Aganampudi
-
చిన్నారిపై వీధి కుక్కల దాడి
అగనంపూడి: గ్రామ సింహాలు చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన విశాఖలో జరిగింది. జీవీఎంసీ 85వ వార్డు ఫార్మాసిటీ నిర్వాసిత కాలనీ పానకాలయ్యపేట బోనంగికి చెందిన సిద్ధనాతి నూక అప్పారావు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి అప్పారావు భార్య లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటుండగా, అప్పారావు పనిమీద బయటకు వెళ్లాడు.రోడ్డు మీద ఆడుకుంటున్న వీరి కుమార్తె యక్షిత (3)పై రెండు వీధి కుక్కలు దాడి చేయగా శరీరం వెనుక భాగం, మెడ, తలపై కూడా తీవ్రంగా గాట్లు పడ్డాయి. స్థానికులు కుక్కలను తరిమికొట్టి పాపను రక్షించి కేజీహెచ్‌కు తరలించారు. ప్రాణాపాయ స్థితి తప్పినట్లు వైద్యులు చెప్పారు. -
రాళ్లు తేలిన రహదారి
అగనంపూడి: జీవీఎంసీ 86వ వార్డు కూర్మన్నపాలెం నుంచి రాజీవ్‌నగర్ కూడలి మీదుగా కుసుమ హరనాథ ఆశ్రమం మార్గంలోని రహదారి అధ్వానంగా ఉంది. రాళ్లు తేలి ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. పదేళ్లుగా ఇదే దుస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని వుడా ఫేజ్–1 కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1988లో వుడా ఫేజ్–1 కాలనీ ఏర్పాటయింది. అప్పట్లో నిర్మించిన రహదారి పూర్తిగా రాళ్లు తేలి, ధ్వంసమైంది. రెండు దశాబ్దాలుగా ఈ మార్గంలో వాహనాల రద్దీ పెరిగినా రోడ్డు విస్తరణ, మరమ్మతుల విషయంలో అధికారులు చొరవ తీసుకోలేదు. మరో వైపు రాజీవ్‌నగర్ నుంచి కూర్మన్నపాలెం వైపు వెళ్లే వాహనాలు, కూర్మన్నపాలెం నుంచి దువ్వాడ రైల్వేస్టేషన్‌కు వెళ్లే వాహనాలను కూడా ఈ మార్గంలోకి మళ్లించారు. అలాగే కుసుమ హరనాథ ఆశ్రమానికి నిత్యం వందలాది భక్తులు వచ్చి వెళ్తారు. రోడ్డు విషయమై కుసుమ హరనాథ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలకే పరిమితం అసోసియేషన్ దరఖాస్తులను పరిశీలించిన జీవీఎంసీ ఏడాదిన్నర క్రితం అంచనాలను రూపొందించింది. కానీ రహదారి నిర్మాణ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే రీతిలో ఉండడంతో కాలనీవాసులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ మేయర్, కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
బాలికపై కామాంధుడి పైశాచికత్వం.. తండ్రి భయంతో
సాక్షి, అగనంపూడి (గాజువాక): అగనంపూడిలో దారుణం జరిగింది. కామాంధుడి పైశాచికత్వానికి 14 ఏళ్ల బాలిక బలైంది. నీలి చిత్రాలు చూపించి.. రెండు నెలలుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చివరకు తండ్రికి దొరికిపోతానేమోనన్న భయంతో ఆమె అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అగనంపూడి శనివాడకాలనీలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ప్రాథమిక విచారణలో సేకరించిన అంశాలను సౌత్ ఇన్చార్జి ఏసీపీ శ్రీరాముల శిరీష బుధవారం మీడియాకు వెల్లడించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డిపేటకు చెందిన పాండ్రంగి సత్యం భార్య, కుమారుడితో కలిసి శనివాడలోని సాయి ప్రణయ్ రెసిడెన్సీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో పెంట్‌హౌస్‌లో నివాసముంటున్నాడు. ఎదురుగా ఉన్న ఆదిత్య నివాస్‌లో సత్యం చెల్లెలు భర్త కూడా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. సత్యం కుమార్తె (14) అగనంపూడి హైస్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఆదిత్య నివాస్ మొదటి అంతస్తులో కార్పెంటరీ పనులు చేస్తున్న ఆరుగురు యువకులు నివాసముంటున్నారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన దిగుమర్తి నరేష్ గత జూలైలో ఇక్కడకు వచ్చాడు. అగనంపూడిలో ఇంటీరియర్ పనులు చేస్తున్నాడు. ఎదుట అపార్ట్మెంట్లో ఉన్న ఆమె ఫోన్ నంబర్ సంపాదించాడు. నీలి చిత్రాలు చూపించి.. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. రెండు నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. కాగా.. మంగళవారం రాత్రి సత్యం ఇంట్లో అందరూ నిద్రపోయిన సమయంలో నరేష్ బాలికకు ఫోన్ చేసి రమ్మని కోరడంతో ఆమె ఆదిత్య నివాస్లోకి వెళ్లింది. ఈ లోగా ఆమె తండ్రి బాత్రూమ్ కోసం లేవడం, కుమార్తె లేకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి అపార్ట్మెంట్ టెర్రస్‌పైన, కింద వెతికారు. ఆచూకీ లేకపోవడంతో ఎదురుగా ఉన్న బాలిక మేనత్త ఇంట్లో ఉందేమోనని వెళ్లి చూశారు. అక్కడ కూడా ఆమె లేకపోవడంతో ఏడుస్తూ.. కేకలు వేశారు. ఇది విన్న ఆమె.. నాన్నకు దొరికిపోతానేమోనన్న భయంతో అపార్ట్మెంట్ టెర్రస్‌పై నుంచి దూకేసింది. బాలిక మృతదేహం చూసి వారంతా షాక్‌కు గురయ్యారు. కుమార్తె మరణించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమార్తె మృతికి కారణమైన నరేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదిత్య నివాస్‌లో నివాసముంటున్న నరేష్‌తోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వేర్వేరుగా విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో నరేష్ రూమ్‌మేట్స్‌కు సంబంధం లేదని ప్రాథమిక విచారణలో తేలిందని ఇన్చార్జి ఏసీపీ తెలిపారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు, నిందితుడు వెల్లడించిన వివరాలు, ప్రాథమిక విచారణ మేరకు నరేష్‌పై లైంగిక దాడులు, అత్యాచారం, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఫోన్ డేటా విశ్లేషిస్తామని, ఫోరెన్సిక్ నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. సమావేశంలో దువ్వాడ సీఐ టి.లక్ష్మి, గాజువాక సీఐ మల్లేశ్వరరావు పాల్గొన్నారు. పరామర్శించిన నేతలు మృతురాలి తల్లిదండ్రులు, బంధువులను పలువురు నేతలు పరామర్శించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వి.అనిత, పల్లా శ్రీనివాసరావులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. బాధితుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రశాంతమైన అగనంపూడిలో ఇలాంటి సంఘటన దురదృష్టకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూస్తామని దేవన్‌రెడ్డి మృతురాలి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. -
వైఎస్సార్ సీపీ ఓట్లే లక్ష్యం
సాక్షి, అగనంపూడి: ప్రజాస్వామానికి మూలస్తంభం ఓటు హక్కు. నేడు ఆ ప్రజాస్వామ్యం పాలకపక్షం అక్రమాలతో ఖూనీ అవుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓటర్లను తొలగించడం ద్వారా అధికార పగ్గాలు మళ్లీ చేపట్టాలనే కుతంత్రంతో టీడీపీ నాయకులు అడ్డగోలుగా జాబితాల నుంచి ఓట్లు డిలేట్ చేసేస్తున్నారు. ఓటర్ల డిక్లరేషన్ (అనుమతి) లేకుండా తొలగించే ప్రక్రియకు అధికారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. దీంతో ప్రైవేటు ఏజెన్సీలకు చెందిన సర్వే బృందం ఓట్లను అడ్డగోలుగా తొలగిస్తున్నారు. చేర్పులు, తొలగింపులను బాధ్యతాయుతమైన వ్యక్తులకు అప్పగించడంలో ఎన్నికల సంఘం విఫలం కావడంతో బీఎల్ఓల సహకారంతో సర్వేల పేరుతో వారికి నచ్చని ఓట్లు తొలగించేస్తున్నారు. మూడు నెలల్లో 500 ఓట్లు గల్లంతు.. ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న తెలుగుదేశం పార్టీ వచ్చే సాధారణ ఎన్నికల్లో అడ్డదారిలో గెలవడానికి ప్రతిపక్ష పార్టీ ఓట్ల తొలగింపునకు విఫలయత్నం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అరకోటి ఓట్లను తొలగించినట్టు ఒక స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది. గాజువాక నియోజకవర్గంలో సుమారు 23వేల ఓట్లు తొలగింపునకు గురవ్వగా, 53వ వార్డులో మూడు మాసాల్లో ఐదు వందల ఓట్లు గల్లంతు చేసేశారు. గత సెప్టెంబర్‌లో జిల్లా అధికారులు విడుదల చేసిన జాబితాలో 19712 ఓట్లు ఉండగా, జనవరి – ఫిబ్రవరిలో విడుదల చేసిన జాబితాలో 19200కు తగ్గాయి.ఈ తొలగించిన వాటిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల ఓట్లే అధికంగా ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు పురమాయించిన సర్వే బృందం వీటిని తొలగించింది. ముఖ్యమైన వారి ఓట్ల తొలగింపు తొలగించిన వాటిలో ఎక్కువగా వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులకు చెందిన ఓట్లు ఉన్నాయి. కణితి కాలింగ వీధికి చెందిన దాకా రాజగోపాలరావు వైఎస్సారీసీపీలో కీలకంగా ఉన్నారు. ఆయన ఓటు తొలగించేశారు. అలాగే వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు చిత్రాడ వెంకటరమణ సోదరుని కుమారుడు వెంకటేష్, వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా తొలగించారు. అప్పికొండ ప్రాంతానికి చెందిన రొంగలి సూర్యప్రకాష్‌రావు, అతని భార్య కృష్ణవేణి ఓట్లను కూడా తొలగించారు. ఇలా ఐదు వందల వరకు ఓట్లు గల్లంతు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానించాలి ఓటరుగా హక్కు పొందాలంటే విధిగా ఆధారతో అనుసంధానం చేయాలి. లేదా ఐరిష్ ద్వారా నమోదు చేయాలి. ఎన్నికల సంఘం ఈ విషయంలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదు. ఒక వ్యక్తి ఓటు రెండు మూడు చోట్ల నమోదవుతుండడంతో వాస్తవ లెక్కలు తెలియడం లేదు. ఆధార్‌తో అనుసంధానంతో వీటికి కల్లెం వేయవచ్చు. – ప్రగడ వేణుబాబు, జిల్లా కార్యదర్శి, వైఎస్సార్సీపీ తొలగింపునకు మార్గదర్శకాలుండాలి ఒక వ్యక్తికి చెందిన ఓటు తొలగించే సమయంలో ఆ వ్యక్తి సమ్మతి ఉందా..? లేదా..?, సదరు ఓటును ఎందుకు తొలగించాల్సి వచ్చిందో..? వంటి ప్రకియ చేపడితే ఇలా అక్రమ తొలగింపులకు అవకాశం ఉండదు. ఓటరుగా నమోదు, తొలగింపునకు ఎవరికి పడితే వారికి అవకాశం కల్పించడం వల్లే అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. – చిత్రాడ వెంకటరమణ, వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు తొలగించిన వారిని శిక్షించాలి యూజర్ ఐడీ, పాస్వర్డ్ లేకుండా తొలగింపు సాధ్యం కానప్పుడు ఎవరి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా ఓట్ల తొలగింపులు చేపట్టారో గుర్తించి వారిని జైలుకి పంపించాలి. కఠినంగా వ్యవహరిస్తే ఓటర్లకు టెన్షన్ తప్పుతుంది. లేకపోతే ఇష్టారాజ్యంగా అధికార పార్టీ వారికి నచ్చని ఓట్లను తొలగించుకుంటూ పోతే ఎన్నికల సంఘంపై నమ్మకం పోతుంది . – దుగ్గపు దానప్పలు, నిర్వాసితుల సంఘం నాయకులు -
ఎస్బీఐ అసిస్టెంట్ అకౌంటెంట్ ఆత్మహత్మ
అగనంపూడి (విశాఖపట్నం జిల్లా) : స్టేట్ బ్యాంక్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మాచేపల్లి తారకేశ్వరరావు(45) హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సిబ్బంది వేధింపుల వల్లే తమ కుమారుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని మృతుని తల్లితండ్రులు మాచేపల్లి తులసమ్మ, రాములు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా... మాచేపల్లి తులసమ్మ, రాములు 15 ఏళ్ల క్రితం విశాఖపట్నం జిల్లాలోని అగనంపూడి బీసీ కాలనీలకి వచ్చి నివాసముంటున్నారు. వీరి కుమారుడు తారకేశ్వరరావు ఎక్స్ సర్వీస్మన్(వైమానికదళం) కోటాలో ఎస్బీఐలో ఉద్యోగం పొందాడు. అగనంపూడి ఎస్బీఐలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ, యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. కార్యాలయానికి ఆలస్యంగా వచ్చే సిబ్బందిని ప్రశ్నించేవాడు. దీంతో సిబ్బందితో మనస్పర్థలు ఏర్పడి మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం సమీపంలోని లంకెలపాలెం బ్రాంచికు బదిలీ అయ్యాడు. అప్పట్నుంచి తరచూ సెలవులో ఉంటున్న అతడు ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని తుషారాబాద్లో ఉంటున్న తన బావ కోసూరు మల్లికార్జునరావు ఇంటికి వెళ్లాడు. 23వ తేదీ ఉదయం వాకింగ్‌కు వె ళ్లొస్తానని చెప్పి వెళ్లిన తారకేశ్వరరావు తన బావకు ఫోన్ చేసి తాను హుస్సేన్‌సాగర్ వద్ద ఉన్నానని చెప్పాడు. తరువాత ఫోన్ స్విచాఫ్ చేసి హుస్సేన్‌సాగర్‌లో దూకేశాడు. అతని బావ హుస్సేన్ సాగర్ వద్దకు వచ్చి చూసేసరికి తారకేశ్వరరావు అక్కడ లేకపోవడం, ఇంటికి కూడా చేరకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం హుస్సేన్‌సాగర్‌లో మృతదేహం తేలి ఉన్న సమాచారం మేరకు తారకేష్ బావకు పోలీసులు కబురుపెట్టారు. మృతదేహం తారకేష్దిగా గుర్తించడంతో అగనంపూడిలో ఉంటున్న మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలియడంతో అగనంపూడిలో తల్లిదండ్రులు, భార్య, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
టోల్‌గేట్‌ను ఢీకొన్న లారీ: ఉద్యోగి మృతి
విశాఖపట్నం: అగనంపుడి టోల్గేట్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. లారీ టోల్‌గేట్‌ను ఢీకొనడంతో టోల్గేట్ ఉద్యోగి ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.