రాజధాని భూ కుంభకోణాలపై ఏపీ ప్రభుత్వం మళ్లీ దృష్టి సారించినట్లుగా ఉంది. ఒక వైపు రాజధాని అమరావతి రైతుల పేరుతో పాదయాత్ర, మరో వైపు అమరావతి లో అస్సైన్డ్ భూముల లావాదేవీల స్కామ్ లో అరెస్టులతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అమరావతి గ్రామాలలోనే అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, తద్వారా తమ ఆస్తుల విలువ మరిన్ని కోట్లు పలకాలని కోరుకుంటున్నవారు పాదయాత్ర చేపట్టడం విశేషమే.
గతంలో ఎప్పుడైనా ఎవరైనా సమస్యలలో ఉన్నవారు ఆందోళనలకు దిగుతుండేవారు. కానీ ప్రస్తుతం ఏపీలో మాత్రం కోటీశ్వరులైన వారు, తమ భూముల విలువ మరిన్ని కోట్లు పలికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారు కోట్లు ఖర్చు చేసి పాదయాత్ర చేయగలుగుతున్నారు. నిజంగానే భూములు రాజధానికి ఇవ్వడం త్యాగమైతే, వారు కోట్లు ఖర్చు చేసి పాదయాత్రలు చేయగలరా? బౌన్సర్లను పెట్టుకుని నడవగలరా? తమకు ఆది, బెంజ్ వంటి కారులు ఉంటే ఏమిటని డిబేట్లలో ఏ మాత్రం భేషజం లేకుండా మాట్లాడగలరా? ప్రభుత్వం ఏటా ఈ రైతులకు ఎకరా ఏభై వేల రూపాయల చొప్పున కౌలు చేల్లిస్తోంది. వారికి కాణి ఖర్చు లేదు. రిస్కు లేదు.
పొలం వెళ్లకుండానే కౌలు పొందుతున్నారు. అంతవరకు అభ్యంతరం లేదు. కాకపోతే వారు రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు అనుగుణంగా డిమాండ్లు పెట్టి ఉద్యమం చేస్తున్నామని చెప్పడం, వారిది మహోద్యమమని, ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు ప్రచారం చేయడం , తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనసేన వంటి పార్టీలు వారికి మద్దతు ఇవ్వడం అంతా తమాషాగా ఉంది. దేశం అంతటా బీజేపీ, కాంగ్రెస్లు తీవ్ర వైరుధ్యంతో ఉన్నా, ఏపీలో మాత్రం ఈ విషయంలో అలయ్ భలయ్ నడుపుతున్నాయి. బీజేపీ పొడ అంటేనే గిట్టదని చెప్పే వామపక్షాలవారు ఏపీలో మాత్రం వారితో కలిసి చేతులెత్తుతున్నారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం ముప్పైనాలుగు వేల ఎకరాలు సమీకరిస్తున్నప్పుడు ఈ విపక్షాలన్నీ తీవ్రంగా విమర్శించేవి. ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు అని ప్రశ్నించేవి. అస్సైన్డ్ భూములను కొందరు నేతలు, దళారులు దోచేస్తున్నారని చెప్పేవి. రాజధాని అంతా స్కామ్ గా మార్చారని అనేవారు. చివరికి ప్రధాని మోడీ అంతటి ఆయన వచ్చి పోలవరం, అమరావతిలను చంద్రబాబు ఎటిమ్ లాగా చేసుకున్నారని ఆరోపించారు. కాని చిత్రంగా ఇప్పుడు వీరంతా తెలుగుదేశం పార్టీ వాదనను బలపరుస్తూ, పాదయాత్రకు సంఘీభావం చెబుతున్నారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా ససేమిరా అంటున్నారు. అసలు మొత్తం రాజధాని అంతా వెళ్లిపోతున్నట్లుగా వీరు ప్రచారం చేస్తున్నారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాయలసీమలో సెక్రటేరియట్, సి.ఎమ్. ఆఫీస్ పెట్టాలని..ఇలా వివిధ డిమాండ్ లు చేసిన బీజేపీ ఇప్పుడు నాలుక మడతేసింది. సీపీఐ రామకృష్ణ అనంతపురం లో 2018లో ఒక సభలో మాట్లాడుతూ , అన్నిటిని అమరావతిలోనే ఏర్పాటు చేస్తే మరి మిగిలిన ప్రాంతం సంగతేమిటని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాలను పట్టించుకోరా అని నిలదీశారు. కాని అదే రామకృష్ణ, తమ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి చంద్రబాబు విధానాలకు మద్దతు ఇస్తూ పాదయాత్రకు సంఘీభావం చెబుతున్నారు.
విభజన సమయంలో ఏపీ సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి, ప్రత్యేక హోదా గురించి ఎన్నడూ మాట్లాడని ఆమె తగుదునమ్మా అంటూ బయల్దేరి పాదయాత్రకు మద్దతు పలికారు. కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేషే స్వయంగా అమరావతి జేఏసీ నేత ఒకరితో అమరావతి కమ్మరావతిగా మారిందని అంటే వీరెవ్వరూ దానికి సమాధానం చెప్పలేకపోయారు. తెలుగుదేశం పార్టీ పన్నిన వ్యూహంలో వీరంతా చిక్కుకున్నారో, లేక టీడీపీ వెంట వెళితే ఏమైనా ఉపయోగం ఉంటుందని అనుకున్నారో తెలియదు కాని, వారు కూడా రాజధానిపై తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. అభిప్రాయాలను చిత్తశుద్దితో మార్చుకుంటే తప్పు కాదు. కాని దానికి వివరణ ఇవ్వగలగాలి. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి ప్రాంతంలో రాజధాని ఎందుకు వద్దన్న విషయాన్ని విస్మరించి వీరంతా కోట్ల వ్యయంతో సాగుతున్న పాదయాత్రను సపోర్టు చేస్తున్నారు.
నిజంగానే రాజధాని రైతులకు ఏవైనా నష్టం జరుగుతుంటే కచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. అలాగే అక్కడ ఏ అభివృద్ది చేస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే,అందుకు సమాదానం ఇవ్వాలి. కాని ఈ ఆందోళనకారులు కాని, ఈ రాజకీయ పక్షాలు కాని ఆ విషయం మాట్లాడడం లేదు. కేవలం ఏక వ్యాఖ్య డిమాండ్‌తో కధ నడుపుతున్నాయి. ఒకరకంగా ఇది ప్రభుత్వానికి అనుకూలంశంగా భావించాలి. అమరావతి గ్రామాల అభివృద్దికి సంబంధించి ప్రణాళికపై ముందుకు వెళ్లవలసిన పని లేకుండా విపక్షాలు చేస్తున్నాయి. అంతేకాదు. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా అబివృద్ది పని చేపట్టినా, అందుకు నిధుల సమీకరణకు ప్లాన్ చేసినా, వెంటనే కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకువస్తున్నారు. తాము తమ పరపతిని బాగా వాడుకోగలుగుతున్నామని, టీడీపీ కాని రైతుల ముసుగులో ఉన్న ఆందోళనకారులు కాని భావిస్తే అది వారి తెలివితక్కువతనం అవుతుంది. వీరు అబివృద్ది పనులను అడ్డుకునే కొద్ది ప్రభుత్వానికి ఆ మేరకు బాధ్యత తగ్గుతుందన్న సంగతి వీరు మర్చిపోతున్నారు. ఇక రాజధానిలో జరిగిన స్కామ్‌ల గురించి విపక్షాలు మాట్లాడకపోవడం కూడా గమనించదగిన అంశమే.
సుమారు 1100 ఎకరాలు అస్సైన్డ్ భూమిని అప్పనంగా కాజేశారన్న అభియోగాలపై సిఐడి విచారణ చేసి పలువురిని అరెస్టు చేసింది. మాజీ మంత్రి పి.నారాయణ పై కూడా కేసు నమోదు చేసింది. వారికి నిర్ణీత నిబంధన కింద నోటీసులు ఇచ్చి కేసు దర్యాప్తు చేయాలని కోర్టు సూచించింది. సిఐడి కాని, మరే దర్యాప్తు సంస్థ అయినా, కోర్టులలో కేసుల పరిస్థితిని కూడా గమనంలోకి తీసుకుని ఇలాంటి విషయాలలో ముందుకు వెళ్లాలి.ఇది వేరే విషయం. ప్రస్తుతం బీజేపీలో ముఖ్యనేతగా ఉన్న మాజీ ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కొన్నేళ్ల క్రితం ఇది ఎవరి రాజధాని ?అని ప్రశ్నిస్తూ ఒక పుస్తకం రాశారు. అమరావతి పేరుతో 29 గ్రామాలలో ఆనాటి ప్రభుత్వం చేసిన దారుణాలనండి, సృష్టించిన వివాదాలన్నిటిని ఆయన అందులో పేర్కొన్నారు. ఆ పుస్తక ఆవిష్కరణ సభలో సీపీఎం నేత మధు మాట్లాడుతూ తాము రాజధాని ప్రాంతంలో పర్యటించామని, అస్సైన్డ్ భూముల కుంభకోణం అంతా, ఇంతాకాదని, దళితులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వాపోయారు.
అలాంటివారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఆ స్కామ్ లపై చర్య తీసుకుంటుంటే ఎంతవరకు మద్దతు ఇస్తున్నారో తెలియదు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ స్కామ్ లపై పెద్దగా స్పందించకుండా జాగ్రత్తపడుతున్నట్లుగా ఉంది. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని వాదించే టీడీపీ కోర్టుల నుంచి ఆ విషయంలో రక్షణ పొందడంలో సఫలం అయింది. కాని అదే సమయంలో దళితుల భూములను టీడీపీ నేతలు, దళారులు అక్రమంగా లేదా భయపెట్టి కారు చౌకగా కొనుగోలు చేసిన స్కామ్ లపై నోరు మెదపడం లేదు. పాదయాత్రలో పాల్గొంటున్న రైతులు కాని, వారికి సంఘీబావం చెబుతున్న ఆయా రాజకీయ పక్షాల నేతలు కాని దళితుల భూముల గురించి మాట్లాడకపోవడం వైఫల్యం కిందకు రాదా? అమరావతి అంటేనే స్కామ్ అన్న అభిప్రాయాన్ని వారు ఇంతవరకు పూర్వపక్షం చేయలేకపోయారు. రైతుల పాదయాత్ర రోజునే ప్రభుత్వం ఈ స్కామ్ లను బయటపెట్డడం వ్యూహ త్మకమే కావచ్చు.కాని కేవలం స్కాముల కేసుల నుంచి తప్పించుకోవడానికి, అమరావతి పేరుతో రాజకీయ ప్రయోజనం పొందడానికి తెలుగుదేశం పార్టీ యత్నిస్తున్నప్పుడు వైసిపి ప్రభుత్వం ఈ మాత్రం ప్రతి వ్యూహం అమలు చేయలేదా?
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment