కన్నీరు మున్నీరవుతున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు
సాక్షి, అగనంపూడి (గాజువాక): అగనంపూడిలో దారుణం జరిగింది. కామాంధుడి పైశాచికత్వానికి 14 ఏళ్ల బాలిక బలైంది. నీలి చిత్రాలు చూపించి.. రెండు నెలలుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చివరకు తండ్రికి దొరికిపోతానేమోనన్న భయంతో ఆమె అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అగనంపూడి శనివాడకాలనీలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ప్రాథమిక విచారణలో సేకరించిన అంశాలను సౌత్ ఇన్‌చార్జి ఏసీపీ శ్రీరాముల శిరీష బుధవారం మీడియాకు వెల్లడించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డిపేటకు చెందిన పాండ్రంగి సత్యం భార్య, కుమారుడితో కలిసి శనివాడలోని సాయి ప్రణయ్ రెసిడెన్సీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.
కుటుంబ సభ్యులతో పెంట్‌హౌస్‌లో నివాసముంటున్నాడు. ఎదురుగా ఉన్న ఆదిత్య నివాస్‌లో సత్యం చెల్లెలు భర్త కూడా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. సత్యం కుమార్తె (14) అగనంపూడి హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. ఆదిత్య నివాస్ మొదటి అంతస్తులో కార్పెంటరీ పనులు చేస్తున్న ఆరుగురు యువకులు నివాసముంటున్నారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన దిగుమర్తి నరేష్ గత జూలైలో ఇక్కడకు వచ్చాడు. అగనంపూడిలో ఇంటీరియర్ పనులు చేస్తున్నాడు. ఎదుట అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆమె ఫోన్ నంబర్ సంపాదించాడు. నీలి చిత్రాలు చూపించి.. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. రెండు నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
కాగా.. మంగళవారం రాత్రి సత్యం ఇంట్లో అందరూ నిద్రపోయిన సమయంలో నరేష్ బాలికకు ఫోన్ చేసి రమ్మని కోరడంతో ఆమె ఆదిత్య నివాస్‌లోకి వెళ్లింది. ఈ లోగా ఆమె తండ్రి బాత్‌రూమ్ కోసం లేవడం, కుమార్తె లేకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి అపార్ట్‌మెంట్ టెర్రస్‌పైన, కింద వెతికారు. ఆచూకీ లేకపోవడంతో ఎదురుగా ఉన్న బాలిక మేనత్త ఇంట్లో ఉందేమోనని వెళ్లి చూశారు. అక్కడ కూడా ఆమె లేకపోవడంతో ఏడుస్తూ.. కేకలు వేశారు. ఇది విన్న ఆమె.. నాన్నకు దొరికిపోతానేమోనన్న భయంతో అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై నుంచి దూకేసింది. బాలిక మృతదేహం చూసి వారంతా షాక్‌కు గురయ్యారు. కుమార్తె మరణించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమార్తె మృతికి కారణమైన నరేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆదిత్య నివాస్‌లో నివాసముంటున్న నరేష్‌తోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వేర్వేరుగా విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో నరేష్ రూమ్‌మేట్స్‌కు సంబంధం లేదని ప్రాథమిక విచారణలో తేలిందని ఇన్‌చార్జి ఏసీపీ తెలిపారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు, నిందితుడు వెల్లడించిన వివరాలు, ప్రాథమిక విచారణ మేరకు నరేష్‌పై లైంగిక దాడులు, అత్యాచారం, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఫోన్ డేటా విశ్లేషిస్తామని, ఫోరెన్సిక్ నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. సమావేశంలో దువ్వాడ సీఐ టి.లక్ష్మి, గాజువాక సీఐ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
పరామర్శించిన నేతలు
మృతురాలి తల్లిదండ్రులు, బంధువులను పలువురు నేతలు పరామర్శించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వి.అనిత, పల్లా శ్రీనివాసరావులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. బాధితుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రశాంతమైన అగనంపూడిలో ఇలాంటి సంఘటన దురదృష్టకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూస్తామని దేవన్‌రెడ్డి మృతురాలి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment