సమీక్ష లో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు. చిత్రంలో వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తదితరులు
సాక్షి, అమరావతి: గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దళారుల ప్రమేయం లేకుండా పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. పత్తి సేకరణకు సంబంధించిన విధివిధానాలపై వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి ఆయన మంగళవారం మార్క్‌ఫెడ్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను పారదర్శకంగా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల నుంచి సేకరించిన పత్తిని కొనుగోలు కేంద్రాల నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రాల వరకు సరఫరా చేసేందుకు రవాణా చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని గుర్తుచేశారు.
ఇందుకోసం గతేడాది రూ.86.62 లక్షలు ఖర్చు చేసిందన్నారు. గతేడాది ఒక్క రైతు కూడా ఇబ్బందిపడకుండా సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయించామన్నారు. అదేరీతిలో ఈ ఏడాది కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది 11 ఏఎంసీలు, 73 జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా పత్తి సేకరిస్తే ఈ ఏడాది 50 ఏఎంసీలు, 73 జిన్నింగ్ మిల్లుల వద్ద సేకరిస్తున్నట్లు తెలిపారు. పత్తిని సేకరించే జిన్నింగ్ మిల్లుల సంఖ్యను మరింత పెంచాలని కోరామన్నారు. ఈ కేంద్రాల వద్ద దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మేలు చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు.
ఈ–పంట ఆధారంగా సీఎం యాప్ ద్వారా వాస్తవ సాగుదారుల నుంచి నేరుగా పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉంటాయన్నారు. సీసీఐ నిబంధనల మేరకు కనీస మద్దతు ధరలకు పత్తి సేకరణ జరుగుతుందన్నారు. వాస్తవ సాగుదారులు కాకుండా పత్తిని ఎవరు తీసుకొచ్చినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆధార్ అనుసంధాన రైతుల బ్యాంక్ ఖాతాల్లో మాత్రమే నగదు చెల్లింపులు జరిగేలా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, మత్స్యశాఖల కమిషనర్లు అరుణ్‌కుమార్, శ్రీధర్, ప్రద్యుమ్న, కన్నబాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్, సీసీఐ ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment