నంద్యాల: నంద్యాలను సీడ్ హబ్‌గా మార్చడంపై జిల్లా కలెక్టర్ దృష్టిసారించారు. అందులో భాగంగా ఈనెల 22వ తేదీన నంద్యాల పట్టణంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. కర్నూలులో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాలను సీడ్ హబ్‌గా మార్చుతానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఇక్కడ సీడ్ హబ్‌గా మార్చడానికున్న అవకాశాలపై నివేదికను తయారు చేయాలని నిర్ణయించారు.
నంద్యాల పట్టణంలో అన్ని రకాల సీడ్ తయారీకి అవకాశాలు ఉండటంతో పాటు మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు చెందిన కంపెనీలు కూడా ఇక్కడ మకాం వేసి గత రెండు మూడు దశాబ్దాల నుంచి సీడ్‌ను తయారు చేస్తున్నా యి. ప్రైవేటు సంస్థల్లాగానే ప్రభుత్వ సంస్థ ఇక్కడ ఎందుకు సీడ్ తయారీ చేయకూడదని ముఖ్యమంత్రి భావించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేగాక ఇప్పటికే నేషనల్ సీడ్ కార్యాలయం ఒకటి ఇక్కడ ఉంది. భారత దేశంలోని అన్ని రాష్ట్రాలకు వేరుశనగ, కందులు, జనుము, మినుములు తదితర వాటిని తయారు చేసి పంపుతున్నారు.
వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని సీడ్‌హబ్‌గా ఈ ప్రాంతాన్ని మార్చేందుకు స్థానిక అధికారులతో జిల్లా కలెక్టర్ చర్చించనున్నారు. స్థానిక వైఎస్సార్ భవనంలో జరిగే ఈ సమావేశానికి వ్యవసాయ అధికారులతో పాటు పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు సీడ్ తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రైవేటు సంస్థల ప్రతినిధులను సైతం ఆహ్వానిస్తున్నారు.
సీడ్ హబ్‌గా నంద్యాల
Published Tue, Aug 19 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement