వచ్చే ఏడాదికి విమానాశ్రయం పూర్తి
► విద్యుత్ చార్జీలు పెంచం.. వీలైతే తగ్గిస్తాం
► అభివృద్ధికి అ డ్డుతగిలితే చూస్తూ ఊరుకోం
► బెస్ట్ అవైలబుల్ స్కూల్‌గా భాలబారతి పాఠశాల
► ఓర్వకల్లు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు
► ఎమ్మెల్యే గౌరు చరితకు దక్కని ప్రసంగ అవకాశం
కల్లూరు/ఓర్వకల్లు :
వచ్చే ఏడాది కల్లా ఓర్వకల్లులో ఎయిర్‌పోర్ట్ పూర్తి చేసి విమానాలను ఎగిరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఓర్వకల్లులో విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత మండల కేంద్రంలో రూ 6.50 కోట్ల వ్యయంతో పొదుపు మహిళలు నిర్మించిన బాలభారతి హైస్కూల్ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించారు.
అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన మహిళా సాధికారత, పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై చైతన్య సదస్సుæ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మైనింగ్‌కు సంబంధించిన వివాదాన్ని విమానాశ్రయ నిర్మాణానికి లింక్ పెట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమన్నారు. కర్నూలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బాలభారతి హైస్కూల్‌ను బెస్ట్ అవైలబుల్ స్కూల్‌గా ఎంపిక చేసి ప్రతి ఏటా 25 మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశం కల్పిస్తామన్నారు.
గని గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్దదన్నారు. భవిష్యత్‌తో విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని, వీలైతే తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. పాలేకర్ స్ఫూర్తితో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని 50 క్లస్టర్లలో విస్తరింపజేస్తామన్నారు. నంద్యాల ప్రాంతాన్ని సీడ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సీఎం పరిశీలించి వాటి ప్రగతిని గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం 1,653 మహిళా సంఘాలకు రూ 41.73 కోట్ల రుణం మంజూరు చెక్‌ను మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరితకు ప్రసంగించే అవకాశం కల్పించలేదు. పాణ్యం నియోజకవర్గం లో అభివృద్ధి పనులు చేపడుతూ..స్థానిక ఎమ్మెల్యేకు ప్రసంగించే అవకాశం ఇవ్వక పోవడంపై విమర్శలు వచ్చాయి. శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జున రెడ్డి, సర్పంచ్ పెద్దయ్య పాల్గొన్నారు.