కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక వనరులను సమీకరించుకోవడం, పన్ను వసూళ్లు, ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లకు సంబంధించిన నిధుల పరిపుష్టితోనే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుత పాలకవర్గాలు ఆ దిశగా అడుగులు వేయకుండా, కేవలం ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లపైనే ఆధారపడుతుండటంతో అభివృద్ధి నిదానించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులకు తోడుగా.. గ్రామ పంచాయతీల్లో పన్నులు, పన్నేతరములపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తే ఆయా గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశాలు ఉంటాయి.
గ్రామ పంచాయతీల్లో వసూలు చేయాల్సిన పన్నులు, పన్నేతరములకు సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్ ప్రతి వారం సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండున్నర నెలలు మాత్రమే ఉండడంతో పన్నుల వసూలు వేగం పుంజుకుంది.
సర్పంచుల పాత్ర కీలకం
గ్రామ పంచాయతీ పరిధిలో పన్ను వసూలు చేయడం, వాటిని అభివృద్ధి పనులకు వెచ్చించుకునే విషయంలో గ్రామ సర్పంచులది కీలకపాత్ర. ఆయా గ్రామ పంచాయతీల్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పూర్తిగా గ్రామాభివృద్ధి కోసం వెచ్చించుకునే సౌలభ్యం ఉంది. అయినా వివిధ గ్రామాల సర్పంచులు పన్ను వసూళ్లపై పెద్దగా దృష్టి సారించనట్లు తెలుస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం, ఇతర గ్రాంట్ల పైనే గ్రామ పంచాయతీ పాలకవర్గాలు దృష్టి కేంద్రీకరించాయే తప్ప స్థానిక వనరుల నుంచి పంచాయతీలకు వచ్చే ఆదాయాలను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో పన్నులు(ఇంటి పన్ను, లైబ్రరీ సెస్సు, కుళాయి పన్ను ), పన్నేతరముల (మార్కెట్ వేలాలు, షాపింగ్ అద్దెలు, లైసెన్స్ ఫీజులు, కుళాయి ఫీజులు, భవన నిర్మాణ ఫీజులు) రూపంలో సొంత వనరులను సమీకరించుకోవడంలో సర్పంచులు తమ పాత్రను పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పల్లె ఆదాయాన్ని పెంచేందుకు సమష్టి కృషి
గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని పెంచుకునే అంశంలో క్షేత్ర స్థాయి అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక గ్రామ పంచాయతీల్లో దశాబ్దం క్రితం ఉన్న ఇళ్ల సంఖ్యనే నేటికీ లెక్కల్లో చూపుతున్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో దాదాపు 50 శాతం గ్రామ పంచాయతీలు భౌగోళికంగా విస్తరించాయి. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామ పంచాయతీల్లో కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. అయితే కొత్తగా గ్రామ శివారుల్లో ఏర్పాటవుతున్న కాలనీలు, కొత్త ఇళ్లపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యక్షంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది.
డివిజన్ల వారీగా లక్ష్యాలు
పన్నుల వసూళ్లకు సంబంధించి డివిజన్ల వారీగా లక్ష్యాలను నిర్ణయించాం. ఒక్కో డివిజన్ వారానికి రూ.కోటి వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశాం. అలాగే ముగ్గురు డీఎల్‌పీఓలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. వసూళ్లకు సంబంధించి ప్రతి రోజు జిల్లా కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు పర్యవేక్షిస్తారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలని క్షేత్ర స్థాయిలోని ఈఓఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులను కోరుతున్నాం.
– టి.నాగరాజునాయుడు, జిల్లా పంచాయతీ అధికారి
ప్రజలు ఆసక్తి చూపుతున్నారు
గ్రామాల్లో పన్నులు చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తాము విధులు నిర్వహిస్తున్న గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా పంచాయతీ కార్యాలయానికి వచ్చి చెల్లిస్తున్నారు. అలాగే డివిజన్, జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేస్తాం.
– గురుస్వామి, అధ్యక్షులు, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment