ఎస్‌బీఐ అసిస్టెంట్ అకౌంటెంట్ ఆత్మహత్మ
అగనంపూడి (విశాఖపట్నం జిల్లా) : స్టేట్ బ్యాంక్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మాచేపల్లి తారకేశ్వరరావు(45) హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సిబ్బంది వేధింపుల వల్లే తమ కుమారుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని మృతుని తల్లితండ్రులు మాచేపల్లి తులసమ్మ, రాములు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా... మాచేపల్లి తులసమ్మ, రాములు 15 ఏళ్ల క్రితం విశాఖపట్నం జిల్లాలోని అగనంపూడి బీసీ కాలనీలకి వచ్చి నివాసముంటున్నారు. వీరి కుమారుడు తారకేశ్వరరావు ఎక్స్ సర్వీస్‌మన్(వైమానికదళం) కోటాలో ఎస్‌బీఐలో ఉద్యోగం పొందాడు.
అగనంపూడి ఎస్‌బీఐలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ, యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. కార్యాలయానికి ఆలస్యంగా వచ్చే సిబ్బందిని ప్రశ్నించేవాడు. దీంతో సిబ్బందితో మనస్పర్థలు ఏర్పడి మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం సమీపంలోని లంకెలపాలెం బ్రాంచికు బదిలీ అయ్యాడు. అప్పట్నుంచి తరచూ సెలవులో ఉంటున్న అతడు ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని తుషారాబాద్‌లో ఉంటున్న తన బావ కోసూరు మల్లికార్జునరావు ఇంటికి వెళ్లాడు. 23వ తేదీ ఉదయం వాకింగ్‌కు వె ళ్లొస్తానని చెప్పి వెళ్లిన తారకేశ్వరరావు తన బావకు ఫోన్ చేసి తాను హుస్సేన్‌సాగర్ వద్ద ఉన్నానని చెప్పాడు.
తరువాత ఫోన్ స్విచాఫ్ చేసి హుస్సేన్‌సాగర్‌లో దూకేశాడు. అతని బావ హుస్సేన్ సాగర్ వద్దకు వచ్చి చూసేసరికి తారకేశ్వరరావు అక్కడ లేకపోవడం, ఇంటికి కూడా చేరకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం హుస్సేన్‌సాగర్‌లో మృతదేహం తేలి ఉన్న సమాచారం మేరకు తారకేష్ బావకు పోలీసులు కబురుపెట్టారు. మృతదేహం తారకేష్‌దిగా గుర్తించడంతో అగనంపూడిలో ఉంటున్న మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలియడంతో అగనంపూడిలో తల్లిదండ్రులు, భార్య, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.