సాక్షి, అమరావతి/భవానీపురం/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : పశుపోషణ, పాడి, డెయిరీ, సాగు రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కేరళ, ఇథియోపియా బృందాలు కొనియాడాయి. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు.. అలాగే, రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే) ద్వారా గ్రామస్థాయిలో అందిస్తున్న సేవలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని తెలిపాయి.
ఏపీలో తీసుకొస్తున్న లైవ్‌స్టాక్ అండ్ పౌల్ట్రీ ఫీడ్ అండ్ మినరల్ మిక్చర్ బిల్లు–2022ను స్ఫూర్తిగా తీసుకుని దానిని మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో అమలుచేసే నిమిత్తం మంత్రి చెంచురాణి నేతృత్వంలోని 10 మంది ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన కేరళ ప్రభుత్వ సెలక్ట్ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది.
ఇందులో భాగంగా విజయవాడలో మంగళవారం రాష్ట్ర పశుసంవర్థక శాఖమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులతో కేరళ బృందం సమావేశమైంది. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో తమ ప్రభుత్వం నాలుగేళ్లలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని వివరించారు. ప్రతీ ఆర్బీకేను రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్‌గా తీర్చిదిద్దామన్నారు.
జగనన్న పాల వెల్లువ ద్వారా మహిళా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ డెయిరీ రంగం బలోపేతానికి కృషిచేస్తున్నామన్నారు. కేరళ ఎమ్మెల్యేల సందేహాలను మంత్రి అప్పలరాజు నివృత్తి చేశారు. ఏపీ పశుదాణా చట్టం–2020 అమలుతీరును పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ వివరించారు.
సీఎం జగన్ దూరదృష్టి అద్భుతం : కేరళ మంత్రి చెంచురాణి
కేరళ మంత్రి చెంచురాణి మాట్లాడుతూ ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టికి తామంతా ముగ్ధులయ్యామన్నారు. పశుపోషణ, పాడి, డెయిరీ రంగాల్లో ఏపీ సర్కార్ అందిస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు. కేరళలో పాడి, పౌల్ట్రీ సంపదకు అవసరమైన దాణా, ఫీడ్ కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.
50 శాతానికి పైగా పశు దాణా, పౌల్ట్రీ ఫీడ్‌లను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయంలో ఏపీ చేపట్టిన కార్యక్రమాలను కేరళలో కూడా అమలుచేసేందుకు తమ ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు, వైద్య, విద్యరంగాల్లో తీసుకొచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్నారు. కేరళ మంత్రి, ఎమ్మెల్యేలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆచరించదగ్గ ఎన్నో విషయాలున్నాయిక్కడ: ఇథియోపియా బృందం ప్రశంస
మరోవైపు.. ఆర్బీకేల సేవలు అద్భుతంగా ఉన్నాయని ఇథియోపియా ప్రతినిధి బృందం కితాబిచ్చింది. ప్రపంచంలో వ్యవసాయాధారిత దేశాలన్నీ ఆచరించదగ్గ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ అమలవుతున్నాయని అభిప్రాయపడింది. ఇథియోపియా బృందం పర్యటనలో భాగంగా రెండోరోజు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని గొల్లపూడి ఆర్బీకే కేంద్రాన్ని బృందం సందర్శించింది.
ఆర్బీకేలోని కియోస్క్ ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల బుకింగ్, సరఫరా గురించి రైతులను అడిగి బృందం సభ్యులు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకిచ్చిన ట్రాక్టర్ ఎక్కి రైతు క్షేత్రంలో దుక్కి పనుల్లో పాల్గొన్నారు. మూలపాడులో ఖరీఫ్ పంటల ఈ–క్రాప్ నమోదును పరిశీలించారు.
రైతులతో ముఖాముఖిలో పాల్గొని ఆర్బీకే ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల గురించి తాము విన్నదానికంటే ఎన్నో రెట్లు బాగున్నాయని బృంద సభ్యులు ప్రపంచానికే ఏపీ ఒక దిశానిర్దేశం చేసిందన్నారు. ఈ బృందంలో ప్రపంచ బ్యాంకు సలహాదారు హిమ్మత్ పటేల్, ఇథియోపియా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment