seed hub
-
AP: విత్తన హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని విత్తన హబ్‌గా తీర్చిదిద్దేందుకు త్వరలో నూతన విత్తన పాలసీని తీసుకొస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. నాణ్యమైన విత్తనోత్పత్తే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఇక నుంచి రాష్ట్రంలో సాగయ్యే ప్రతి ఎకరాకు సర్టిఫై చేసిన విత్తనం మాత్రమే సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నూతన విత్తన పాలసీ, ఖరీఫ్ సాగు, వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి ప్రతి విత్తనం ఆర్బీకేల ద్వారానే పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. విత్తనాలు పండించే రైతులు, కంపెనీల వివరాలు ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రాచుర్యం పొందిన హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని విత్తన హబ్‌గా తీర్చిదిద్దడమే కాకుండా ఇతర రాష్ట్రాలకూ మార్కెటింగ్ చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో ఒక్క రైతూ నష్టపోకూడదు.. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు అండగా నిలవాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు. వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా క్షేత్ర స్థాయి సిబ్బందితో మాట్లాడారు. వర్షాల వల్ల ఏ ఒక్క రైతూ నష్టపోకూడదని స్పష్టం చేశారు. వర్షాలు తగ్గిన వెంటనే నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశాలిచ్చారు. సమీక్షలో ఉద్యాన శాఖæ కమిషనర్ శ్రీధర్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్‌బాబు, సీడ్స్ సర్టిఫికేషన్ డైరెక్టర్ త్రివిక్రమ్ పాల్గొన్నారు. -
వచ్చే ఏడాదికి విమానాశ్రయం పూర్తి
► విద్యుత్ చార్జీలు పెంచం.. వీలైతే తగ్గిస్తాం ► అభివృద్ధికి అ డ్డుతగిలితే చూస్తూ ఊరుకోం ► బెస్ట్ అవైలబుల్ స్కూల్‌గా భాలబారతి పాఠశాల ► ఓర్వకల్లు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ► ఎమ్మెల్యే గౌరు చరితకు దక్కని ప్రసంగ అవకాశం కల్లూరు/ఓర్వకల్లు : వచ్చే ఏడాది కల్లా ఓర్వకల్లులో ఎయిర్పోర్ట్ పూర్తి చేసి విమానాలను ఎగిరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఓర్వకల్లులో విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత మండల కేంద్రంలో రూ 6.50 కోట్ల వ్యయంతో పొదుపు మహిళలు నిర్మించిన బాలభారతి హైస్కూల్ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన మహిళా సాధికారత, పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై చైతన్య సదస్సుæ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మైనింగ్‌కు సంబంధించిన వివాదాన్ని విమానాశ్రయ నిర్మాణానికి లింక్ పెట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమన్నారు. కర్నూలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బాలభారతి హైస్కూల్‌ను బెస్ట్ అవైలబుల్ స్కూల్‌గా ఎంపిక చేసి ప్రతి ఏటా 25 మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశం కల్పిస్తామన్నారు. గని గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్దదన్నారు. భవిష్యత్‌తో విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని, వీలైతే తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. పాలేకర్ స్ఫూర్తితో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని 50 క్లస్టర్లలో విస్తరింపజేస్తామన్నారు. నంద్యాల ప్రాంతాన్ని సీడ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సీఎం పరిశీలించి వాటి ప్రగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం 1,653 మహిళా సంఘాలకు రూ 41.73 కోట్ల రుణం మంజూరు చెక్‌ను మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరితకు ప్రసంగించే అవకాశం కల్పించలేదు. పాణ్యం నియోజకవర్గం లో అభివృద్ధి పనులు చేపడుతూ..స్థానిక ఎమ్మెల్యేకు ప్రసంగించే అవకాశం ఇవ్వక పోవడంపై విమర్శలు వచ్చాయి. శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జున రెడ్డి, సర్పంచ్ పెద్దయ్య పాల్గొన్నారు. -
సీడ్‌హబ్‌గా రెడ్డిపల్లి కేవీకే
అనంతపురం అగ్రికల్చర్ : రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సీడ్‌హబ్‌గా మార్చనున్నారని కో ఆర్డినేటర్ డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెడ్డిపల్లి కేవీకేను సీడ్‌హబ్‌గా చేస్తామంటూ ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రధానంగా ఖరీఫ్‌లో కంది రకాలు, రబీలో పప్పుశనగ పంట అభివృద్ధికి విస్తృతమైన పరిశోధనలు, మిగతా విత్తనాలపై కూడా ప్రయోగాలు, పరిశోధనలు ఉంటాయన్నారు. అందుకోసం ప్రత్యేకంగా మౌలిక వసతుల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది అవసరం ఉంటుందని తెలిపారు. దీనిపై త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని ఆయన తెలిపారు. -
సీడ్ హబ్‌గా నంద్యాల
నంద్యాల: నంద్యాలను సీడ్ హబ్‌గా మార్చడంపై జిల్లా కలెక్టర్ దృష్టిసారించారు. అందులో భాగంగా ఈనెల 22వ తేదీన నంద్యాల పట్టణంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. కర్నూలులో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాలను సీడ్ హబ్‌గా మార్చుతానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఇక్కడ సీడ్ హబ్‌గా మార్చడానికున్న అవకాశాలపై నివేదికను తయారు చేయాలని నిర్ణయించారు. నంద్యాల పట్టణంలో అన్ని రకాల సీడ్ తయారీకి అవకాశాలు ఉండటంతో పాటు మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు చెందిన కంపెనీలు కూడా ఇక్కడ మకాం వేసి గత రెండు మూడు దశాబ్దాల నుంచి సీడ్‌ను తయారు చేస్తున్నా యి. ప్రైవేటు సంస్థల్లాగానే ప్రభుత్వ సంస్థ ఇక్కడ ఎందుకు సీడ్ తయారీ చేయకూడదని ముఖ్యమంత్రి భావించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేగాక ఇప్పటికే నేషనల్ సీడ్ కార్యాలయం ఒకటి ఇక్కడ ఉంది. భారత దేశంలోని అన్ని రాష్ట్రాలకు వేరుశనగ, కందులు, జనుము, మినుములు తదితర వాటిని తయారు చేసి పంపుతున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని సీడ్‌హబ్‌గా ఈ ప్రాంతాన్ని మార్చేందుకు స్థానిక అధికారులతో జిల్లా కలెక్టర్ చర్చించనున్నారు. స్థానిక వైఎస్సార్ భవనంలో జరిగే ఈ సమావేశానికి వ్యవసాయ అధికారులతో పాటు పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు సీడ్ తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రైవేటు సంస్థల ప్రతినిధులను సైతం ఆహ్వానిస్తున్నారు.