Key Points Of CM YS Jagan Speech At The Assembly Of March 2022, Details Inside - Sakshi
Sakshi News home page

ఆ రోజు శాసనసభలో సీఎం జగన్‌ ఏమన్నారంటే..

Published Mon, Nov 28 2022 2:43 PM | Last Updated on Mon, Nov 28 2022 4:32 PM

 Key Points Of CM YS Jagans Speech At The Assembly Of 2022 March - Sakshi

ఈ ఏడాది మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం జగన్‌ ప్రసంగం

అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరిగాయి. ఇదే అంశంపై మార్చి 24, 2022న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుస్పష్టంగా తమ ప్రభుత్వ విధానాన్ని శాసనసభ ముందుంచారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ రోజు ఆయన చేసిన ప్రసంగంలో కీలకమైన అంశాలను ఒక సారి పరిశీలిస్తే.... 

‘వికేంద్రీకరణే మా విధానం. రాజధాని అంశంలో నిర్ణయాధికారం, బాధ్యత శాసన వ్యవస్థదే. ఈ విషయంలో సర్వాధికారాలతోపాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఈ చట్టసభకు ఉంది’ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
(మార్చి 24, 2022, శాసనసభలో)


‘రాజ్యాంగానికి మూడు స్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలోకి మరొకటి చొరబడకూడదని, అప్పుడే వ్యవస్థలన్నవి నడుస్తాయని.. అలా కాకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయి. శాసనసభ ఫలానా విధానాన్ని, ఫలానా చట్టాన్ని చేస్తుందని ముందస్తుగానే ఊహించుకుని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవు. రాబోయే రోజుల్లో ఒక చట్టం రాబోతుందని, దానివల్ల ఫలానా రాజధాని ఫలానా చోట పెడతారు.. అని వాళ్లంతట వాళ్లే ఊహించుకుంటే ఎలా? మూడు రాజధానులకు సంబంధించి ఆలోచన ఇంకా మెరుగ్గా ముందుకు వస్తుంది. అలా రాకూడదని చెప్పి ముందుగానే దాన్ని ప్రివెంట్ చేస్తూ కోర్టులు నిర్దేశించలేవు. శాసన వ్యవస్థ నిర్ధిష్టమైన విధానం, చట్టం చేయకూడదని కోర్టులు ఆదేశించ లేవు’ 

శాసన వ్యవస్థ పరిధిలోనే ఆ అధికారం  
► చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థ పరిధిలో ఉంటుంది. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండదు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రజలు ఐదేళ్లకోసారి ప్రతి ఒక్కరి పనితీరును మధిస్తారు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు.  ప్రభుత్వ పాలన, చట్టాలు నచ్చకపోతే ఇంటికి పంపించేస్తారు. 
► ప్రజలకు గత ప్రభుత్వ విధానాలు, చట్టాలు నచ్చలేదు కాబట్టే ఈ రోజు 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలు అంటే 86 శాతం అసెంబ్లీ సీట్లు మనకిచ్చారు. గత ప్రభుత్వ చట్టాలు, విధానాలను వ్యతిరేకించారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇదే ప్రజాస్వామ్యం గొప్పదనం. 

► ప్రతి ఐదేళ్లకు పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు పరీక్షకు నిలబడతారు. ప్రజల వద్దకు వెళ్లాల్సిందే. ప్రజలు మళ్లీ వాళ్లను తూచి, వాళ్లు పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? అని మార్కులు వేస్తారు. కోర్టులు ఈ వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదని చెప్పడానికి ఇదే నిదర్శనం.  

► మొదట్లో అభివృద్ధి లేకపోవడంతో తెలంగాణ ఉద్యమం వచ్చింది. రెండోసారి తెలంగాణా ఉద్యమం రాష్ట్ర విభజనకు దారితీసింది. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్లే రెండోసారి తెలంగాణ ఉద్యమం వచ్చిందని 2010లో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది.  

► రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ.. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని చెప్పింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు గతంలో ఇదే సభలో అన్ని విషయాలు చెప్పి ప్రస్తావించిన మాటలకు మన ప్రభుత్వం నేటికీ కట్టుబడి ఉంది.   

► రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్ర రాజధాని నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదు. తన పాత్ర ఉంటుందని, అది తన అధికారమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. ఇది సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమేనంటూ.. ఆర్టికల్ 3ని కూడా కోట్ చేస్తూ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే హైకోర్టుకు నివేదించింది. 

► ఒక రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేసేందుకు నిర్ధిష్టమైన విధానం ఏమైనా ఉందా.. అని టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్లమెంటులో అడిగితే..   కేంద్రం సమాధానమిస్తూ ‘ఒక రాష్ట్రం రాజధానిని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదు’ అని స్పష్టతనిచ్చింది. 

► కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్ను కూడా దాఖలు చేసింది. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు, మిగిలిన అంశాలకు సంబంధించి మాత్రమే నిర్దేశించింది. రాష్ట్రాల రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన ఏ నిబంధన కూడా ఇందులో లేదు’ అని స్పష్టంగా పేర్కొంది.  

► రాజధాని నగరంతో పాటు ఈ ప్రాంతంలో చూపిన మాస్టర్ ప్లాన్ కేవలం కాగితాలపై గ్రాఫిక్స్ రూపంలో ఉంది. మాస్టర్ ప్లాన్ను అప్పటి ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో నోటిఫై చేసింది. సీఆర్డీయే చట్టం ప్రకారం ఆ మాస్టర్ ప్లాన్ కాల పరిమితి 40 ఏళ్లు. ప్రతి ఐదేళ్లకోసారి దాన్ని సమీక్షించాలని కూడా పేర్కొన్నారు. అంటే  40 ఏళ్లకు కూడా సాధ్యం కాదన్నది అందరికీ తెల్సిన విషయం.  
► ఇప్పటికి ఆరేళ్లయింది. గ్రాఫిక్స్కే పరిమితమైన ఈ మాస్టర్ ప్లాన్ పూర్తిగా పేపర్ పైన మాత్రమే ఉంది. ఏ 29 గ్రామాల గురించైతే మాట్లాడుతున్నారో.. రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు లేని ప్రాంతంలో వాటిని కల్పించడం కోసమే ఆనాడు టీడీపీ ప్రభుత్వం వేసిన అంచనా ప్రకారం ఎకరాకు రూ.2 కోట్లు చొప్పన 54 వేల ఎకరాలకు దాదాపు రూ.1.09 లక్షల కోట్లు అవుతుంది.  
► అంటే రాబోయే 40 ఏళ్లలో కనీసం 15 లక్షల కోట్లో 20 లక్షల కోట్ల రూపాయలకో వ్యయం పెరుగుతుంది. 54 వేల ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం మీద 0.0001 శాతం ఉంటుంది. మిగిలిన రాష్ట్రం 99.9999 శాతం ఉంది. ఆ ప్రాంతమంతా కూడా అభివృద్ధి, సంక్షేమం కోసం ఎదురు చూస్తోంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నది మరచిపోకూడదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా.  
► అలా కాకుండా రాజధాని అని నామకరణం చేసి, ఇక్కడ మాత్రమే డబ్బులు పెట్టడం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చాలనే విషయాన్ని మరచిపోకూడదు. 
► రాజ్యాంగం ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ఆలోచిస్తున్నాం. చివరిగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక్కటే హామీ ఇస్తున్నా. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకు రావడంతో పాటు రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడతాం. వారికి కూడా అండగా నిలుస్తాం.   

చదవండి: రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా?: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి రాజధాని కేసు: హైకోర్టు ఆదేశాల్లో సుప్రీం స్టే విధించిన అంశాలివే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement