ప్రత్యామ్నాయమే పరిష్కారం | Key steps to stop the privatization of Visakha Steel Plant | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌: ప్రత్యామ్నాయమే పరిష్కారం

Published Mon, Feb 8 2021 3:28 AM | Last Updated on Mon, Feb 8 2021 2:38 PM

Key steps to stop the privatization of Visakha Steel Plant - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిలువరించేందుకు పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, ఆ దిశగా తొలుత ఆలోచించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలే అత్యుత్తమ మార్గాలని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొద్ది కాలంగా వస్తున్న నష్టాలను సాకుగా చూపి, నీతి ఆయోగ్‌ చెప్పింది కాబట్టి.. స్టీల్‌ ప్లాంట్‌ను గంప గుత్తగా అమ్మేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం సబబు కాదంటున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచి, లాభాల్లోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ను ప్రతిపాదించారు. 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యమున్న ఈ ప్లాంట్‌ గత డిసెంబర్‌లో 6.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో పని చేసిందని, తద్వారా రూ.200 కోట్లు ఆర్జించిందన్నారు. ఇదే రీతిలో ప్లాంటు రెండేళ్ల పాటు నడిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని వివరించారు. 

అసలు సమస్య ముడి ఖనిజమే
– ముడి ఖనిజానికి అదనపు చెల్లింపుల వల్ల ప్లాంట్‌పై రూ.3,472 కోట్ల భారం పడుతోందని.. సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఒడిశాలో ఉన్న ఇనుప ఖనిజం గనులను కేటాయించడం ద్వారా ప్లాంట్‌ను తిరిగి ప్రగతి బాటలోకి తీసుకెళ్లొచ్చని సూచించారు. 
– ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌ ఎన్‌ఎండీసికి చెందిన బైలదిల్లా గనుల నుంచి మెట్రిక్‌ టన్ను రూ.5,260 చొప్పున మా ముడి ఖనిజాన్ని కొనుగోలు చేస్తోందని, ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌కు ఇదే అత్యంత ప్రతికూలంగా మారిందని  పేర్కొన్నారు. 
– పోటీ పరిశ్రమలన్నింటికీ సొంతంగా గనులు ఉన్నాయని, 60 శాతం ముడి ఖనిజం అవసరాలను సొంత గనుల ద్వారా తీర్చుకుంటూ, మిగిలిన 40 శాతం మాత్రమే ఎన్‌ఎండీసీ నుంచి కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. సెయిల్‌కు 200 ఏళ్లకు సరిపడా ముడి ఖనిజం అవసరాలను తీర్చే గనులున్నాయని ఆ లేఖలో తెలిపారు. 
రుణాలను వాటాల రూపంలోకి మార్చొచ్చు
– స్టీల్‌ ప్లాంట్‌ చెల్లించాల్సిన రుణాలను వాటాల రూపంలోకి మార్చితే ఒత్తిడి తగ్గుతుందని, వడ్డీల బెడద కూడా ఉండదని సీఎం తెలిపారు. రూ.22 వేల కోట్ల రుణాలకు దాదాపు 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. 
– ఈ రుణాలను వాటాల రూపంలోకి మార్చి, స్టాక్‌ ఎక్సేంజ్‌ లిస్టింగ్‌ ద్వారా బ్యాంకులకు ఎగ్జిట్‌ ఆప్షన్‌ కలిగించవచ్చనని సీఎం పేర్కొన్నారు. తద్వారా ప్రజల నుంచి కూడా నిధుల సమీకరణకు అవకాశం ఏర్పడుతుందని, ప్లాంట్‌ సవ్యంగా నడుస్తుందని వివరించారు.  
– విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు వేలాది ఎకరాల భూములున్నాయని.. ప్లాంట్, టౌన్‌షిప్‌కు పోగా మిగిలిన భూముల్లో గ్రీన్‌ సిటీ (ప్లాట్లు వేయడం) ఏర్పాటు చర్యలు తీసుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని, ఇందుకు రాష్టప్రభుత్వం కూడా అనుమతి ఇస్తుందని సీఎం సూచించారు. ఈ డబ్బు ప్లాంట్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

ఆ నష్టాన్ని కేంద్రమే భరించాలి
ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడటానికి ఆ నష్టాలేవో కేంద్ర ప్రభుత్వమే భరించాలని, లేదా ఆ నష్టాలను మాఫీ చేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ప్లాంట్‌ ఉద్యోగులూ ఇదే విషయం చెబుతున్నారు. ఇందుకు నీతి అయోగ్‌ లేదా మరెవరో అభ్యంతరం పెడతారనుకుంటే ఒఎన్‌జీసీనో, లాభాల్లో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ సంస్థలో టేకోవర్‌ చేసేలా ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలా చేసిన దాఖలాలు ఉన్నాయని ఉదహరిస్తున్నారు. ప్లాంట్‌కు ఉన్న మిగులు భూమిని టెండర్లు పిలిచి మంచి ధరకు విక్రయించవచ్చని, లేదా దీర్ఘకాలం లీజుకు ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా వచ్చే డబ్బును ప్లాంట్‌కు కేటాయించి, నష్టాలు తగ్గించుకోవడానికి కొత్త కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. ఇది కూడా వీలు కాదనుకుంటే దుర్గాపూర్‌ స్టీల్స్‌ తరహాలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు వెళ్లొచ్చు. సొంత గనులు కలిగి ఉన్నప్పటికీ ‘సెయిల్‌’ నష్టాల్లో ఉందని, సొంత గనులు లేని విశాఖ స్టీల్స్‌ గత ఏడాది రూ.200 కోట్ల లాభాలు ఆర్జించిన విషయాన్ని విస్మరించడం బాధాకరం అని ప్లాంట్‌ ఉద్యోగులు వాపోతున్నారు. ప్లాంట్‌ను ఆదుకోవడానికి ఇన్ని ప్రత్నామ్నాయాలు ఉండగా ఏకంగా ప్రైవేటీకరణే అనడం తగదంటున్నారు. 

సొంత గనులు కేటాయిస్తే మూడేళ్లలో లాభాలు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పనులు 1980లో ప్రారంభమై.. 1991 నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తి మొదలైంది. టెక్నాలజీకి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టడం వల్ల ప్రారంభంలో నష్టాల్లోకి వెళ్లింది. 2001లో ప్లాంట్‌లో పరికరాలను ఆధునికీకరించాం. తప్పులు సరిదిద్దుకున్నాం. అప్పటి నుంచి లాభాలు మొదలయ్యాయి. 2001లో రేటెడ్‌ కెపాసిటీకి ఎదిగాం. 2002–2003 ఆర్థిక సంవత్సరంలో మొట్ట మొదటిసారిగా రూ.522 కోట్లు లాభం వచ్చింది. 2003–04 రూ.1,540 కోట్లు, 2004–05లో రూ.2,008 కోట్లు లాభాలార్జించింది. 2007–08 వరకూ వరుసగా లాభాల బాటలో పయనించింది. 2004–05లో లాభాలు రాగానే విస్తరణ దిశగా అడుగులు వేశాం. గనుల సహకారం కావాలని కోరాం. నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ)తో ఎంవోయూ చేసుకున్నాం.

స్టీల్‌ సెక్టార్‌లో విస్తరణ ఆమోదం (2005 అక్టోబర్‌లో) పొందిన మొట్టమొదటి ప్లాంట్‌ ఇది. అప్పటికి ఉన్న రూ.8,621 కోట్ల క్యాష్‌ డిపాజిట్స్‌తో 2005లో విస్తరణ పనులు ప్రారంభించి 2008 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని అనుకున్నాం. 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనులకు 8 ఏళ్లు పట్టింది. దీంతో డిపాజిట్స్‌ ఖాళీ అయ్యాయి. విస్తరణ తర్వాత.. పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైంది. 6.3 మిలియన్‌ టన్నుల కెపాసిటీకి విస్తరించడం వల్ల.. సాంకేతికతను అందిపుచ్చుకుని లాభాల బాట పట్టేందుకు సమయం పడుతుంది. ముడి ఖనిజం కోసం ఒక్క ఎన్‌ఎండీసీపైనే ఆధారపడకుండా.. ఎక్కడ మంచిది దొరుకుతుందో చూసుకోవాలి. సాధారణ రేటుకు అందించేలా కేంద్రం కృషి చేయాలి. సీఎం జగన్‌ వీటన్నింటినీ వివరిస్తూ ప్రధానికి లేఖ రాశారు. సొంత గనులు కేటాయిస్తే మూడేళ్లలో లాభల బాట పడుతుంది. 
– యండమూరి శివసాగరరావు, స్టీల్‌ప్లాంట్‌ మాజీ సీఎండీ

కేంద్రం చెప్పేవన్నీ కుంటి సాకులే
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్రం చెప్పేవన్నీ కుంటి సాకులే. ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలను ఆచరణలోకి తెస్తే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లాభాల బాట పడుతుందనడంలో సందేహం లేదు. రుణాలపై వడ్డీ రేటు తగ్గించాలి. సొంత మైన్స్‌ లేకపోవడం వల్లే ఆర్థిక భారం పడుతోంది.  
– ప్రొఫెసర్‌ ప్రసాదరావు, ఆంధ్రా యూనివర్సిటీ, ఎకనమిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ 

కేంద్రంపై ఒత్తిడి తేవాలి
విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిపోతోంది. సొంత గనులు లేని కారణంగా భారం పెరిగిపోతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్రానికి స్పష్టంగా వివరించారు. ఈ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించేలా అన్ని విధాలా ఒత్తిడి తేవాలి.
– ఆచార్య పి.విశ్వనాథం, కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం, ఆంధ్ర యూనివర్సిటీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement