోని ముఖ్యాంశాలను చదివి వినిపించేది. తల్లి చెప్పే ఏ విషయాన్ని అయినా ఇట్టే పట్టేసి నేర్చుకునేవాడు అకీరా. బాలుడి మేధాశక్తిని గమనించిన తల్లిదండ్రులు అతని ప్రతిభను వీడియోలలో రికార్డు చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపించారు. ఐబీఆర్ నిర్వాహకులు అకీరాకు మే నెల 20వ తేదీన ఆన్‌లైన్‌లో టెస్టు నిర్వహించి బాలుడి పేరిట రికార్డు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి మెడల్, సర్టిఫికెట్‌ను నిర్వాహకులు పోస్ట్ ద్వారా బాలుడికి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment