తప్పుడు రికార్డులతో లెక్కలేనన్ని భూదందాలు
అధికారం అడ్డం పెట్టుకుని అధికారులపై రుబాబు
గ్రానైట్ అక్రమ తరలింపుతో అడ్డగోలుగా ప్రజాధనం లూటీ
అమాత్య పదవి వెలగబెట్టి ఈఎస్‌ఐ కుంభకోణంలో సూత్రధారిగా మారిన నేత
నకిలీ కొటేషన్లు, నకిలీ రశీదులతో రూ. 150 కోట్లు కొల్లగొట్టిన వైనం
ఎదురు తిరిగితే అంతం చేయడమే ఆయనకు తెలిసిన న్యాయం
తమకు అనుకూలం కాకుంటే సామాజిక, గ్రామ బహిష్కరణ
ఇదీ శ్రీకాకుళం జిల్లాలో ఓ ‘దేశం’ నాయకుడి దౌర్జన్య కాండ
దశాబ్దాల రాజకీయ వారసత్వాన్ని ఆయన అక్రమాలకు అనువుగా మార్చుకున్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందినకాడికి దోచుకున్నారు. అధికారులను బెదిరించి...రికార్డులు తారుమారు చేసి... అనుచరులతో కలసి భూదందా నడిపారు. సహజసిద్ధంగా లభ్యమయ్యే గ్రానైట్‌ను అక్రమంగా తవ్వేసి అధికారుల కళ్లుగప్పి ఎగుమతి చేసుకున్నారు. తమ మాట విననివారినీ.. ఎదురు తిరిగిన వారిని మట్టుబెట్టడం.. లేకుంటే వారిని సామాజిక బహిష్కరణ చేసి బెదిరించడం అలవాటుగా చేసుకున్నారు. ఓ ప్రతిపక్షం రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన ఈయన ఓ విడత అమాత్యపదవి వెలగబెట్టి ఏకంగాపెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని ఓ తెలుగుదేశం నాయకుడి అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయంగా ఆయనకున్న పరపతిని భూదందాలకు, అక్రమంగా గ్రానైట్ తరలింపునకు వాడుకుంటున్నారు. అడ్డుకునే అధికారులపై విరుచుకుపడుతున్నారు. ఆయన సోదరుడు కోటబో మ్మాళి మండలం నిమ్మాడ సమీపంలో పెద్దబమ్మిడి గ్రామంలో 3.15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి గోడౌన్ నిర్మించారు. సాగునీటి కాలువ మూసేసి గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ నిర్మించారు. సాగునీటి కాలువను సైతం మూసేశారు.
ఆ కాలువపై ఆధారపడిన 40 ఎకరాలకు సాగునీరు నిలిచిపోయింది. ఆక్రమించుకున్న భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు కూడా మాయం చేశారు. అధికారంలో ఉండగా కబ్జా చేసిన భూములను తమకు తెలిసిన వ్యక్తుల పేరు మీదకు మార్చేసి మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారు. అధికారుల స్టాంపు, డిజిటిల్ సిగ్నేచర్‌ను తమ గుప్పెట్లో పెట్టుకుని అక్రమాలను కొనసాగించారు.
దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై దౌర్జన్యానికి పాల్పడేవారు. తన అనుచరులను బినామీలుగా మార్చుకుని వారి పేరున అనేక పట్టాలు సృష్టించుకున్నారు.టీడీపీ హయాంలో కోటబొమ్మాళి మండల కేంద్రంలో పెద్ద చెరువు అభివృద్ధి పేరుతో సుమారు 12 ఎకరాలను కబ్జా చేశారు. గరీబుల గెడ్డ పరీవాహక భాగంలో సుమారు 7 ఎకరాలు తన అనుచరుడి పేరున కబ్జాచేశారు. ఇవి కొన్ని ఆక్రమణలు మాత్రమే. ఇవిగాకుండా తన అనుచరులు చేసిన భూదందాలకు వెన్నుదన్నుగా నిలిచారు.
గ్రానైట్ అక్రమాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి
ఆ నాయకుడి కుటుంబ సభ్యులు గ్రానైట్‌ను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. దీనిపై మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి పక్కా ఆధారాలతో కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 379, 420, 477–ఎ, 406, 120బి, 34ఐపీసీ సెక్షన్‌ల కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ నాయకుడి కుమారుడి పేరున 2018 ఏప్రిల్ 23వ తేదీ నుంచి 2038 ఏప్రిల్ 22వ తేదీ వరకు దాదాపు 20 ఏళ్ల మినరల్ డీలర్ లైసెన్సు తీసుకున్నారు.
రఫ్ గ్రానైట్ బ్లాక్‌ల కటింగ్, పాలిషింగ్ తదితర కార్యక్రమాలను వీరి ఇండస్ట్రీ చేపడుతుంది. క్వారీల నుంచి గ్రానైట్ బ్లాక్‌లను అధికారికంగా అనుమతి తీసుకుని తమ ఇండస్ట్రీకి రవాణా చేసుకోవాల్సి ఉంది. కానీ వీరి ఇండస్ట్రీలో అందుకు భిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయని అధికారుల తనిఖీల్లో తేలింది. 172.87క్యూబిక్ మీటర్ల బరువైన 23 బ్లాక్‌లను అక్రమంగా తరలించినట్టుగా తేల్చారు. దీనివిలువ అపరాధ రుసుంతో కలిపి రూ.6 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇదంతా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం. ఇప్పటివరకూ వీరి ద్వారా రూ.11,43,29,120 మేర అక్రమాలు జరిగాయి. మరో రూ.3,18,72,960 మేర జీఎస్టీ చెల్లించకుండా ఎగ్గొట్టారు. అ«ధికారం లేకపోయినా అధికారులు కళ్లుగప్పి అక్రమ రవాణాకు పాల్పడ్డారంటే ఈ నాయకుడి ఫ్యామిలీ ఎంత బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు.
ఆయన నేర చరిత్ర చాంతాడంత
ఆయన మాట కాదన్నవారు ఎవరైనా అదృశ్యమైపోతారు. కారణం మాత్రం ఇప్పటికీ చిదంబర రహస్యం. తొలుత బెదిరింపులు.. ఆ తర్వాత దౌర్జన్యాలు.. అప్పటికీ లొంగకపోతే సామాజిక, గ్రామ బహిష్కరణలు..ఇంకా వినకపోతే దాడులు చేయడం ఇక్కడ పరిపాటి.
ఈఎస్‌ఐ స్కామ్‌లోనూ కీలకంగా మారి...
టీడీపీ అధికారంలో ఉండగా మంత్రి హోదాలో ఈయన చేసిన ఈఎస్‌ఐ స్కామ్ జిల్లాకే మాయని మచ్చగా మారింది. అడ్డొచి్చన అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. అంతటితో ఆయన లీలలు ఆగలేదు. కార్మికుల కోసం కొనుగోలు చేసిన మందుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. దాదాపు రూ.150 కోట్లకు పైగా జరిగిన స్కామ్‌లో సూత్రధారిగా నిలిచారు. మందు బిల్లులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో సొమ్ము నొక్కేశారు.
బినామీలను తెరపైకి తెచ్చి నామినేటెడ్ పద్ధతిలో వందల కోట్ల రూపాయల విలువైన మందులు, పరికరాలను యథేచ్ఛగా కొనుగోలు చేసి నచి్చనట్టుగా బిల్లులు చేసేసుకున్నారు. ఈ బండారం కాస్తా విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు, పనులు నామినేషన్‌పై అప్పగించాలని మంత్రి హోదాలో ఆ నాయకుడు ఇచి్చన సిఫారసు లేఖతో మొత్తం గుట్టు రట్టు అయింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ప్రతినిధులు తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారు. వీటన్నింటిపైనా పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు.
నమోదైన కేసుల వివరాలు
► అవినీతి నిరోధక శాఖ క్రైమ్ నంబర్ 04/ఆర్‌సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అధికారులు కేసు నమోదు చేశారు.
► 2008 ఆగస్టు 11న కోటబో మ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద మూడో విడత పింఛన్ల పంపిణీని అడ్డుకున్నందుకు ఎఫ్‌ఐఆర్ నంబర్ 150/2008 ప్రకారం 354, 323, 506(1) అండ్ (2) రెడ్ విత్ 34 సెక్షన్ల ప్రకారం మహిళను అవమానపరిచేలా ప్రవర్తించి, గాయపర్చి, బెదిరించినందుకు తదితర కారణాలతో కేసులు నమోదయయ్యాయి.
► 2014 సార్వత్రిక ఎన్నికల్లో సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి ప్రచారానికి వెళ్లిన ఆయన్ను అడ్డుకున్న మహిళపై దారుణంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై నౌపడ పోలీస్‌స్టేషన్‌లో మహిళలు ఫిర్యాదు చేయగా, 341, 506, 323 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత వారిని బెదిరించి రాజీ యత్నాలు చేశారు.
► 2021 ఫిబ్రవరిలో నిమ్మాడలో కింజరాపు అప్పన్న అనే వ్యక్తి సర్పంచి స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లగా ఆ నాయకుడి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 44/2021 ప్రకారం 147, 148, 307, 324, 506, 341, 384, 188 రెడ్ విత్ 149 ఐపీసీ, సెక్షన్ 123 ఆఫ్ దీ పీపుల్ రిప్రజెంట్ చట్టం, సెక్షన్ 212 ఆఫ్ ద ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1995 కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఆ సమయంలో 14 రోజులు రిమాండ్‌లో ఉన్నారు. ఇవిగాకుండా మరెన్నో కేసులు ఆయనపై నమోదై ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment