సాక్షి, అగనంపూడి: ప్రజాస్వామానికి మూలస్తంభం ఓటు హక్కు. నేడు ఆ ప్రజాస్వామ్యం పాలకపక్షం అక్రమాలతో ఖూనీ అవుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓటర్లను తొలగించడం ద్వారా అధికార పగ్గాలు మళ్లీ చేపట్టాలనే కుతంత్రంతో టీడీపీ నాయకులు అడ్డగోలుగా జాబితాల నుంచి ఓట్లు డిలేట్ చేసేస్తున్నారు. ఓటర్ల డిక్లరేషన్ (అనుమతి) లేకుండా తొలగించే ప్రక్రియకు అధికారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. దీంతో ప్రైవేటు ఏజెన్సీలకు చెందిన సర్వే బృందం ఓట్లను అడ్డగోలుగా తొలగిస్తున్నారు. చేర్పులు, తొలగింపులను బాధ్యతాయుతమైన వ్యక్తులకు అప్పగించడంలో ఎన్నికల సంఘం విఫలం కావడంతో బీఎల్‌ఓల సహకారంతో సర్వేల పేరుతో వారికి నచ్చని ఓట్లు తొలగించేస్తున్నారు.
మూడు నెలల్లో 500 ఓట్లు గల్లంతు..
ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న తెలుగుదేశం పార్టీ వచ్చే సాధారణ ఎన్నికల్లో అడ్డదారిలో గెలవడానికి ప్రతిపక్ష పార్టీ ఓట్ల తొలగింపునకు విఫలయత్నం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అరకోటి ఓట్లను తొలగించినట్టు ఒక స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది. గాజువాక నియోజకవర్గంలో సుమారు 23వేల ఓట్లు తొలగింపునకు గురవ్వగా, 53వ వార్డులో మూడు మాసాల్లో ఐదు వందల ఓట్లు గల్లంతు చేసేశారు. గత సెప్టెంబర్‌లో జిల్లా అధికారులు విడుదల చేసిన జాబితాలో 19712 ఓట్లు ఉండగా, జనవరి – ఫిబ్రవరిలో విడుదల చేసిన జాబితాలో 19200కు తగ్గాయి.ఈ తొలగించిన వాటిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకుల ఓట్లే అధికంగా ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు పురమాయించిన సర్వే బృందం వీటిని తొలగించింది.
ముఖ్యమైన వారి ఓట్ల తొలగింపు
తొలగించిన వాటిలో ఎక్కువగా వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులకు చెందిన ఓట్లు ఉన్నాయి. కణితి కాలింగ వీధికి చెందిన దాకా రాజగోపాలరావు వైఎస్సారీసీపీలో కీలకంగా ఉన్నారు. ఆయన ఓటు తొలగించేశారు. అలాగే వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు చిత్రాడ వెంకటరమణ సోదరుని కుమారుడు వెంకటేష్, వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా తొలగించారు. అప్పికొండ ప్రాంతానికి చెందిన రొంగలి సూర్యప్రకాష్‌రావు, అతని భార్య కృష్ణవేణి ఓట్లను కూడా తొలగించారు. ఇలా ఐదు వందల వరకు ఓట్లు గల్లంతు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆధార్‌తో అనుసంధానించాలి
ఓటరుగా హక్కు పొందాలంటే విధిగా ఆధారతో అనుసంధానం చేయాలి. లేదా ఐరిష్ ద్వారా నమోదు చేయాలి. ఎన్నికల సంఘం ఈ విషయంలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదు. ఒక వ్యక్తి ఓటు రెండు మూడు చోట్ల నమోదవుతుండడంతో వాస్తవ లెక్కలు తెలియడం లేదు. ఆధార్‌తో అనుసంధానంతో వీటికి కల్లెం వేయవచ్చు.
– ప్రగడ వేణుబాబు, జిల్లా కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ
తొలగింపునకు మార్గదర్శకాలుండాలి
ఒక వ్యక్తికి చెందిన ఓటు తొలగించే సమయంలో ఆ వ్యక్తి సమ్మతి ఉందా..? లేదా..?, సదరు ఓటును ఎందుకు తొలగించాల్సి వచ్చిందో..? వంటి ప్రకియ చేపడితే ఇలా అక్రమ తొలగింపులకు అవకాశం ఉండదు. ఓటరుగా నమోదు, తొలగింపునకు ఎవరికి పడితే వారికి అవకాశం కల్పించడం వల్లే అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది.
– చిత్రాడ వెంకటరమణ, వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు
తొలగించిన వారిని శిక్షించాలి
యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లేకుండా తొలగింపు సాధ్యం కానప్పుడు ఎవరి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా ఓట్ల తొలగింపులు చేపట్టారో గుర్తించి వారిని జైలుకి పంపించాలి. కఠినంగా వ్యవహరిస్తే ఓటర్లకు టెన్షన్ తప్పుతుంది. లేకపోతే ఇష్టారాజ్యంగా అధికార పార్టీ వారికి నచ్చని ఓట్లను తొలగించుకుంటూ పోతే ఎన్నికల సంఘంపై నమ్మకం పోతుంది
.
– దుగ్గపు దానప్పలు, నిర్వాసితుల సంఘం నాయకులు
Comments
Please login to add a commentAdd a comment