
కర్నాటి రామ్మోహన రావు (ఫైల్)
విజయవాడ లీగల్: సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహనరావు (82) ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. కొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మెదడులో నరాలు గడ్డకట్టడంతో తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడుకు చెందిన రామ్మోహనరావు విజయవాడలో స్థిరపడ్డారు. వామపక్ష భావాలున్న ఆయన కమ్యూనిస్టు పార్టీ తరఫున నందిగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు.
నక్సల్ ఉద్యమానికి ఆకర్షితుడై అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివిన ఆయన ఏపీ బార్ కౌన్సిల్లో 1967లో పేరు నమోదు చేసుకుని, బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ)లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. దేశంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినా వెంటనే స్పందించేవారు. వంగవీటి రాధా, రంగా కేసులతో పాటు దేవినేని నెహ్రూ కేసులను కూడా వాదించి వారి మధ్య రాజీ కుదిర్చారు.
అలాగే సిటీ కేబుల్ రామకృష్ణ హత్య కేసుతో పాటు దుర్గ గుడిలో జరిగిన చోరీ కేసు, గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో జరిగిన మురళీధర్ లాకప్ డెత్ కేసు, మాజీ సీఎం ఎన్టీ రామారావుపై కత్తితో దాడి చేసిన మల్లెల బాబ్జీ(హైదరాబాద్)కేసు వంటివి వాదించారు. బీబీఏకు రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కుమార్తె సంధ్య లండన్‌లో ఉంటుండగా, కుమారుడు శరత్ వ్యాపారిగా స్థిరపడ్డారు. ఆయన భార్య రాజ్యలక్ష్మి 15 ఏళ్ల కిందట మృతిచెందారు. కర్నాటి మరణవార్త విన్న న్యాయవాదులు సూర్యారావుపేట ప్రకాశం రోడ్డులోని ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment