సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని విత్తన హబ్‌గా తీర్చిదిద్దేందుకు త్వరలో నూతన విత్తన పాలసీని తీసుకొస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. నాణ్యమైన విత్తనోత్పత్తే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఇక నుంచి రాష్ట్రంలో సాగయ్యే ప్రతి ఎకరాకు సర్టిఫై చేసిన విత్తనం మాత్రమే సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నూతన విత్తన పాలసీ, ఖరీఫ్ సాగు, వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఇక నుంచి ప్రతి విత్తనం ఆర్‌బీకేల ద్వారానే పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. విత్తనాలు పండించే రైతులు, కంపెనీల వివరాలు ఆర్‌బీకేల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రాచుర్యం పొందిన హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని విత్తన హబ్‌గా తీర్చిదిద్దడమే కాకుండా ఇతర రాష్ట్రాలకూ మార్కెటింగ్ చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
వర్షాలతో ఒక్క రైతూ నష్టపోకూడదు..
వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు అండగా నిలవాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు. వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా క్షేత్ర స్థాయి సిబ్బందితో మాట్లాడారు. వర్షాల వల్ల ఏ ఒక్క రైతూ నష్టపోకూడదని స్పష్టం చేశారు. వర్షాలు తగ్గిన వెంటనే నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశాలిచ్చారు. సమీక్షలో ఉద్యాన శాఖæ కమిషనర్ శ్రీధర్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్‌బాబు, సీడ్స్ సర్టిఫికేషన్ డైరెక్టర్ త్రివిక్రమ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment