కూర్మన్నపాలెం నుంచి దువ్వాడ రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో రాళ్లు తేలిన రోడ్డు
అగనంపూడి: జీవీఎంసీ 86వ వార్డు కూర్మన్నపాలెం నుంచి రాజీవ్‌నగర్ కూడలి మీదుగా కుసుమ హరనాథ ఆశ్రమం మార్గంలోని రహదారి అధ్వానంగా ఉంది. రాళ్లు తేలి ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. పదేళ్లుగా ఇదే దుస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని వుడా ఫేజ్–1 కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1988లో వుడా ఫేజ్–1 కాలనీ ఏర్పాటయింది. అప్పట్లో నిర్మించిన రహదారి పూర్తిగా రాళ్లు తేలి, ధ్వంసమైంది.
రెండు దశాబ్దాలుగా ఈ మార్గంలో వాహనాల రద్దీ పెరిగినా రోడ్డు విస్తరణ, మరమ్మతుల విషయంలో అధికారులు చొరవ తీసుకోలేదు. మరో వైపు రాజీవ్‌నగర్ నుంచి కూర్మన్నపాలెం వైపు వెళ్లే వాహనాలు, కూర్మన్నపాలెం నుంచి దువ్వాడ రైల్వేస్టేషన్‌కు వెళ్లే వాహనాలను కూడా ఈ మార్గంలోకి మళ్లించారు. అలాగే కుసుమ హరనాథ ఆశ్రమానికి నిత్యం వందలాది భక్తులు వచ్చి వెళ్తారు. రోడ్డు విషయమై కుసుమ హరనాథ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదనలకే పరిమితం
అసోసియేషన్ దరఖాస్తులను పరిశీలించిన జీవీఎంసీ ఏడాదిన్నర క్రితం అంచనాలను రూపొందించింది. కానీ రహదారి నిర్మాణ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే రీతిలో ఉండడంతో కాలనీవాసులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ మేయర్, కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment