
కాకినాడ సిటీ: ఉభయ గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి రెండో పంటకు సైతం సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. శనివారం కాకినాడలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఏడు స్థాయీ సంఘాల ఎన్నికలకు సంబంధించి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, జ్యోతుల చంటిబాబుతో కలసి కన్నబాబు మీడియాతో మాట్లాడారు.
గోదావరిలో నీటి నిల్వలు తగ్గిన దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో రెండో పంట సాగునీటి అవసరాలకు 18 టీఎంసీల నీటి కొరత ఏర్పడుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారన్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి రెండో పంట రబీలో చివరి ఎకరాకు సైతం సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ తొలగిన వెంటనే రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో రాజమహేంద్రవరంలో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి నీటి పంపిణీపై చర్చిస్తామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఇటీవల అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఈ క్రాప్ బుకింగ్ ద్వారా నమోదు చేసి.. రైతులు నష్టపోకుండా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment