సాక్షి, నంద్యాల: దాదాపు ఆరు గంటల హైడ్రామా తర్వాత.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏ1గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ సమయంలో చంద్రబాబు నాయుడితో పాటు ఆయన లాయర్లు సీఐడీ అధికారులతో వాదనలకు దిగారు. ఈ తరుణంలో రిమాండ్ రిపోర్ట్ ద్వారా అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామని సీఐడీ అధికారులు చెప్పడంతో.. చంద్రబాబు చప్పుడు చేయకుండా అరెస్ట్ కావడానికి అంగీకరించారు.
‘‘ఎఫ్‌ఐఆర్ చేయలేదు. ఏదో జరిగిందని కేసు పెట్టారు. మీకూ, నాకు రాజ్యాంగం ఆధారం. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు. స్కిల్స్ స్కామ్‌లో నా పేరు ఎక్కడుందో చూపించండి. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు. ఆధారాలు ఉంటే ఉరి తీయండి. దర్యాప్తు అధికారి రాకుండా సూపర్ వైజర్ అధికారి రావడం ఏంటి?. మీరు చుట్టుముట్టి నన్ను బెదిరిస్తున్నారా?’’ అని చంద్రబాబు సీఐడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో..
‘‘విజయవాడ వెళ్లలోపు రిమాండ్ రిపోర్ట్ అందిస్తాం. ముందే రిమాండ్ ఇవ్వడం కుదరదు. రిమాండ్ రిపోర్ట్‌లోనే అన్ని విషయాలు ఉన్నాయి’’ అని ఏపీ సీఐడీ అధికారులు చెప్పారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. సంబంధం లేని సెక్షన్స్ నమోదు చేశారు. అరెస్ట్‌కు ముందే కేసు వివరాలు చెప్పాలంటూ చంద్రబాబు లాయర్లు పట్టుబట్టడంతో.. ‘‘చంద్రబాబు పాత్ర ఉందని హైకోర్టుకు చెప్పామ’’ని సీఐడీ పోలీసులు సమాధానం ఇచ్చారు.
దర్యాప్తు అధికారి రాకుండా మీరెందుకు వచ్చారు. నేను టెర్రరిస్టునా?. అన్న అర్ధరాత్రి పూట డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏంటి?. ప్రాథమిక ఆధారాల్లేకుండా న్ను ఎలా అరెస్ట్ చేస్తారు. మా పార్టీ వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. నన్ను ఎందుకు రిమాండ్ చేస్తున్నారో చెప్పి.. అరెస్ట్ చేసుకోండి. నా హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు అని బాబు మరోసారి వాగ్వాదానికి దిగారు. ఆ తరుణంలో..
‘‘మాకు అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల వరకు టైం ఉంటుంది. గడువులోగా కోర్టుకు అన్ని డాక్యుమెంట్లు ఇస్తాం. చంద్రబాబును ప్రశ్నించిన తర్వాతే పూర్తి రిమాండ్ రిపోర్ట్ ఇస్తాం’’ అని చంద్రబాబు తరపు న్యాయవాదులకు బదులిచ్చారు. ‘‘అరెస్టుకు ముందు ప్రాథమిక సాక్ష్యాలు అడుగుతున్నారు. అలా చూపించాలని చట్టంలో లేదు’’ అని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు.
నోటీసులు ఇలా..
స్కిల్ డెవలప్‌మెంట్‌లో.. చంద్రబాబు మీద నాన్‌బెయిలబుల్ వారెంట్ కింద కేసు నమోదు అయ్యింది. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1)(2) కింద నోటీసులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం. ఐపీసీ సెక్షన్ 120(B), 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109.. r/w 34, 37 ఐపీసీతో పాటు 12, 13(2) r/w 13(1)(c)&(d) అవినీతి నిరోధక శాఖ చట్టం 1988 సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. అరెస్ట్‌కు సంబంధించిన పేపర్లను చంద్రబాబుకు, లాయర్లకు ఇచ్చారు సీఐడీ పోలీసులు. గంట సేపు వాదించిన చంద్రబాబు, ఆయన తరపు లాయర్లు.. చివరకు సీఐడీ అధికారుల వివరణతో సంతకం చేసి అరెస్ట్‌కు ముందుకు వచ్చారు.
హాల్ వద్ద హైడ్రామా
నోటీసులతో ఏపీ సీఐడీ అధికారులు బస చేసిన జ్ఞానపురం ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. అయితే ఆయనకు భద్రత కల్పించే NSG అడ్డుకుంది. ఆ తర్వాత ప్రాంతంలో సీఐడీ అధికారులు లోపలికి వెళ్లారు. గంట సేపుల వాదోపవాదనల తర్వాత.. రిమాండ్ రిపోర్ట్‌లో అన్ని విషయాలు తెలియజేస్తామని చెప్పడంతో చంద్రబాబు అరెస్ట్ అయ్యేందుకు సిద్ధం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment